లైంగిక వేధింపులు భరించలేక..ట్యూటర్‌ను పొడిచి

నవతెలంగాణ – హైదరాబాద్: తనను లైంగిక వేధింపులకు గురిచేస్తున్న 28 ఏళ్ల ప్రయివేట్ ట్యూటర్‌ వసీంను ఓ బాలుడు కత్తితో పొడిచి చంపాడు. ఢిల్లీలోని జామియా నగర్ ప్రాంతంలో జరిగిందీ ఈ ఘటన. నిందితుడైన బాలుడిని పోలీసులు నిన్న అదుపులోకి తీసుకున్నారు. బాలుడు నేరాన్ని అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. ఆగస్టు 30న ఓ ఇంట్లో మృతదేహం పడి ఉందన్న సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడిని వసీంగా గుర్తించారు. ఆ ఇల్లు అతడి తండ్రిదని, కొన్ని రోజులుగా అది ఖాళీగా ఉందని తెలిసింది. బాధితుడు తన కుటుంబంతో కలిసి జకీర్‌నగర్‌లో ఉంటున్నట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు జరిపిన దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. బాలుడిని కొన్ని రోజులుగా వసీం లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు. అంతేకాదు, ఆ ఘటనను వీడియో కూడా తీసి బయటకు చెబితే వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించాడు. ఆగస్టు 30న ఉదయం 11.30 గంటల సమయంలో బాలుడిని మరోమారు పిలిచాడు. అప్పటికే అతడి చేష్టలతో విసిగిపోయిన బాలుడు.. వసీంను చంపాలని నిర్ణయించుకున్నాడు. పేపర్ కటర్‌ను వెంట తీసుకెళ్లిన బాలుడు.. వసీం తనపై లైంగికదాడికి యత్నించిన వెంటనే కత్తితో పొడిచి చంపేసినట్టు పోలీసులు తెలిపారు.

Spread the love