కర్ర స్తంభాలే దిక్కాయే!

నవతెలంగాణ- సంస్థాన్‌ నారాయణపురం
మండలంలో విద్యుత్తు లూస్‌ లైన్లు రైతులను,వాహన దారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. విద్యుత్తు లూజు లైన్‌ ల వల్ల ప్రమాదం పొంచి ఉన్నా అధికారులు పట్టించుకోని పరిస్థితి దాపురించిందని పలువురు రైతులు వాపోతున్నారు.విద్యుత్‌ అధికారులకు చెప్పి విసిగి వేసారిన రైతులు కొంతమంది విద్యుత్‌ లూజు వైర్లను పైకి ఎత్తెందుకు కర్ర స్తంభాలను ఏర్పాటు చేసుకున్న పరిస్థితి మండలంలో నెలకొంది.మండల కేంద్రము నుండి గాంధీ నగర్‌ తండా,మూడు గుడిసెల తండా,గంగ మూల తండా, వాచ్య తండ, కడప గండి తండా,బోటు మీ తండా, పోర్లగడ్డ తండా లకు వెళ్లేందుకు నిర్మించబడ్డ రోడ్డులో విద్యుత్తు లూజు లైన్లు వున్నాయి. ఈ రోడ్డు వెంట వెళ్లే వరి ధాన్యం తరలింపు లారీలు,గడ్డి ట్రాక్టర్ల యజమానులు కర్రలతో వైర్లు పైకెత్తి వెళ్తున్నారు.ఆద మరిచి వెళ్తే అంతే సంగతులు. అనేకసార్లు వైర్లు ఆనుకుని మంటలు లేచి సమీపంలోని వ్యవసాయ బావుల వద్ద మోటర్లు కాలిపోయిన పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పిన పట్టించుకోకపోవడంతో తాత్కాలికంగా కర్ర స్తంభాల ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు జోక్యం చేసుకొని వెంటనే లూస్‌ లైన్లను సరిచేసి నూతనంగా స్తంభాలను నిర్మించాలని కోరుతున్నారు.

Spread the love