Thursday, May 14, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంయుద్ధాన్ని ఆపే తీర్మానాన్ని సమర్ధించండి

యుద్ధాన్ని ఆపే తీర్మానాన్ని సమర్ధించండి

- Advertisement -

వాషింగ్టన్ : ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సాగిస్తున్న యుద్ధాన్ని ఆపేందుకు డెమొక్రాట్లు తమ వంతు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. యుద్ధాన్ని ముగించేందుకు ట్రంప్ నిరాకరించడంతో అమెరికా ప్రజలు గ్యాలన్ గ్యాస్ కోసం నాలుగున్నర డాలర్లు చెల్లించాల్సి వస్తోందని సెనెటర్ ఛుక్ స్క్రూమర్ విమర్శించారు. ధరలను అదుపు చేసి, సైనిక దళాలకు బాసటగా నిలవాలని రిపబ్లికన్లు నిజంగా కోరుకుంటుంటే డెమొక్రాట్లు ప్రవేశపెట్టిన వార్ పవర్స్ తీర్మానానికి మద్దతు ఇవ్వాలని కోరారు. యుద్ధాన్ని ఆపేందుకు బిల్లు ప్రవేశపెట్టడానికి డెమొక్రాట్లు ఏడోసారి ప్రయత్నిస్తున్నారు.

హార్ముజ్ మిషన్‌కు బ్రిటన్ విమానాలు, డ్రోన్లు
హార్ముజ్ జలసంధిలో ప్రయాణించే వాణిజ్య నౌకలకు రక్షణ కల్పించడానికి ఉద్దేశించిన ప్రపంచ దేశాల మిషన్‌కు మద్దతుగా బ్రిటన్ యుద్ధ విమానాలు, డ్రోన్లు, రాయల్ నేవీ యుద్ధ నౌకను పంపుతోంది. హార్ముజ్‌లో ఇరాన్ అమర్చిన మందుపాతరలను గుర్తించే వ్యవస్థలను, టైఫూన్ యుద్ధ విమానాలను, డిస్ట్రాయర్ హెచఎంఎస్ డ్రాగాన్‌ను పంపుతానని బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది.

హార్ముజ్ మా ఆధీనంలో ఉంది : పెంటగాన్
హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకలు తమ నియంత్రణలోనే ఉన్నాయని పెంటగాన్ తెలిపింది. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సేథ్ ప్రతినిధిసభ కమిటీ ఎదుట మాట్లాడుతూ ఎట్టకేలకు హార్ముజ్ తమ అధీనంలోకి వచ్చిందని, తమ అనుమతి లేకుండా ఏ నౌక జలసంధిలో ప్రవేశించలేదని చెప్పారు. ప్రస్తుతం నెలకొన్న ప్రతిష్టంభన కారణంగా అమెరికా కంటే ఇరాన్‌కే ఎక్కువ నష్టమని తెలిపారు. ‘మనపై కంటే వారి పైనే ఎక్కువ ఆర్థిక ఒత్తిడి ఉంటుంది’ అని ఆయన శాసనకర్తలతో అన్నారు.

ఆకాశాన్ని తాకుతున్న వినియోగ వస్తువుల ధరలు
ఇరాన్ యుద్ధం కారణంగా ఇంధన ధరలు పెరగడంతో అమెరికాలో వినియోగ వస్తువుల ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. ఏప్రిల్‌తో పోలిస్తే కార్మిక శాఖ వినియోగ ధరల సూచిక 3.8 శాతం పెరిగింది. మార్చిలో కంటే ఏప్రిల్‌లో ధరలు 0.6 శాతం పెరిగాయి. గ్యాసోలిన్ ధరలు 5.4 శాతం పెరిగాయి. సంవత్సరం క్రితం ధరలతో పోలిస్తే గ్యాసోలిన్ ధరలు 28 శాతానికి పైగా పెరిగాయని కార్మిక శాఖ మంగళవారం విడుదల చేసిన డేటా చెబుతోంది. వినియోగ వస్తువుల ధరలు మార్చి నుంచి పెరుగుతూనే ఉన్నాయని ఆ డేటాను బట్టి తెలుస్తోంది. కిరాణా సరుకుల ధరలు మార్చితో పోలిస్తే ఏప్రిల్‌లో 0.7 శాతం పెరిగాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థను ద్రవ్యోల్బణం పట్టి పీడిస్తోందని నేవీ ఫెడరల్ క్రెడిట్ యూనియన్‌లో ప్రధాన ఆర్థికవేత్తగా పనిచేస్తున్న హీథర్ లాంగ్ చెప్పారు. గత మూడు సంవత్సరాలలో మొదటిసారిగా ద్రవ్యోల్బణం జీతాల పెరుగుదల సంతోషాన్ని ఆవిరి చేసింది. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలకు ఇది అశనిపాతంగానే పరిణమించింది. ఆయా కుటుంబాలకు ఆచితూచి ఖర్చు పెట్టాల్సిన అగత్యం ఏర్పడింది. వర్ల్‌పూల్ వంటి ప్రముఖ కంపెనీల ఆదాయం పడిపోయింది.

బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశానికి ఇరాన్, రష్యా
గురు, శుక్ర వారాల్లో న్యూఢిల్లీలో జరగబోయే బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశానికి ఇరాన్, రష్యా హాజరవు తాయి. ఈ సమావేశానికి తాము వస్తున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్‌రోవ్ ధృవీకరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బీజింగ్‌లో పర్యటిస్తున్నందున చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఈ బ్రిక్స్ సమావేశానికి రావడం లేదు. అయితే భారత్‌లో చైనా రాయబారి గా పనిచేస్తున్న ఫెయిహాంగ్ తన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ సమావేశంలో పాల్గొంటారు.

పశ్చిమాసియా పోరుపై 11 దేశాల బ్రిక్స్‌లో ఏకాభిప్రాయం కుదరడం లేదు. బ్రిక్స్ సభ్యదేశాలైన యూఏఈ, సౌదీ అరేబియా, ఇరాన్ పరస్పర విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. ప్రస్తుతం బ్రిక్స్‌కు భారత్ అధ్యక్షత వహిస్తున్న విషయం తెలిసిందే. తనపై అమెరికా, ఇజ్రాయిల్ జరుపుతున్న దాడులను ఖండిస్తూ బ్రిక్స్ తరఫున ఓ ప్రకటన చేయాలని ఇరాన్ గతంలోనే భారత్‌ను కోరింది. అయితే సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో గత నెల 24న బ్రిక్స్ చైర్మెన్ హోదాలో భారత్ ఒక ప్రకటన చేసింది. ‘మధ్యప్రాచ్యంలో ఇటీవలి ఘర్షణలపై సభ్యదేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తమ అభిప్రాయాలు, అంచనాలు తెలియజేశాయి’ అని అందులో వివరించింది.

మధ్యవర్తిత్వంపై చైనాతో పాక్ చర్చలు
పాకిస్తాన్, చైనా విదేశాంగ మంత్రులు ఇషాక్ దార్, వాంగ్ ఈ మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణలో ఇరాన్`అమెరికా మధ్య ఇస్లామాబాద్ జరపుతున్న మధ్యవర్తిత్వ ప్రయత్నాలు చర్చకు వచ్చాయి. ఇరాన్, అమెరికా మధ్య చర్చలు కొనసాగేలా చూసేందుకు తాము జరుపుతున్న ప్రయత్నాలను వాంగ్‌కు ఇషాక్ వివరించారు. పాక్ నిర్వహిస్తున్న నిర్మాణాత్మక మధ్యవర్తిత్వ ప్రయత్నాలను వాంగ్ ప్రశంసించారని పాకిస్తాన్ విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. కాల్పుల విరమణ చిరకాలం కొనసాగాలని, హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలు స్వేచ్ఛగా రాకపోకలు సాగించాలని ఇరు దేశాలు అభిప్రాయపడ్డాయి.

యుద్ధం ఖర్చుపై డెమొక్రాట్ల మండిపాటు
తప్పుడు లెక్కలు చెబుతోందని పెంటగాన్‌పై ధ్వజం

పశ్చిమాసియాలో ఇరాన్, అమెరికా మధ్య పది వారాల పాటు కొనసాగిన యుద్ధం కారణంగా అంతర్జాతీయ ఇంధన ధరలు గరిష్ట స్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఒక్క మంగళవారం నాడే ఇంధన ధరలు మూడు శాతం మేర పెరిగాయి. మరోవైపు టెహ్రాన్‌పై యుద్ధానికి అయిన ఖర్చుపై అమెరికా కాంగ్రెస్‌లో వాడి వేడి చర్చ జరిగింది. 2027వ సంవత్సరానికి దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన ఒకటిన్నర ట్రిలియన్ డాలర్ల సైనిక బడ్జెట్‌ను రక్షణ మంత్రి పీట్ హెగ్‌సేథ్ సమర్ధించారు. ప్రతినిధిసభలో డెమొక్రాట్, రిపబ్లికన్ సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమలులోనే ఉన్నదని హెగ్‌సేథ్ తెలిపారు.

గత నెల 29న జరిగిన హౌస్ ఆర్మ్‌డ్ సర్వీసెస్ కమిటీ విచారణ సందర్భంగా ఇరాన్‌పై యుద్ధానికి అమెరికా పాతిక బిలియన్ డాలర్లు ఖర్చు చేసిందని పెంటగాన్ తెలియజేసింది. అయితే పెంటగాన్‌కు చెందిన సీనియర్ బడ్జెట్ అధికారి జులెస్ హస్ట్ ప్రతినిధి సభకు ఇచ్చిన తాజా సమాచారం ప్రకారం యుద్ధ వ్యయం 29 బిలియన్ డాలర్లకు చేరింది. కాగా ట్రంప్ ప్రభుత్వం చెబుతున్న దాని కంటే ఎక్కువ ఖర్చే అయి ఉంటుందని డెమొక్రాట్లు, విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇరాన్ యుద్ధంపై స్వల్పకాలంలో రోజుకు రెండు బిలియన్ డాలర్లు ఖర్చు అయిందని హార్వర్డ్ కెన్నడీ స్కూల్ ప్రొఫెసర్ లిండా బిల్మ్స్ తెలిపారు. కాగా ఇరాన్‌పై జరిపిన యుద్ధానికి 630 బిలియన్ డాలర్ల నుంచి ట్రిలియన్ డాలర్ల వరకూ ఖర్చు అయి ఉంటుందని కొందరు డెమొక్రాట్లు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -