– అశోక్‌నగర్‌లో తీవ్ర ఉద్రిక్తత
– న్యాయం చేయాలంటూ పోటీపరీక్షల అభ్యర్థుల డిమాండ్
– భారీగా మోహరించిన పోలీసులు
నవతెలంగాణ-సిటీ బ్యూరో
హైదరాబాద్ అశోక్‌నగర్‌లో డీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలిసి అక్కడి కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకుంటున్న వందలాదిమంది అభ్యర్థులు ఘటనా స్థలికి చేరుకొని ఆందోళన చేపట్టారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ జిల్లా పొనెకల్‌కు చెందిన ప్రవల్లిక అశోక్‌నగర్‌లోని బృందావన్ హాస్టల్‌లో ఉంటూ డీఎస్సీతో పాటు ఇతర పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకుంటు న్నది. ఈసారి ఎలాగైనా డీఎస్సీలో ఉత్తీర్ణత సాధించి, ఉద్యోగం సాధించాలనే తపనతో ఆమె చురుగ్గా శిక్షణ తీసుకుంటున్నదని తోటి విద్యార్థులు చెప్పారు. డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే గ్రూప్-1 పరీక్షలు కూడా రెండుసార్లు రద్దు అయ్యి, వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో ఇప్పట్లో డీఎస్సీ సాధించే అవకాశం లేకపోవడం, తీసుకున్న శిక్షణ వృధా అవుతుందనే ఆందోళనతో ప్రవల్లిక తీవ్ర ఒత్తిడికి లోనై హాస్టల్‌లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. ఈ విషయం తెలిసిన వెంటనే యూత్ కాంగ్రెస్ నేత అనిల్‌కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న యువకులు సంఘటనా స్థలానికి తరలివచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు ప్రవల్లిక మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించేందుకు ప్రయత్నించగా, అడ్డుకున్నారు. ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతుందంటూ తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యారు. పోలీసులు వారిని శాంతింపచేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అర్థరాత్రి వరకు ప్రవల్లిక మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది.