Friday, June 26, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఎదురుచూపుల్లో స్పోర్ట్స్‌ అభ్యర్థులు

ఎదురుచూపుల్లో స్పోర్ట్స్‌ అభ్యర్థులు

- Advertisement -

స్టాఫ్ నర్స్ స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీలో జాప్యం
వెరిఫికేషన్ పూర్తయినా ఆర్డర్స్ ఇవ్వడంలో ఆలస్యం

‌నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
స్టాఫ్‌ ‌నర్సు స్పోర్ట్స్‌ ‌కోటా పోస్టుల భర్తీలో వైద్య శాఖ తీవ్ర జాప్యం చేస్తున్నది. వెరిఫికేషన్‌ ‌పూర్తయినా అర్హులను ఎంపికచేసి ఆర్డర్స్‌ ఇవ్వడంలో తాత్సార్యం చేస్తున్నది. మెడికల్‌, హెల్త్‌ ‌సర్వీసెస్‌ ‌రిక్రూట్‌‌మెంట్‌ ‌బోర్డు (ఎమ్‌హెచ్‌ఎస్‌ఆర్‌‌బీ)ని అడిగితే స్పోర్ట్స్‌ అథారిటీ వాళ్ల దగ్గరకు వెళ్లాలనీ, స్పోర్ట్స్‌ అథారిటీ వాళ్లను అడిగితే ఎమ్‌‌హెచ్‌ఎస్‌ఆర్‌‌బీనే సంప్రదించండంటూ అటూ ఇటూ తిప్పుతున్న పరిస్థితి నెలకొంది. తమతో పాటు పరీక్ష‍లు రాసిన వాళ్లు ఉద్యోగాలు చేస్తుంటే వారు మాత్రం తమకు పోస్టింగ్‌ ఎప్పిడిస్తారో అని కండ్లల్లో ఒత్తులేసుకుని ఎదురుచూస్తున్నారు. ఎంహెచ్‌ఎస్‌ఆర్‌‌బీ 2023లో 2000కిపైగా స్టాప్‌ ‌నర్సింగ్‌ ‌పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చింది. దానికి సంబంధించి రిజల్ట్‌ 2024లో విడుదలైంది. మెరిట్‌‌లిస్టు ఏప్రిల్‌ 2026లో ప్రకటించింది. మే 12, 2026న అపాయింట్‌‌మెంట్‌ ఆర్డర్స్‌ ఇచ్చారు. ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్‌ ఆర్డర్స్‌‌ను 9 ఏప్రిల్‌ 2026న ఇచ్చారు. అయితే, స్పోర్స్ట్‌ ‌కోటా కింద కేటాయించిన 40 సీట్లకు సంబంధించిన ఆర్డర్లను మాత్రం ఇప్పటి వరకు ఇవ్వలేదు. వారి మెరిట్‌‌లిస్టు పెట్టారు. 40 పోస్టులకు సంబంధించి 300 మందిని సర్టిఫికెట్ల వెరిఫికేషన్లకు కూడా పిలిచి పూర్తిచేశారు. ఇప్పటి వరకూ స్పోర్ట్స్ లిస్ట్ రిలీజ్ చేయలేదు. స్టాఫ్ నర్స్ స్పోర్ట్స్ కోటాను ఎందుకు ఆలస్యం చేస్తున్నారో అర్థంకాని పరిస్థితి. ఆశావాహులు తమకు ఆర్డర్స్‌ ఎప్పుడు ఇస్తారో అర్థంకాక ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఇదే విషయంపై మెడికల్‌, హెల్త్‌ ‌సర్వీసెస్‌ ‌రిక్రూట్‌‌మెంట్‌ ‌బోర్డు వద్ద ఆరా తీస్తే స్పోర్ట్స్‌ అథారిటీ వద్ద వాళ్లకు వెళ్లండంటూ సూచిస్తున్నారనీ, అక్కడకు వెళ్తే ఆర్డర్స్‌ ఇవ్వాల్సి బోర్డే తమకు సంబంధం లేదని స్పోర్ట్స్‌ అథారిటీ వాళ్లు చెబుతూ అటూ ఇటూ తిప్పుతున్నారని ఆశావాహులు వాపోతున్నారు. వీలైనంత తర్వగా తమకు పోస్టింగ్‌‌లు ఇచ్చి న్యాయం చేయాలని వైద్యారోగ్య మంత్రి దామోదర్‌ ‌రాజనర్సింహను, మెడికల్‌, హెల్త్‌ ‌సర్వీసెస్‌ ‌రిక్రూట్‌‌మెంట్‌ ‌బోర్డును వేడుకుంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -