రైతుల రక్షణకు మద్దతు ధరల చట్టమే మార్గం

రైతుల రక్షణకు మద్దతు ధరల చట్టమే మార్గంవ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరల అమలుకు పార్లమెంటులో చట్టం చేయాలని జూన్‌ 5, 2020 నుంచి రైతులు, రైతు సంఘాలు ఢిల్లీలో పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. లక్షల మందిని సమీకరించి నెలల తరబడి పోరాటం చేశారు. 11 మాసాల పోరా టం తర్వాత నవంబర్‌, 2021న ప్రధాని మోడీ మద్దతు ధరలకు పార్లమెంటులో చట్టం తెస్తానని సంయుక్త కిసాన్‌ మోర్చ నాయకులకు లిఖిత పూర్వక హామీనిచ్చారు. అయినా నేటికీ అమలు జరుపలేదు. 2024 ఫిబ్రవరి నుంచి పోరాటం కొనసాగుతున్నది. ఫిబ్రవరి 16న భారత్‌ గ్రామీణ బంద్‌ విజయవంతంగా అమలు చేశారు. అయినా మోడీ ప్రభుత్వం పార్లమెంటులో సంయుక్త కిసాన్‌ మోర్చ నాయకులు ప్రవేశపెట్టిన మద్దతు ధరల బిల్లును చట్టంగా రూపొందించడానికి అంగీకరిం చడం లేదు. మార్చి, 14న దేశవ్యాపితంగా నిరసన ప్రదర్శనలలో లక్షల మంది రైతులు పాల్గొన్నారు. మద్దతు ధరల చట్టం తెస్తే బడ్జెట్‌ పై భారం పడుతుందని, కావున నిత్యా వసర సరుకుల ధరలు పెరుగు తాయని, ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గిపోతుం దని ప్రధాని మోడీ అతని అనుచరగణ మంత్రివర్గం ప్రచారం చేస్తుంది. కొంత మంది కుహానా ఆర్థికవేత్తలు ఈ చట్టం అమలు చేయడానికి నిధులు కేటాయించాలని కోరుతున్నారు. ఇవేవీ వాస్తవాలు కావు. ఆర్థిక విధానాలు తెలిసిన వారెవరైనా పై వాదనలను తిరస్కరి స్తారు. తమ పంటలకు గిట్టుబాటు ధరలు లేక, పెట్టిన పెట్టుబడులు రాక రుణగ్రస్తులై నేటికి 13 రాష్ట్రాల్లో యేటా 13వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతు న్నారు. ఆత్మహత్యల నివారణకు మద్దతు ధరలను గ్యారెంటీ చేస్తూ పార్లమెంటులో చట్టం చేయడం ఒకటే మార్గం.
మద్దతు ధరలు ఎలా వచ్చాయి?
1964లో ప్రారంభంలో మొదలైన హరిత విప్లవ కాలం నుంచి 1982 వరకు వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ధరలు లభించాయి. ప్రభుత్వం రాయితీల ద్వారా సంకరజాతి విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందులు గ్రామీణస్థాయి వరకు సరఫరా చేయడమేకాక, మార్కెట్లలో పోటీవల్ల కనీస గిట్టుబాటు ధరలు లభించాయి. 1984లో దేశం వ్యవసాయ ఉత్పత్తులలో స్వయం పోషకత్వమేకాక ఎగుమతులు చేసే దశకు చేరుకున్నాము. యేటా రెండు కోట్ల టన్నుల బియ్యం, గోదుమలు, పంచదారతో పాటు మిరప, పసుపు, పత్తి ఎగుమతులు చేశాము. ఆ పరిస్థితులలో దేశీయ కార్పొరేట్‌ సంస్థలు, మధ్యదళారీలు ప్రభుత్వాలతో కుమ్మక్కై మార్కెటల్లలో ధరలను 40శాతానికి పైగా తగ్గించారు. దేశవ్యాపితంగా జరిగిన రైతాంగ ఆందోళనల ఫలితంగా అంతకు ముందున్న మద్దతు ధరల చట్టాన్ని పునరుద్ధరించి ఆహార పంటలకు ఉత్పత్తివ్యయం ఆధారంగా ధరలు నిర్ణయించడానికి ” ధరల నిర్ణాయక కమిషన్‌ ” (సిఎసిసి)ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆ కమిషన్‌ రాష్ట్రాల నుంచి వ్యవసాయ పెట్టుబడులను, ఉత్పత్తి సమాచారాన్ని సేకరించి మద్దతు ధరలకు కేంద్ర ప్రభుత్వానికి రికమండేషన్‌ చేసింది. ఆ కమిషన్‌ రికమండేషన్‌ ప్రకారం కాకుండా కొంత మొత్తం పెంచి పంటలకు ధరలను నిర్ణయించింది. తర్వాత క్రమంగా 23 పంటలకు ధరలు నిర్ణయించారు. కానీ, ఆ ధరలు శాస్త్రీయంగా లేకపోవడంతో దేశవ్యాపితంగా పెద్దఎత్తున ఆందోళనలు సాగాయి. హరిత విప్లవ పితామహులు డాక్టర్‌ ఎం.ఎస్‌.స్వామినాథన్‌ మద్దతు ధరలకు ఒక సూత్రీకరణ చేశారు. దానిప్రకారం ఉత్పత్తి వ్యయంపై 50శాతం కలిపి ధరలు నిర్ణయించాలని సలహా ఇచ్చారు.
2014లో అధికారానికి వచ్చిన బీజేపీ ప్రభుత్వం మొదట మద్దతు ధరలను అమలు జరుపలేమని సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ వేసింది. 2019 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ స్వామినాథన్‌ సిఫారసులను అమలు చేసి, మద్దతు ధరలను నిర్ణయిస్తామని ప్రకటించింది. ప్రస్తుతం ఉత్పత్తి వ్యయంపై 50శాతం ధరలు నిర్ణయిస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించి దానికి 50శాతం కలుపుతున్నారు. పారిశ్రామిక సరుకులకు ధరలు నిర్ణయించే విధానాన్ని వ్యవసాయ ఉత్పత్తులకు వర్తింపజేయలేదు. ఉత్పత్తి వ్యయంలో ఉపకరణాల ధరలు (విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, యాంత్రీకరణ పెట్టుబడులు) కుటుంబ శ్రమను మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నారు. భూమిపై పెట్టిన పెట్టుబడి అనగా బోర్లు, కరెంటు పంపులు, పైపులైన్లు తదితర నిర్మాణాలకు తెచ్చిన అప్పుపై వడ్డీ, ఆ నిర్మాణాల అరుగుదల ఉత్పత్తి ఖర్చుల్లోకి తీసుకోవడం లేదు. అందువల్ల కేంద్రం నిర్ణయించే కనీస మద్దతు దర తక్కువగా నిర్ణయించడం జరిగింది. సిఎసిపి ఉత్పత్తి ధరలను నిర్ణయించడానికి ఎ2, బి2, సి2 సూత్రాలను రూపొందించింది. కానీ, ఆ విధానాలతో ఉత్పత్తి వ్యయాన్ని నిర్ణయించనుంది. మద్దతు ధరల చట్టం తెస్తే అనివార్యంగా ఈ సూత్రా లను అమలు చేయాల్సి ఉంటుంది. ఉత్పత్తి వ్యయం పెరగడంతో మద్దతు ధరలు కూడా పెరుగుతాయి. ప్రకృతి వైపరిత్యాల వల్ల, ఇతర అనర్థ కారణాల వల్ల నష్టపోయిన రైతులు శాస్త్రీయంగా రూపొందించే మద్దతు ధరల వల్ల కొంతలో కొంతైనా మేలు జరుగుతుంది.
శాస్త్రీయ మద్దతు ధరల వల్ల నష్టమెవరికి?
కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లు మద్దతు ధరలను శాస్త్రీయంగా నిర్ణయిస్తే ప్రభుత్వంపై భారం పడుతుందంటున్నారు. ఇది వాస్తవం కాదు. ప్రస్తుతం వ్యవసాయ ఉత్పత్తులన్నీ పరిశ్రమలకు ముడిసరుకులుగా ఉపయోగపడుతున్నాయి. వాటిని మధ్య దళారీలు తక్కువ ధరలకు కొనుగోలు చేసి, ప్రాసెస్‌ చేసి వినియోగదారులకు అమ్మకాలు చేస్తున్నారు. ” వినియోగదారుడు చెల్లించే మొత్తంలో ఉత్పత్తిదారుని వాటా 40-50శాతం మించడం లేదు. మధ్య దళారీలు అత్యధిక లాభాలు సంపాదిస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్‌ ద్వారా లాభాలను గమనించిన కార్పొరేట్‌ సంస్థలు టాటా, బిర్లా, అదాని, రిలయెన్స్‌, ఐటిసి, బేయర్‌, ఎల్‌ అండ్‌ టి లాంటి కంపెనీలు తమ పారిశ్రామిక పెట్టుబడులను తరలించి వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు, ప్రాసెసింగ్‌లో పెట్టుబడులు పెడుతున్నారు. పెట్టుబడులపై 80-100శాతం లాభాలు సంపాదిస్తున్నారు. ఈ ధరల విధానం వల్ల