ఆఫీసుకు రాని ఉద్యోగులకు నోటీసులు… టీసీఎస్‌ క్లారిటీ

నవతెలంగాణ – హైదరాబాద్: వారంలో మూడు రోజులు ఆఫీసుకు రాని ఉద్యోగులకు నోటీసులు జారీ చేస్తున్నట్లు వచ్చిన వార్తలను ప్రముఖ ఐటీ దిగ్గజం టీసీఎస్‌ (TCS) ఖండించింది. ఉద్యోగులు ఆఫీసు వాతావరణానికి అలవాటు పడే విధంగా సంస్థ వారిని ప్రోత్సహిస్తుందని తెలిపింది. ఇందుకోసం నెలలో 12 రోజులు ఆఫీసుకు వచ్చి పనిచేయాలనే నిబంధన విధించామని కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. అయితే, 12 రోజుల ఆఫీసు నిబంధన పాటించని ఉద్యోగులకు మెమోలు ఇస్తామని హెచ్చరించినట్లు వెల్లడైన సమాచారం పూర్తిగా అవాస్తవమని అన్నారు.
          ‘‘గత రెండేళ్లలో ఎంతో మంది కొత్త వారు టీసీఎస్‌లో ఉద్యోగంలో చేరారు. అయితే, కరోనా పరిస్థితుల కారణంగా వారిలో ఎక్కువ శాతం మంది ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితులు కుదుటపడటంతో వారంతా ఆఫీసు వాతావరణానికి అలవాటు పడాలని సంస్థ భావిస్తోంది. ఇందుకోసం వారానికి మూడు రోజులు వారంతా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని సూచించింది. దీనివల్ల సీనియర్‌ ఉద్యోగులతో కలిసి పనిచేయడం, కంపెనీ అభివృద్ధిలో భాగస్వామ్యం కావడంతోపాటు మంచి ఫలితాలను సాధించవచ్చని కంపెనీ భావిస్తోంది. అయితే, కంపెనీ నిబంధన ప్రకారం ఆఫీసుకు రాని ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ ఎలాంటి నోటీసులు వారికి పంపలేదు. కొంతమంది ఉద్యోగులకు క్రమశిక్షణా చర్యల్లో భాగంగా మెమో జారీ చేసినట్లు వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవం’’ అని టీసీఎస్‌ ప్రతినిధి తెలిపారు. ఇంటి నుంచి పనిచేసేందుకు 100 శాతం మంది ఉద్యోగుల్ని అనుమతించబోమని టీసీఎస్‌ గతేడాది ప్రకటించింది. ఇందులో భాగంగానే గతేడాది అక్టోబరు నుంచి వారంలో మూడు రోజులు ఆఫీసుకు వచ్చి పనిచేయాలని కంపెనీ ఉద్యోగులకు మెయిల్‌ ద్వారా సమాచారం పంపింది. ఈ మేరకు సీనియర్‌ ఉద్యోగులతోపాటు, కొత్త ఉద్యోగులతో కలిపి రోస్టర్‌ విధానాన్ని రూపొందించింది. దాని ప్రకారం ఉద్యోగులు ఆఫీసుకు వచ్చి పనిచేయాలని సూచించింది. అయితే, ఈ రోస్టర్‌ విధానాన్ని పాటించని ఉద్యోగులకు నోటీసులు జారీ చేస్తున్నట్లు నిన్న పలు వార్తా సంస్థలు కథనాలు ప్రచురించాయి. తాజాగా టీసీఎస్‌ వాటిపై వివరణ ఇచ్చింది.

Spread the love