ఆత్మహత్యలు కావవి…హత్యలే

Suicides are murders– పెరుగుతున్న గృహిణుల మరణాలు
– అత్తింటి వేధింపులే ప్రధాన కారణం
– తోడవుతున్న సామాజిక సమస్యలు
– పురుషాధిక్య ప్రపంచంలో వీరి గోడు వినేదెవరు?
దేశంలో మహిళలు అనేక రంగాలలో పురోభివృద్ధి సాధిస్తున్నప్పటికీ ఇప్పటికీ వారిని ఇంటి పని మనిషిగానే పరిగణిస్తున్నారు. ఇది నిష్టుర సత్యం. వాస్తవానికి చాలా మంది గృహిణులు ఇంటి పనికే పరిమితమవుతూ బండెడు చాకిరీ చేస్తున్నారు. వారికి నిర్దిష్ట పని గంటలు, వారాంతపు సెలవు దినాలు ఉండవు. పైగా అత్తింటి వేధింపులు అదనం. ఈసడింపులు, ఛీత్కారాలు నిత్యకృత్యం. జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) ఇటీవల విడుదల చేసిన నివేదిక పలు చేదు నిజాలను బయటపెట్టింది.
న్యూఢిల్లీ:
గత సంవత్సరం దేశవ్యాప్తంగా 25,309 మంది గృహిణులు బలవన్మరణానికి పాల్పడ్డారని ఆ నివేదిక తెలిపింది. గత ఐదు సంవత్సరాలతో పోలిస్తే 2022లో చోటుచేసుకున్న గృహిణుల ఆత్మహత్యల సంఖ్యే అధికంగా ఉంది. మొత్తం ఆత్మహత్యలలో ఇది 14.8% కావడం ఆందోళన కలిగించే విషయం.
2021లో 23,178 మంది, 2020లో 22,372 మంది గృహిణులు ప్రాణాలు తీసుకున్నారు. గత ఐదు సంవత్సరాలలోనే కాదు. ఎన్‌సీఆర్‌బీ 1997 నుండి వృత్తిపరమైన ఆత్మహత్యల సమాచారాన్ని సేకరిస్తోంది. అప్పటి నుండి ఇప్పటి వరకూ ప్రతి సంవత్సరం 20 వేల మందికి పైగానే గృహిణులు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. 2009లో ఈ తరహా ఆత్మహత్యలు 25,092 నమోదయ్యాయి. 2021 వరకూ అదే అత్యధికం. గత సంవత్సరపు ఆత్మహత్యల సంఖ్య ఈ రికార్డును అధిగమించింది. ఈ ఆత్మహత్యలన్నింటికీ ‘కుటుంబ సమస్యలు’ లేదా ‘వివాహ సంబంధమైన విషయాలు’ కారణమని ఎన్‌సీఆర్‌బీ చెబుతోంది. అయితే సంవత్సరాల తరబడి వేలాది మంది గృహిణులు ఎందుకు అర్థాంతరంగా ప్రాణాలు తీసుకుంటున్నారన్నదే ఇక్కడ ప్రశ్న. నిజం చెప్పాలంటే ఇవి ఆత్మహత్యలు కావు. హత్యలే.
రైతుల కంటే అధికమే
గత కొన్ని సంవత్సరాలకు సంబంధించి ఎన్‌సీఆర్‌బీ అందించిన సమాచారాన్ని పరిశీలిస్తే ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో ఎక్కువ మంది దినసరి వేతన కార్మికులే. గృహిణులు, స్వయం ఉపాధి పొందిన వారు, నిరుద్యోగులు, విద్యార్థులు, అన్నదాతలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 2018-2022 మధ్య కాలంలో ప్రతి ఏటా ఆత్మహత్యలు చేసుకున్న గృహిణుల సంఖ్య బలవన్మరణానికి పాల్పడిన రైతులతో పోలిస్తే రెట్టింపు కంటే అధికంగా ఉంది. ఇది నిజంగా కలవరపరిచే విషయమే.
సామాజిక సమస్యే
గృహిణుల ఆత్మహత్యలను కుటుంబ లేదా వ్యక్తిగత సమస్యగా ఎన్‌సీఆర్‌బీ చూస్తోంది. కానీ ఇది తీవ్రమైన సామాజిక సమస్య. పితృస్వామ్య వ్యవస్థ, నిరుద్యోగం, కులం, పేదరికం, వనరుల కొరత, మానసిక ఆరోగ్యంపై అవగాహన లేకపోవడం…ఇవన్నీ గృహిణుల బలవన్మరణానికి…కాదు…కాదు హత్యలకు కారణాలే. ఎన్‌సీఆర్‌బీ నివేదికను లోతుగా అధ్యయనం చేస్తే మహిళలు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధానంగా వరకట్నమో లేక సంతాన లేమో కారణంగా కన్పిస్తుంది.
