నేను అమెరికా అధ్యక్షుడినైతే ట్రంప్‌కు క్షమాభిక్ష: వివేక్ రామస్వామి

నవతెలంగాణ – హైదరాబాద్: తాను అమెరికా అధ్యక్షుడినైతే డొనాల్డ్ ట్రంప్‌పై నమోదైన కేసుల్లో క్షమాభిక్ష ప్రసాదిస్తానని భారత సంతతి రిపబ్లికన్ నేత వివేక్ రామస్వామి తాజాగా పేర్కొన్నారు. అయితే, తన ప్రధాన లక్ష్యం మాత్రం దేశాన్ని ముందుకు తీసుకెళ్లడమేనని చెప్పారు. ఆదివారం జరిగిన ఓ టీవీ షోలో వివేక్ రామస్వామి పలు విషయాలపై మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ తరుఫున బరిలోకి దిగేందుకు నామినేషన్ కోసం వివేక్, ట్రంప్‌తో పొటీ పడుతున్నారు. పార్టీ నామినేషన్ ట్రంప్‌కే దక్కితే తాను ఆయనకు సంపూర్ణంగా మద్దతిస్తానని స్పష్టం చేశారు. ‘‘ వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అయితే నేను ఆయనకు పూర్తి మద్దతిస్తా. నేను అధ్యక్షుడినైతే ఆయనపై కేసుల్లో క్షమాభిక్ష ప్రసాదిస్తా. అయితే, దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికే నా తొలి ప్రాధాన్యత. చివరాఖరున నేను చెప్పేదేంటంటే, దేశాన్ని ముందుకు తీసుకెళ్లే సామర్థ్యం ఉన్న వారికే నా ఓటు. ఈ బాధ్యతలకు జో బైడెన్‌ సరికాదు. జో బైడెన్ తరువాత వచ్చే కమలా హారిస్ లేదా మరొకరో కూడా ఇందుకు అర్హులు కారు. దేశప్రజల ప్రయోజనాలకు పెద్ద పీట ఎవరు వేస్తారని ఓటు వేసే ముుందు ప్రశ్నించుకుంటా. ఇదేమీ ప్రతికారమో లేదా ఫిర్యాదుతోనో తీసుకునే నిర్ణయం కాదు. ఈ దేశ పౌరుడిగా తీసుకునే నిర్ణయం. దేశంలో ఈ స్ఫూర్తిని మళ్లీ రగిలించాలి. అమెరికా ఫస్ట్ అనే నినాదం డొనాల్డ్ ట్రంప్ కంటే పెద్దది. రాజకీయాలకంటే కూడా ఉన్నతమైనది ’’ అని ఆయన చెప్పుకొచ్చారు.

Spread the love