రాజన్న సన్నిధిలో శ్రీ సీతారాముల కళ్యాణం..

– శివునితో జోగినిల కళ్యాణం..
– వేలాదిగా తరలివచ్చిన భక్తులు..
– శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్..
– ప్రధాన వీధుల్లో స్వామివారి రథోత్సవం..
నవతెలంగాణ – వేములవాడ 
తెలంగాణకే తలమానికంగా అతిపెద్ద శివ క్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి సన్నిధిలో శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా,  ఆలయ చైర్మన్ గెస్ట్ హౌస్ ఎదురుగా కల్యాణ వేదికను అధికారులు సిద్ధం చేశారు. ఉదయం 9 గంటలకు స్వామివారి ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించనున్నారు.కళ్యాణ వేదికను రంగురంగుల తీరక్క పూలతో అలంకరించి కళ్యాణ వేదికను సిద్ధం చేశారు. స్వామివారికి దేవాలయం తరఫున ఈవో కృష్ణ ప్రసాద్, మునిసిపల్ కమీషనర్ అన్వేష్ పట్టు వస్త్రాలు సమర్పించారు,కళ్యాణ వేడుకలు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు.   శ్రీ క్రోధి  నామ సంవత్సర అభిజిత్ సుముహూర్తమున ఉదయం 11 గంటల 59 నిమిషాలకు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం వైభవంగా కన్నుల పండుగగా అర్చక స్వాముల వేదమంత్రచారణ , భాజా బజంత్రీల మంగళ వాయిద్యాలు మధ్యన కళ్యాణ తంతును కన్యాదాతలుగా రాచకొండ భాను- క్రాంతి దంపతులు చేతుల మీదుగా  కళ్యాణ ఘడియ సమీపించగానే జానకి మాత మెడలో శ్రీరాముడు మాంగళ్యధారణ గావించారు. సీతారాముల కల్యాణాన్ని తిలకించడానికి రాష్ట్ర నలుమూలల నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవాలయ ప్రాంగణంలో చలువ పందిళ్లను, మంచినీటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. కల్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం స్వామి వార్ల ఉత్సవమూర్తులను రథోత్సవంలో ఘనంగా ఊరేగించారు. శ్రీరామ జయ రామ అంటూ.. ఓం నమశివాయ నామస్మరణతో ప్రధాన వీధులు మారుమోగాయి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, డిఎస్పి నాగేంద్ర చారి, సీఐ శ్రీనివాస్, నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, ఏ రెడ్డి రాజిరెడ్డి, వేములవాడ పుర ప్రముఖులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
శివపార్వతుల(జోగిని)ల కళ్యాణం..
శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహా శివరాత్రి తరువాత అంతే వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని దేవాలయ అధికారులు నిర్వహిస్తారు.  దేశంలో మరెక్కడ లేని విధంగా, ఇక్కడ జరిగే సీతారాముల కళ్యాణంలో జోగినీలు శివుడిని తమ భర్తగా భావించి వివాహాలు చేసుకుంటారు. శివుడిని పరిణయం ఆడడం అనే సాంప్రదాయం  దశాబ్దాల కాలం నుండే ఇక్కడ కొనసాగుతోందని ఆలయ అర్చకులు  తెలిపారు.జోగినీలు శివుడిని తమ నాధునిగా భావించి ‘ధారణ’ చేస్తారు కేవలం ఈ వివాహం తంతు కోసమే తెలంగాణ నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్, చత్తీస్గడ్, మహారాష్ట్రల నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చి ఈ వేడుకలు నిర్వహిస్తారు.
శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్
శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో అంగరంగ వైభవంగా జరిగిన కళ్యాణ వేడుకల్లో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని కల్యాణ మహోత్సవాన్ని తిలకించారు.స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆది మాట్లాడుతూ దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి సన్నిధిలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగిందన్నారు. ఆ స్వామివారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని రైతు వర్గంతో పాటు ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నారు.ఆ శ్రీరాముడు ని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలన్నారు. త్రేతా యుగంలో రాముడి పరిపాలన వలె ప్రస్తుతం ప్రజా ప్రభుత్వంలో పాలన కొనసాగిస్తున్నామని అన్నారు.ఆ స్వామివారి ఆశీస్సులతో నియోజకవర్గ, రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని వేడుకున్నట్లుగా తెలిపారు.
Spread the love