అత్తింటి ఆరళ్లే కారణం
మహిళలు ఉద్యోగాలను సైతం త్యాగం చేసి కుటుంబం కోసమే పాటుపడుతున్నారంటూ కొందరు ప్రశంసిస్తున్నారు. అదే సమయంలో ఇంటి పనికే పరిమితమవుతున్న గృహిణు ల మానసిక, శారీరక, భావోద్వేగ అవసరాలను పూర్తిగా విస్మరిస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో ఎన్‌సీఆర్‌బీ విడుదల చేసిన సమాచారాన్ని విశ్లేషిస్తే 2016-2021 మధ్యకాలం లో మహిళలపై జరిగిన ప్రతి మూడు నేరాలలో రెండు నేరాలు వారి భర్త లేదా అతని బంధువులు పాల్పడినవేనని తేలింది. దేశంలో మహిళలపై జరుగుతున్న దాష్టీకాలు, అ ఘాయిత్యాలు, దౌర్జన్యాలకు వారి భర్తలో లేదా అతని బంధు వులో కారణమని గణాంకాలు వేలెత్తి చూపుతున్నాయి.
ఫిర్యాదుకు వెనకడుగు
ఈ గణాంకాలు వాస్తవ పరిస్థితిలో కేవలం ఓ చిన్న భాగానికి మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నాయని మహిళా హక్కుల కార్యకర్త అమృతా జోహ్రీ తెలిపారు. వాస్తవానికి మహిళలపై జరుగుతున్న అనేక నేరాలు వెలుగు చూడడం లేదు. కులం, సంస్కృతి, పురుషాధిక్యం, పోలీసులు లేదా సమాజం పట్ల భయం వంటి కారణాలతో బాధిత మహిళలు, వారి బంధువులు పోలీసులను ఆశ్రయించడం లేదు. ఇప్పటికీ కుటుంబాలలో పురుషాధిక్యత కొట్టొచ్చినట్లు కన్పిస్తోంది. గృహ హింస తగ్గుముఖం పట్టకపోవడానికి ఇది ప్రధాన కారణమని అమృత అంటారు. ఇంటిలో కొడుకు, కూతురు మధ్య చూపే తేడా చివరికి కోడలి పట్ల వేధింపులకు కారణమవుతోంది. ఇక గృహిణుల మానసిక స్థితిని పట్టించుకోకపోవడం లేదా అవసరమైన చికిత్స చేయించకపోవడం వల్ల వారు నిరాశానిస్పృహలకు లోనై చివరికి ప్రాణాలు తీసుకుంటున్నారు. కాబట్టి సకాలంలో సమస్యను గుర్తించడం చాలా అవసరం. అలాంటి మహిళలకు కుటుంబం, సమాజం సానుకూల వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరం ఉంది.
ఆర్థిక స్వాతంత్య్రం కరువు
2021లో ప్రభుత్వం నిర్వహించిన ఓ సర్వేలో…తమ భర్తలు గృహహింసకు పాల్పడుతున్నారంటూ 30% మంది మహిళలు తెలిపారు. ప్రతిరోజూ జరుగుతున్న దాష్టీకాల కారణంగా గృహిణులు అణచివేతకు గురవుతూ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇక్కడ గమనించాల్సిన మరో విషయ మేమంటే ఇంటి పనిలో ఉండే మహిళలకు ఆదాయ వనరు అంటూ ఏమీ ఉండదు. ప్రతి రూపాయి కోసం భర్తపై ఆధారప డాల్సిన పరిస్థితి. వారికి ఆర్థిక స్వాతంత్య్రం అంటూ ఏమీ ఉండదు. దీనివల్ల వినోదం, శారీరక లేదా మానసిక వైద్యం వంటి కనీస అవసరాల ను వారు సొంతగా తీర్చుకోలేక పోతున్నారు. పైగా విద్య, అవగాహన లేక పోవడం తో వారికి తమ హక్కు లు తెలియడం లేదు.
