– ఫిబ్రవరి 1న చెన్నైలో ఐక్య ర్యాలీ
– బీజేపీని ఓడించాలి.. దేశాన్ని కాపాడాలి
– విద్యారంగాన్ని కాపాడాలి… ఎన్‌ఈపీని తిప్పికొట్టాలి
– 16 విద్యార్థి సంఘాల ఐక్య కార్యచరణ పిలుపు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
‘రాజ్యాంగాన్ని, దేశాన్ని కాపాడాలి. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలి. విద్యారంగాన్ని పరిరక్షించాలి. జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)ని తిప్పికొట్టాలి” అంటూ దేశంలో ఎస్‌ఎఫ్‌ఐ సహా 16 విద్యార్థి సంఘాలు ఐక్యంగా జనవరి 12న పార్లమెంట్ మార్చ్‌కు పిలుపునిచ్చాయి. మంగళవారం ఈ మేరకు స్థానిక ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో 16 విద్యార్థి సంఘాల నేతలు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ ప్రధాన కార్యదర్శి మయూక్ బిశ్వాస్ మాట్లాడుతూ క్యాంపస్‌లు పోరాట కేంద్రాలుగా నిలుస్తాయని అన్నారు. కాషాయీకరణే ధ్యేయంగా అమలుచేస్తున్న నూతన విద్యా విధానం (ఎన్‌ఈపీ) వెనక్కి తీసుకోవాలని, నీట్ పరీక్షలను ఉపసంహరించుకోవాలని, విద్య, ఉపాధి హామీ కోసం భగత్‌సింగ్ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలనీ, ‘రోహిత్ వేముల’ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కుల వివక్షను అంతం చేయడానికి, అన్ని క్యాంపస్‌లలో బాలికలపై హింసను నిరోధించడానికి జిఎస్ క్యాస్ ఏర్పాటు చేయాలని, దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. రెండు లక్షల మంది విద్యార్థులు పార్లమెంటుకు పాదయాత్ర చేస్తారని ప్రకటించారు. ఫిబ్రవరి 1న చెన్నైలో ఐక్య ర్యాలీ నిర్వహించనున్నట్టు తెలిపారు. ప్రతిపక్ష నేతలను కలిసి విద్యార్థి ఫ్రంట్ డిమాండ్లను ‘ఇండియా’ కూటమి ఎన్నికల ఎజెండాలో చేర్చాలని కోరనున్నట్టు తెలిపారు. విద్యార్థుల మార్చ్‌ను అడ్డుకునేందుకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, ఢిల్లీ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారనీ, ఏది ఏమైనా తాము కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
2025లో ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది పూర్తి చేసుకోనుందనీ, సంఫ్‌ు పరివార్ దాడులకు గురవుతున్న దేశ ప్రజాస్వామ్య లౌకిక విలువలు, రాజ్యాంగాన్ని కాపాడేందుకు విద్యార్థులు సంఘటిత శక్తిగా మారాలని ఏఐఎస్‌ఎఫ్ ప్రధాన కార్యదర్శి దినేశ్ సీరంగరాజ్ పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో డీఎంకె స్టూడెంట్ వింగ్ కార్యదర్శి, కాంచీపురం ఎమ్మెల్యే సీవీఎంపీ ఎజిఅరసన్, ఏఐఎస్‌ఏ అధ్యక్షుడు నీలాశిష్ బోస్, ఎన్‌ఎస్‌యూఐ ప్రధాన కార్యదర్శి నితీశ్ గౌర్, ఏఐఎస్‌బీ కన్వీనర్ సౌమ్యదీప్ సర్కార్, సీఆర్జేడీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక భారతి, సీవైఎస్‌ఎస్ తదితరులు పాల్గొన్నారు.