తెలంగాణ చారిత్రక ప్రాశస్త్యం గొప్పది

– సీఎం కేసీఆర్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
చారిత్రక వారసత్వ సంపద తెలంగాణ నేల స్వంతమనీ, ఈ గడ్డకున్న ప్రాచీనత, ప్రాశస్త్యాన్ని ప్రపంచం గుర్తించిందని సీఎం కే చంద్రశేఖర్‌రావు అన్నారు.’వరల్డ్‌ హెరిటేజ్‌ డే’ సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికున్న చారిత్రక ప్రాశస్త్యాన్ని ఆయన స్మరించుకున్నారు. శాతవాహన వంశం నుంచి అసఫ్‌ జాహీల వరకు సాగిన పాలన తెలంగాణను సుసంపన్నం చేశాయ న్నారు. ఇక్కడి వైవిధ్యభరితమైన నిర్మాణ శైలులు, శిల్పకళలు, ఆయుధాలు, ఆభరణాలు, గుహ చిత్రలేఖనాలు, బొమ్మలు, కట్టడాలు, సంస్కృతీ, సంప్రదా యాలు, ఆచారాలు, భాష, యాసలు, సాహిత్యం, కళలు వారసత్వ సంపదకు ఆలవాలమని వివరించారు. 45 వేల ఏండ్ల క్రితమే తెలంగాణ నేలమీద మానవ సంచారం సాగిందనడానికి నేటి జయశంకర్‌ భూపాల్‌ పల్లి జిల్లాలోని పాండవుల గుట్టలో లభ్యమైన ప్రాచీనమానవుని పెయింటింగ్స్‌ నిదర్శనమని స్పష్టంచేశారు. జైన బౌద్ధ ఆరామాలు, రామప్ప దేవాలయం, వేయిస్తంభాల గుడి, ఓరుగల్లు కోట, భువనగిరి కోట, గోల్కొండ కోట, పాండవుల గుట్ట, పద్మాక్షి గుట్ట, మెదక్‌ చర్చి, మక్కా మసీదు, చార్మినార్‌ వంటి ఎన్నో గొప్ప కట్టడాలు, సహజ నిర్మాణాలు తెలంగాణ చారిత్రక, వారసత్వ వైభవాన్ని, వైవిధ్యతను, ప్రత్యేకతను చాటుతున్నాయని తెలిపారు. కాకతీయుల కాలంలో నిర్మించిన ములుగు జిల్లా పాలంపేట గ్రామంలోని ప్రసిద్ధ రామప్ప దేవాల యాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చడం తెలంగాణ ప్రజలకు, దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాచీన ప్రాంతాల స్థల వివరాలను ఆయన గుర్తు చేసుకున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత వారసత్వ సంపదల పరిరక్షణకు తొలి ప్రాధాన్యత ఇచ్చామన్నారు. తెలంగాణ చరిత్రను కాపాడుకోవడంలో చైతన్యవంతమైన యువత భాగస్వామ్యం మరింతగా పెరగాలని ఆయన ఆకాంక్షించారు.

Spread the love