కోరికలకు సమాధి కట్టి…
ఎంతటి కష్టాలు వచ్చినా సహనంతో భరించాలంటూ మహి ళలకు పితృస్వామ్య వ్యవస్థ బోధిస్తుంది. అనేక మంది బాలికలకు చిన్న వయసులోనే, మానసిక వికాసం కలగకముందే వివాహం చేస్తున్నారు. ఫలితంగా వారు ఆ వయసులోనే గృహిణిగా, కోడలిగా బాధ్యతలు మోస్తూ రోజంతా ఇంటిపని, వంటపనికే పరి మితమవుతున్నారు. ఇంత చేస్తున్నా వారిపై లెక్కలేని ఆంక్షలు విధిస్తారు. స్వేచ్ఛ కూడా చాలా తక్కువగానే లభి స్తుంది. తమ కనీస అవసరాల కోసం డబ్బు సంపాదిం చుకునే అవకాశాలు కూడా ఉండవు. ఇలాంటి వాతావరణం లో వారు విద్యావంతులు ఎలా అవుతారు? తమ కలల్ని ఎలా నెరవేర్చుకుంటారు? చివరికి వారు తమ కోరికలు, లక్ష్యాలకు సమాధి కడతారు. నిరుత్సాహానికి లోన వుతారు. తమలో తాము ఉక్కిరిబిక్కిరై సహన శక్తిని కోల్పో తారు. అంతిమంగా ఆత్మహత్యకు పాల్పడి తనువు చాలిస్తారు.
శిక్షలు తక్కువే
మహిళలు తమపై జరుగుతున్న అకృత్యాలపై గళం విప్పి పోలీసులను ఆశ్రయించినా పెద్దగా ఫలితం ఉండడం లేదు. పోలీస్‌ స్టేషన్‌, న్యాయస్థానం చుట్టూ తిరగడం తోనే సమయం సరిపోతోంది. 2021తో పోలిస్తే 2022లో మహిళలపై నేరాలకు పాల్పడిన వారికి శిక్ష పడిన కేసుల సంఖ్య 3% తగ్గింది. మహిళలపై జరుగుతున్న నేరాలలో 54.2% నేరాల లోనే శిక్షలు పడుతున్నాయి. కోవిడ్‌ సమయంలో అంటే 2020లో 59% నేరాలకు శిక్ష పడింది. 2022లో న్యాయస్థానాల్లో ఏకంగా 89% కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. పోలీస్‌ స్టేషన్‌, కోర్టు చుట్టూ తిరుగుతుండడం అంత తేలిక కాదు. సంవత్సరాల తరబడి కేసులు అపరిష్కృతంగా ఉంటున్నాయి. ఆత్మహత్యలకు మన దేశంలో పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. పత్రికలలో మాత్రమే అవి పతాక శీర్షికలుగా ఉంటున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటికీ పెద్దగా అవగాహన ఉండడం లేదు. గ్రామాలలో మహిళలు ఆత్మహత్య చేసుకుంటే శవపరీక్ష కూడా చేయడం లేదు. వాటిని ప్రమాదవశాత్తూ జరిగిన మరణంగా చిత్రిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మహిళాభ్యున్నతిపై ప్రభుత్వాలు, పార్టీలు చెప్పే మాటలు కేవలం ఎన్నికల నినాదాలుగానే మిగిలిపోతున్నాయి. ఆత్మహత్య చేసుకోవాలన్న భావనకు లోనయ్యే మహిళలు ఒక్క నిమిషం ఆలోచించి, ఆసరా వెబ్‌సైట్‌ ద్వారా సాయం పొందేందుకు ప్రయత్నించాలి. పలు ప్రభుత్వ, ప్రభుత్వేతర హెల్ప్‌లైన్లను కూడా సంప్రదించి స్వాంతన పొందవచ్చు.
పుక్కిటి పురాణాలు తలకెక్కి…
మానసిక అనారోగ్యానికి గురవుతున్న మహిళలు తమ సమస్యను బయటికి చెప్పుకోలేకపోతున్నారు. పుక్కిటి పురాణాలు కూడా మహిళల్ని చీకట్లోకి నెడుతున్నాయి. చిన్నప్పటి నుండే వారికి త్యాగాలు, తల్లిప్రేమ వంటి విషయాలను తలకెక్కిస్తారు. దీంతో వారు తమ గురించి కూడా ఆలోచించే శక్తిని కోల్పోతారు. మోనోపాజ్‌ దశకు చేరిన మహిళల్లో మానసిక ఒత్తిడి, చికాకు అధికంగా ఉంటాయి. ఇవి తీవ్రమైనవి కాకపోయినప్పటికీ వాటి వాస్తవికతలు, ప్రభావం మాత్రం తీవ్రంగానే ఉంటాయి. ఇలాంటి సమయాలలోనే వారి పట్ల సున్నితంగా వ్యవహరించాల్సి ఉంటుంది.

Spread the love