ఉత్పత్తిదారునికి న్యాయమైన ధర రాకపోవడం వల్ల వినియోగదారునిపై అత్యధిక భారం పడుతున్నది. మొక్కజొన్నతో 10 రకాలు, వరి ధాన్యంతో 5 రకాలు, గోదుమలతో 6 రకాలు, సోయాతో 10 రకాల ఉప ఉత్పత్తులు తయారౌతున్నాయి. పసుపు, మిరపతో కూడా అనేకరకాల ఉప ఉత్పత్తులు తయారౌతున్నాయి. రైతుల నుండి కొలుగోలు చేసిన ముడిసరుకులపై 20శాతం పెట్టుబడి పెట్టడం, లేదా పెట్టుబడి పెట్టకుండానే ఉప ఉత్పత్తులు వస్తున్నాయి. ఉదా: ధాన్యం, 1.5 కిలోలకు ఒక కిలో బియ్యం వస్తాయి. మిల్లు ఆడించినందుకు తౌడు, నూక, పరం తీసుకొని ఉచితంగానే కిలో బియ్యం ఇస్తారు. లేదా నామమాత్రంగా కొంత బియ్యం తయారు చేసినందుకు రేటు నిర్ణయిస్తారు. అలాగే, ముడిపప్పు క్వింటాల్‌కు 80 కిలోల పప్పు ఇస్తారు. సోయా మొదలు ఆయిల్‌ ఫామ్‌ వరకు నూనె గింజలు అన్నింటిలో 80-100 శాతం కార్పొరేట్లకు లాభాలుంటాయి.
1956లో నిత్యావసర సరుకుల చట్టాన్ని అప్పటి కేంద్ర ప్రభుత్వం తెచ్చింది. వ్యవసాయ ఉత్పత్తుల నుండి వచ్చే ఆహార ధాన్యాలను ప్రాసెస్‌ చేసిన తర్వాత ఏ రేటుకు అమ్మాలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. 2020లో కేంద్ర ప్రభుత్వం నిత్యావసర సరుకుల చట్టాన్ని రద్దు చేసింది. రైతుల పోరాట ఫలితంగా తిరిగి చట్టాన్ని పునరుద్ధరించింది. దీని ప్రకారం వ్యవసాయ ఉత్పత్తుల నుంచి వచ్చే ఉప ఉత్పత్తుల ధరలను ప్రభుత్వం నిర్ణయించాలి. కానీ, కార్పొరేట్‌ సంస్థలు తమ లాభాల కొరకు వినియోగదారులపై అత్యధిక భారాలు మోపే విధంగా ధరలు నిర్ణయిస్తున్నారు. దానికితోడు అందుకు ఉపయోగపడే ముడి వ్యవసాయ ఉత్పత్తులను అతితక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నారు. చాలా సందర్భాలలో కేంద్రం నిర్ణయించిన కనీస మద్దతు ధలను అమలు జరుపకపోవడం వల్ల రైతులు నష్టపోతు న్నట్లు ఆర్థిక వేత్తలే వ్యాఖ్యానాలు చేశారు. దేశంలో యేటా రూ.18 లక్షల కోట్ల వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్‌ సాగుతున్నది. కేంద్రం నిర్ణయించిన మద్దతు ధరలు లభించకపోవడం వల్ల ఇప్పటికే రైతులు రూ.4 లక్షల కోట్లకు నష్టపోతున్నట్లు మోడీ ఆప్త మిత్రుడు, ఆర్థికవేత్త అశోక్‌ గులాఠి ప్రకటించడం గమనించాలి. అందువల్ల కనీస మద్దతు ధరల చట్టం అవసరాన్ని ఈ పరిణామం విధితం చేస్తున్నది. అభివృద్ధి చెందిన దేశాలలో కార్పొరేట్ల పై 35శాతం పన్ను విధించగా, మనదేశంలో 20-23 శాతం మాత్రమే పన్ను విధించి మరోవైపున వారికి లాభాలు కట్టబెడుతున్నారు. దీనికితోడు బ్యాంకులలో తీసుకున్న రుణాలను రూ.16 లక్షల కోట్లు మాఫీ చేసి మరో ఆదాయాన్ని కూడా కల్పించారు. నిత్యావసర సరుకుల ధరలు పెంచడం ద్వారా మరిన్ని లాభాలు సంపాధిస్తున్నారు.
మద్దతు ధరల చట్టం వల్ల భారమెవరికి?
