అమ్మవార్లకు నిలువెత్తు బంగారం

Standing gold for Ammavars– ప్రతిరోజూ 20 నుంచి 30టన్నుల బెల్లం విక్రయాలు
– సమ్మక్క-సారలక్క జాతర నేపథ్యంలో డిమాండ్‌
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన కుంభమేళాగా పిలువబడే పండుగ సమ్మక్క-సారలమ్మ జాతర. రెండేండ్లకోసారి జరిగే ఈ గిరిజన జాతరకు తెలంగాణతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి కోటి మందికిపైగా తరలివస్తున్నారు. సందర్శకులు అమ్మవార్లకు నిలువెత్తు బంగారం (బెల్లం) మొక్కుగా చెల్లిస్తారు. ప్రతిసారీ సందర్శకుల రద్దీ అంతకంతకూ పెరుగుతుండటంతోపాటు బెల్లానికి భారీ డిమాండ్‌ ఏర్పడింది. ఈ క్రమంలో దాని ధర కూడా పెరిగింది. రెండేండ్లకోసారి జరిగే వనదేవతల జాతర నేపథ్యంలో బెల్లానికి (బంగారం) డిమాండ్‌ ఉంటుంది. మహిళలు మంగళహారతులు చేతబూని బెల్లం దుకాణాల వద్దకు వచ్చి బెల్లంను కొనుగోలు చేస్తారు. పిల్లల నుంచి వృద్ధుల వరకు మొక్కులు అప్పగించే వ్యక్తి తూకంలో ఎన్ని కిలోల బరువు ఉంటే అన్ని కిలోల బంగారం (బెల్లం) కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు.
కుటుంబ సమేతంగా..
మేడారం జాతరకు రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా జనం తరలివస్తున్నారు. ఇదే సమయంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ నుంచి పెద్దఎత్తున రోజూ వెళ్తున్నారు. జాతరలో అమ్మవార్లకు మొక్కులు సమర్పించుకోవడంతో సమ్మక్క సారలమ్మ జాతర పరిసరాల్లో బెల్లానికి భారీ డిమాండ్‌ పెరిగింది. గ్రేటర్‌ హైదరాబాద్‌తోపాటు ఆదిలాబాద్‌, వరంగల్‌, మంచిర్యాల, నిజామాబాద్‌, మెదక్‌ తదితర జిల్లాలతోపాటు మహారాష్ట్ర, కర్నాటక, ఏపీ నుంచి కూడా బెల్లాన్ని దిగుమతి చేసుకుంటున్నారు. ఈ క్రమంలో హౌల్‌ సేల్‌, రిటైల్‌ అమ్మకాలు పెద్దఎత్తున పెరిగాయి. దాంతో ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయి.
నగరంలో సందడి
మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నేపథ్యంలో హైదరాబాద్‌ నగరంలోని హోల్‌సేల్‌ దుకాణాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. ముఖ్యంగా నిలువెత్తు బంగారం(బెల్లం)కు భారీగా డిమాండ్‌ పెరిగింది. నగరంలో బేగంబజార్‌, ఉస్మాన్‌గంజ్‌, మోండా మార్కెట్‌, మలక్‌పేట్‌ మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. వరంగల్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌తోపాటు ఇతర జిల్లాలోని చాలాచోట్లా మినీ మేడారంగా సమ్మక్క సారలమ్మ జాతరలు జరుగుతున్నాయి. దాంతో సాధారణ రోజులకంటే మేడారం జాతర నేపథ్యంలో బెల్లానికి భారీగా డిమాండ్‌ పెరిగింది. సాధారణ రోజుల్లో రూ.40 నుంచి రూ.50రూపాయలకు కిలోబెల్లాని విక్రయిస్తే మేడారం జాతర కారణంగా ప్రస్తుతం కిలో బెల్లం రూ.60 నుంచి 70 రూపాయలకు విక్రయిస్తున్నారు. ప్రతి రోజూ 20 నుంచి 30 టన్నుల వరకు బెల్లాన్ని విక్రయిస్తున్నామని, నాలుగైదు రోజుల్లోనే రూ.కోట్లాది వ్యాపారం జరిగినట్టు వ్యాపారులు అభిప్రాయపడు తున్నారు.
ఒక్కో లారీలో..
గతంతో పోల్చితే ఈ ఏడాది బెల్లం అమ్మకాలు కాస్త పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. ఒక్కో లారీలో ఒక్కో ముద్ద (పది కిలోలు) చొప్పున ఉండే 1600 ముద్దలు (16 టన్నులు) ఎగుమతి చేస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది బెల్లం కిలోకు రూ.60 నుంచి రూ.70 వరకు ధర పలుకుతోందని ఉస్మాన్‌గంజ్‌ వ్యాపారి ఏం.నర్సింహులు వివరించారు. అదే పెద్ద షాపింగ్‌ మాల్స్‌లో అయితే కిలో బెల్లం రూ.70 నుంచి రూ.80 వరకు విక్రయిస్తున్నారు.

Spread the love