క్షమించండి: నవీన్ పోలిశెట్టి

నవతెలంగాణ – హైదరాబాద్: తన తాజా చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ చిత్రీకరణకు, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు అధికసమయం పట్టినందుకు తనను క్షమించాలని చిత్ర హీరో నవీన్ పోలిశెట్టి అభిమానులను కోరాడు. చాలా కాలం క్రితమే రిలీజ్ కావాల్సిన సినిమా విషయంలో జాప్యం జరిగిందని అభిమానులు భావిస్తుండడంతో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ‘‘మీరు మాపై చూపించే ప్రేమకు మంచి సినిమా తప్ప మేం ఇంకేమీ ఇవ్వలేం. దాన్ని దృష్టిలో పెట్టుకుని చేసిన సినిమా ఇది. కుటుంబ ప్రేక్షకులు చూడదగ్గ మూవీ. సోమవారం నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అవుతాయి’’ అని నవీన్ తెలిపారు. పి.మహేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే చిత్ర బృందంతో పాటూ హీరో నవీన్ పలు నగరాలు సందర్శించి అక్కడి అభిమానులను కలుసుకున్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఓ మాల్‌లో చిత్ర బృందం ‘మీట్ అండ్ గ్రీట్’ నిర్వహించింది. ఈ సందర్భంగా నవీన్ తనదైన శైలిలో కామెడీ పండిస్తూ అభిమానులను అలరించాడు. సినిమా విడుదలలో జాప్యం జరిగినందుకు మన్నించాలని కూడా కోరారు. నవీన్ పోలిశెట్టి చివరి చిత్రం ‘జాతిరత్నాలు’ 2021లో విడుదలైంది.

Spread the love