రాచకొండ కమిషనర్‌ ఆకస్మిక బదిలీ

Rachakonda Commissioner Sudden transfer– మరో 11 మంది ఐపీఎస్‌లకు స్థాన చలనం
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి : రాష్ట్రంలో 12 మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ముఖ్యంగా, రాచకొండ పోలీసు కమిషనర్‌ సుధీర్‌బాబు ను ఆకస్మికంగా బదిలీ చేయటమే కాక, మరో ఇద్దరు కమిషనర్లకు ఇటీవలన ఇచ్చిన నియామక పత్రాలను రద్దు చేసి వేరే పోస్టుకు మార్చారు. రాచకొండ నూతన కమిషనర్‌గా మల్టీజోన్‌-2 ఐజీ తరుణ్‌ జోషిని నియమించి, ఇక్కడున్న కమిషనర్‌ సుధీర్‌బాబును మల్టీజోన్‌-2 ఐజీగా పోస్టింగ్‌ ఇచ్చారు. అలాగే, మల్టీజోన్‌-1ను కూడా అదనంగా సుధీర్‌బాబుకు అప్పగించారు. పోస్టింగ్‌ కోసం ఎదురు చూస్తున్న డీఐజీ ఎం శ్రీనివాసులును రామగుండం కమిషనర్‌గా నియమించి.. ఇటీవలనే ఇక్కడి కమిషనర్‌గా నియమితులైన డీఐజీ ఎల్‌.ఎస్‌ చౌహాన్‌ పోస్టింగ్‌ను రద్దు చేసి తిరిగి ఆయనను జోగులాంబ గద్వాల్‌ జోన్‌-7 డీఐజీగా నియమించారు. గతంలో జోగులాంబ డీఐజీగా పోస్టింగ్‌ పొందిన జోయెల్‌ డేవిస్‌ను ఆ పోస్ట్‌ నుంచి మార్చి సైబరాబాద్‌ ట్రాఫిక్‌ జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌గా బదిలీ చేశారు. ఈ పోస్ట్‌లో ఉన్న జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌ కె. నారాయణ్‌ నాయక్‌ను సీఐడీ ఎస్సీఆర్బీగా ట్రాన్స్‌ఫర్‌ చేశారు. రాష్ట్ర మహిళా భద్రతా విభాగం ఎస్పీ కె. అపూర్వ రావును టీఎస్‌ఆర్టీసీ విజిలెన్స్‌ ఎస్పీగా, టీఎస్‌ ట్రాన్స్‌కో ఎస్పీ ఉదరుకుమార్‌ రెడ్డిని నగర సౌత్‌ వెస్ట్‌ జోన్‌ డీసీపీగా, రాచకొండ ఎస్‌ఓటీ డీసీపీ ఆర్‌.గిరిధర్‌ను నగర తూర్పు మండలం డీసీపీగా నియమించారు. పోస్ట్‌ కోసం ఎదురు చూస్తున్న ఎస్పీ మురళీధర్‌ను రాష్ట్ర పోలీసు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా నియమించి.. ఇక్కడున్న డాక్టర్‌ బి. నవీన్‌ కుమార్‌ను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాలని ఆదేశించారు. రాజేంద్రనగర్‌ అదనపు డీసీపీ సాధన రశ్మీ పెరుమాల్‌ను బదిలీ చేసి నగర టాస్క్‌ఫోర్స్‌ డీసీపీగా నియమించారు.

Spread the love