పైన వివరించిన ప్రకారం ఉత్పత్తిదారునికి తక్కువ ధరకు ఇచ్చి, వినియోగదారునికి ఎక్కువ ధరకు అమ్ముకునే విధానాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టబద్దం చేయడం ద్వారా ప్రస్తుతం వినియోగదారుల ధరలు పెంచకుండానే ఉత్పత్తిదారునికి అదనపు ఆదాయాన్ని చెల్లించవచ్చు. ఉదా: ధాన్యం ధర కేజీ రూ.20కి మార్కెట్‌లో అమ్మకాలు సాగుతున్నాయి. 1.5 కి.లు ధాన్యం అనగా రూ.30 చెల్లించాలి. కిలో బియ్యం వస్తాయి. కానీ, కిలో బియ్యం మార్కెట్‌లో రూ.60-65లకు అమ్ముతున్నారు. అలాగే పత్తి 3 కిలోలు జిన్నింగు చేస్తే కిలో దూది వస్తుంది. 2 కిలోలు గింజలు వస్తాయి. 3 కిలోల పత్తికి రూ.210లు పెట్టి కొనాలి. 2 కిలోల గింజలకు రూ.60లు ఆదాయం వస్తుంది. రూ.210ల నుండి రూ.60లు తగ్గిస్తే కిలో దూదికి రూ.150లు ధర ఉంటుంది. కిలో దూదితో 8 మీటర్ల బట్ట వస్తుందని సదరన్‌ టెక్స్‌టైల్‌ మిల్లులు అంచనా వేశాయి. మీటర్‌ ధర రూ.60లు నిర్ణయించినా రూ.480లు ఆదాయం వస్తుంది. రూ.150ల దూది ధరకు తోడు బట్టగా ప్రాసెస్‌ చేయడానికి మరో రూ.100లు వ్యయం చేసినా రూ.250ల పెట్టుబడికి రూ.480లు ఆదాయం వస్తుంది. అందువల్ల ప్రాసెస్‌ చేసిన తర్వాత అమ్ముకునే లాభ శాతాన్ని కేంద్రం ధరల నిర్ణయం ద్వారా తగ్గించాలి. ఆ తగ్గించిన దానిని ముడిసరుకులు ఉత్పత్తి చేసే రైతులకు జమ చేయాలి. అనగా, ధాన్యం ధర కిలో రూ.30లు అయినప్పుడు బియ్యం ధర కిలో రూ.45లు అవుతుంది. అయినా, మధ్యదళారీకి రూ.15 లాభం ఉంటుంది. ఈ సూత్రాలను పరిశీలించినప్పుడు కార్పొరేట్ల లాభాల మార్చిన్‌ను తగ్గించడం ద్వారా ఉత్పత్తిదారునికి గిట్టుబాటు ధర కల్పించవచ్చు. ఇందుకు చట్టం అవసరం.
ఆ చట్టం చేస్తే తమ లాభాలకు ఎక్కడ ఆటంకం వస్తుందోనని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల లాభాలను దృష్టిలో పెట్టుకొని చట్టం చేయకుండా కుంటిసాకులు చెప్తున్నది. దీనికితోడు ఎగుమతి-దిగుమతులలో కూడా కార్పొరేట్లకు లాభాలు కట్టబెడుతున్నది. మిగులు ఉత్పత్తులు జరిగినప్పటికీ దిగుమతులు చేసుకొని రైతులను నష్టపరుస్తున్నారు. అమెరికా మొదలు, పాకిస్తాన్‌ వరకు తమ రైతుల మేలును కాంక్షించి చట్టాల ద్వారా వారికి రక్షణ కల్పిస్తున్నారు. అందుకే ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా మన దేశంలోనే రైతుల ఆత్మహత్యలు కొనసాగుతు న్నాయి. ఇంతకన్న దృష్టాంతం ఏము న్నది? కార్పొరేట్ల లాభాలకు అడ్డుకట్ట వేయడం ద్వారా రైతులకు అదనపు ధరలు లభించే విధంగా పార్లమెంటులో చట్టం చేయాలి. ఉత్పత్తి ధరను శాస్త్రీయంగా ఎలా నిర్ణయించాలో ఆ చట్టంలో రూపొందిం చాలి. ఆ చట్టాన్ని అమలు చేయడానికి తగిన యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేయాలి. అప్పుడే రైతుల ఆత్మహత్యలు నివారించబడుతాయి. కానీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం రైతుల రక్షణకు మద్దతు ధరల చట్టం తెస్తుందన్న విశ్వాసాన్ని కోల్పోయారు. రైతులు మాత్రం దృఢ దీక్షతో చట్టం చేసేవరకు పోరాటం విరమించడానికి సుముఖంగా లేరని సంయుక్త కిసాన్‌ మోర్చ ప్రకటించింది. పార్లమెంటులో సంయుక్త కిసాన్‌ మోర్చ ప్రవేశపెట్టిన ముసాయిదా చట్టాన్ని ఆమోదించటమొక్కటే బీజేపీ ముందున్న మార్గం.
సారంపల్లి మల్లారెడ్డి
9490098666

Spread the love