స్పోర్ట్స్‌ కోటా ఫలితాలను ప్రకటించి జేపీఎస్‌ పోస్టులు భర్తీ చేయాలి

భర్తీ చేయాలిొ– మంత్రి సీతక్కకు తమ్మినేని లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
స్పోర్ట్స్‌ కోటాలో నిర్వహించిన పరీక్షా ఫలితాలను వెంటనే ప్రకటించాలనీ, జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు (జేపీఎస్‌) పోస్టులను భర్తీ చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి డి అనసూయ (సీతక్క)కు గురువారం ఆయన లేఖ రాశారు. స్పోర్ట్స్‌ కోటాలో జేపీఎస్‌ పోస్టుల భర్తీకి రెండేండ్ల క్రితం నిర్వహించిన పరీక్షా ఫలితాలను ప్రకటించి, వారికి ఉద్యోగాలివ్వాలని కోరారు. ఉద్యోగాల భర్తీలో రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 2012, ఆగస్టు తొమ్మిదిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జీవోఎంఎస్‌ నెంబర్‌ 74ను జారీ చేసిందని గుర్తు చేశారు. దాని ప్రకారం రాష్ట్రంలో మిగిలి ఉన్న 172 జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకోసం 2021, సెప్టెంబర్‌ ఆరున గత ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్‌ను జారీ చేసిందని తెలిపారు. రాతపరీక్షను అదే ఏడాది డిసెంబర్‌ 21న నిర్వహించిందని పేర్కొన్నారు. పరీక్ష రాసి రెండేండ్లు గడుస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం నేటికీ వాటి ఫలితాలను వెల్లడిరచలేదని తెలిపారు. దీంతో పరీక్ష రాసి, ఉద్యోగం కోసం ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న అభ్యర్థులు నిరాశా, నిస్పృహలకు గురవుతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం సర్పంచ్‌ల కాలపరిమితి ముగిసిందని వివరించారు. ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్నదని తెలిపారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో మెరుగైన సేవలు ఎంతో అవసరమని సూచించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్‌ కోటాలో నిర్వహించిన పరీక్ష ఫలితాలను వెంటనే ప్రకటించి, జేపీఎస్‌ పోస్టులను భర్తీ చేయాలని ఆయన కోరారు.

Spread the love