పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఐదు రోజులు

– సెప్టెంబరు 18 నుంచి 22 వరకు
– పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి వెల్లడి
– అజెండా లేకుండానే సమావేశాలకు నిర్ణయం
– ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ బిల్లు తెచ్చేయత్నం..?
న్యూఢిల్లీ: వచ్చేనెల 18 నుంచి 22 వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఐదు రోజుల పాటు ఇవి కొనసాగనున్నాయి. అయితే, ఈ సమావేశాలకు ఎలాంటి ఎజెండా లేకపోవటం గమనార్హం. కేంద్రం పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి తెలిపారు.అయితే ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ బిల్లు తెచ్చేందుకే మోడీ ప్రభుత్వం అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఉభయసభల్లోనూ మెజార్టీ ఉండటంతో..తాము అనుకున్న విధంగా ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ బిల్లును ప్రవేశపెట్టి నెగ్గించుకోవచ్చని భావిస్తోంది. పైకి మాత్రం ”పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు (17వ లోక్‌సభ 13వ సెషన్‌, రాజ్యసభ 261వ సెషన్‌) సెప్టెంబర్‌ 18 నుంచి 22 వరకు జరగనున్నాయి. అమృత్‌కాల్‌ సమయంలో పార్లమెంటులో ఫలవంతమైన చర్చలకై ఎదురు చూస్తున్నాం” అని కేంద్ర మంత్రి జోషి ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. సెప్టెంబరు 9, 10 తేదీల్లో దేశ రాజధానిలో జీ20 శిఖరాగ్ర సమావేశం జరగనున్నది. ఈ మీటింగ్‌ జరిగిన కొన్ని రోజుల తర్వాత జరిగే ఐదు రోజుల సెషన్‌కు సంబంధించి అధికారికంగా ఎజెండాపై ఎలాంటి ప్రకటనా లేకపోవటం చర్చనీయాంశంగా మారింది. జులై 20న ప్రారంభమైన పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 11న ముగిసిన విషయం తెలిసిందే. ఈ వర్షాకాల సమావేశాల్లో లోక్‌సభ 22 బిల్లులను ఆమోదించగా, రాజ్యసభ 25 బిల్లులను ఆమోదించింది. ఉభయ
సభలు 23 బిల్లులను ఆమోదించాయి.
‘ఒకే దేశం-ఒకే ఎన్నికలు’ వెనుక…?
పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో మోడీ ప్రభుత్వం ‘ఒకే దేశం-ఒకే ఎన్నికలు’ అనే బిల్లును తీసుకురావచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒకే దేశం ఒకే ఎన్నిక అంటే దేశంలో జరగబోయే అన్ని ఎన్నికలు ఏకకాలంలో జరగాలి. ఈ చర్చ దేశంలో చాలా కాలంగా జరుగుతోంది. దీనికి సంబంధించి ఆరు ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని ఈ ఏడాది జనవరిలో లా కమిషన్‌ రాజకీయ పార్టీలను కోరింది. దీన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుండగా..ఇది రాజ్యాంగ విరుద్ధమని కూడా లా కమిషన్‌ పేర్కొంది. ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. యూసీసీ , మహిళా రిజర్వేషన్‌ బిల్లులను కూడా పార్లమెంటు ప్రత్యేక సెషన్‌లో ప్రవేశపెట్టవచ్చనే సంకేతాలిస్తోంది.

Spread the love