మళ్లీ ముసురు

– కొన్నిచోట్ల భారీ వర్షం
– ప్రాజెక్టుల్లోకి చేరుతున్న వరద
– వాగులో చిక్కుకున్న రైతును కాపాడిన అధికారులు
– నిజాంసాగర్‌ ప్రాజెక్టు ఐదు గేట్లు ఎత్తివేత
– నీట మునిగిన పంట పొలాలు
నవతెలంగాణ- మొఫసిల్‌
కొన్ని రోజులు మొఖం చాటేసిన వర్షాలు.. మళ్లీ వచ్చేశాయి. రెండ్రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి ఓ మోస్తరు వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావం కొనసాగుతోంది. వర్షాలతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాగులు, వంకలు, చెరువులు నీటితో నిండుతున్నాయి. కామారెడ్డి జిల్లాలో వాగులో చిక్కుకున్న రైతును అధికారులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టు ఐదు గేట్లను ఎత్తారు. పంట పొలాలు నీట మునిగాయి.ఉపరితల ఆవర్తనం మంగళవారం నాటికి బలపడి అల్పపీడనంగా మారనుందని వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడన ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్‌లు జారీ చేసింది. తొమ్మిది జిల్లాలకు ఆరెంజ్‌, 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల నిజామాబాద్‌ జిల్లాల్లో ప్రాజెక్టుల్లోకి నీరు చేరుతోంది. సింగూరులోకి భారీగా వరద వస్తోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షం కురిసింది. హిమాయత్‌సాగర్‌, హుసేన్‌ సాగర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేట్‌ నందివాగు ప్రాజెక్టు నిండుతోంది. మోమిన్‌పేట మండలం క్యాసారం వెళ్లే దారిలోని రైల్వే అండర్‌ బిడ్జ్రి కిందికి భారీగా వరద నీరు చేరింది. తాండూర్‌ డిపోకు చెందిన బస్సు సంగారెడ్డి నుంచి తాండూర్‌ వెళ్తున్న క్రమంలో ఈ బ్రిడ్జి వద్దకు రాగానే బస్సు వరదలో చిక్కుకుపోయింది. దీంతో ప్రయాణికులు కేకలు వేశారు. స్థానికులు గమనించి వారిని రక్షించారు. మండలంలో పలుచోట్ల ఇండ్లు కూలిపోయాయి. వికారాబాద్‌ మండల కేంద్రం నుంచి పులిమద్ది గ్రామానికి వెళ్లే దారిలో రైల్వే అండర్‌ బ్రిడ్జి కింద భారీ మొత్తం నీరు వచ్చి చేరడంతో సుమారు మూడు గంటల పాటు రాకపోకలు నిలిచిపోయాయి.
వ్యవసాయ పనుల కోసం వెళ్లిన రైతన్న కామారెడ్డి జిల్లా గాంధారి మండలం మాతు సంగెం, పేట్‌ సంగెం గ్రామాల మధ్య వాగు ఉధృతిలో చిక్కుకుపోయారు. రెండు గ్రామాల మధ్య వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు స్తంభించాయి. ఈ క్రమంలో మాతు సంగెం గ్రామానికి చెందిన రైతు గౌరీ సంగయ్య వాగు ప్రవాహంలో చిక్కుకుపోయారు. సంగయ్యను కాపాడేందుకు స్థానికులు యత్నించారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే జాజల సురేందర్‌, జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆలీ సాగర్‌ నుంచి తెప్పించిన బోటు సహాయంతో సంగయ్యను బయటకు తీసుకొచ్చారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా వర్షం దంచికొట్టింది. అర్ధరాత్రి మొదలై.. తెల్లవారుజాము వరకు భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా.. కాలువలకు, ప్రాజెక్టులకు వరద ఉధృతి నెలకొంది. పలుచోట్ల పంటపొలాలు నీటమునిగాయి. లింగంపేట్‌లో పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు అవతల ముగ్గురు రైతులు చిక్కుకోగా.. పోలీసులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. నిజామాబాద్‌ నగరంలోని చంద్రశేఖర్‌కాలనీ, బైపాస్‌, పాములబస్తీ తదితర లోతట్టు ప్రాంతాలు జలమయమైయ్యాయి. ఇండ్లల్లోకి నీరు వచ్చి చేరింది. బోధన్‌ టౌన్‌లో లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లు జలమయమైయ్యాయి. సదాశివనగర్‌లో వరద ఉధృతికి పొలాలు కొట్టుకుపోగా.. ఇసుక మేటలు వేసింది. లింగంపేట్‌ మండలంలో భారీ వర్షం కురిసింది. దీంతో పెద్దవాగు ఉధృతంగా పొంగిపొర్లింది. నాగారం శివారులో వాగుపై బ్రిడ్డి కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి.
ఎస్సారెస్పీకి, నిజాంసాగర్‌కు వరద
ఎస్సారెస్పీకి, నిజాంసాగర్‌ ప్రాజెక్టులకు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఎస్సారెస్పీకి ఎగువ ప్రాంతాల నుంచి 30 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా రెండు గేట్లు ఎత్తి 5 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అదే విధంగా నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు 36 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుండగా.. ఐదు గేట్లు ఎత్తి దిగువన మంజీరాకు 30 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో కురుస్తున్న వానలు రైతులకు ఎంతో మేలు చేశాయి. కొన్ని ప్రాంతాల్లో చెరువులు, కుంటలు పొంగిపొర్లాయి. సంగారెడ్డి జిల్లా పుల్కల్‌ మండలం సోంపేట గ్రామ శివారులోని సింగూరు పెద్ద కాలువ తెగిపోయింది. నీరంతా గ్రామ పెద్ద చెరువులోకి చేరుతోంది. ఝరాసంగం మండలంలో 53.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. న్యాల్‌కల్‌ మండలం మెటల్‌కుంట – బసంతపూర్‌ వెళ్లే రోడ్డు వంతెన పైనుంచి వర్షం నీరు పారుతోంది. బసంత్‌పూర్‌, కల్‌బేమల్‌ గ్రామాలకు రాకపోకలకు నిలిచిపోయాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌, నంగునూరు మండలాల్లో వర్షం పడింది.

Spread the love