తెలంగాణ వీరులదే

Telangana heroesసరిగ్గా సార్వత్రిక ఎన్నికల ముందు సెప్టెంబర్‌ 17ను అధికారికంగా తెలంగాణ ”విమోచనదినం”గా జరపాలని నోటిఫికేషన్‌ జారీచేసింది కేంద్ర ప్రభుత్వం. మహోన్నత తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో సెప్టెంబర్‌ 17కు గల ప్రత్యేకత ఎవరూ కాదనలేనిదే. జాతికి గర్వకారణమైన ఆ పోరాటఖ్యాతిని తస్కరించి దానికి వక్రభాష్యాలు చెపుతూ, విశాల ప్రజామోదమున్న ఆ చారిత్రక సందర్భాన్ని తమ రాజకీయ ప్రయోజ నాలకు వాడుకోజూడటమే ఆక్షేపణీయం. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం చేస్తున్నది అదే. ఇప్పటికే సెప్టెంబర్‌ 17 వచ్చిందంటే వీరి ”పరివారం” నిత్యం ”విమోచనదినం” పేరుతో అనేకానేక అసత్య ప్రచారలకు పూనుకుంటోంది. ఇప్పుడు ప్రభుత్వమే ఆ అబద్ధాలను అధికారికం చేస్తూ భవిష్యత్‌ తరాలకు అందించజూస్తోంది.
విచిత్రమేమిటంటే వీరెవరూ ఈ పోరాటంలో ఒక్క నెత్తురుబొట్టు చిందించినవారూ కాదు. చుక్క చెమట రాల్చినవారూ కారు! కానీ కులమతాల కతీతంగా తెలంగాణ ప్రజలు లిఖించిన త్యాగాల చరిత్రకు మతం రంగు పులుముతున్నారు. ఇది హిందూ ప్రజలకూ ముస్లిం రాజుకూ మధ్య యుద్ధంగా చిత్రిస్తూ వక్రభాష్యాలు చెపుతున్నారు. ”ముస్లింల పాలన కింద ఉన్న హిందూ ప్రజలకు 1948 సెప్టెంబర్‌ 17న భారత ప్రభుత్వం విమోచన కలిగించింది” అన్న అశాస్త్రీయ వాదనను ముందుకు తెస్తున్నారు. అసలు హైదరాబాద్‌ సంస్థానం ముస్లిం పాలన కింద ఉండేదన్నదే అర్థసత్యం. పాలకుడు ముస్లిం కావొచ్చు… అతడి మతం ఇస్లాం కావొచ్చు… కానీ ఆ రాజు ఆధారపడి పాలన సాగించింది హిందూ భూస్వాములు, దేశ్‌ముఖ్‌లు, జాగీర్ధార్ల మీదే. ప్రజలు ప్రత్యక్షంగా దోపిడీకి, విపరీతమైన పీడనకు గురయింది వీరి చేతుల్లోనే. అత్యంత క్రూరులూ మతోన్మాదులైన రజాకార్‌ మూకలన్నిటికీ ఈ హిందూ దొరల గడీలలోనే విడిది. అక్కడే తిని, తాగి ఈ కసాయి మూకలు ప్రజలమీద కిరాతక దాడులు చేసేవి అన్న సంగతి మరువగలమా? రజాకార్ల సైన్యాధ్యక్షుడు ఖాసీం రజ్వీ ముస్లిం అయితే,వాడికి ఆశ్రయమిచ్చిన విసునూర్‌ దేశ్‌ముఖ్‌ రాపాక రామచంద్రారెడ్డి హిందువేగా! అతని దాష్టీకానికి బలైన బందగీ ముస్లిం కాదా? లక్షల ఎకరాలకు అధిపతిగా జనాల మూల్గులు పీల్చిన జన్నారెడ్డి ప్రతాపరెడ్డి ఎవరు? పసిబిడ్డల తల్లుల్ని మోదుగుడొప్పల్లో పాలు పిండించి పరీక్షించిన పసునూరి రామ్మోహన్‌రావు ఎవరు? నీర్మాల నియంత లింగాల నర్సింహారెడ్డి ఎవరు? కోడూరి కర్కోట కుడు గడ్డం నర్సింహారెడ్డి ఎవరు? వీరి అమానుషాలను ఎండగట్టిన షోయబుల్లాఖాన్‌ ఎవరు? వీరి దురాగతాలను ప్రతిఘటించిన మఖ్ధూం మొహియుద్ధీన్‌ ఎవరు? ఈ చరిత్రనిండా ఇటువంటివెన్నో ఉదాహరణలు… వీటిలో ”పీడకులు పీడితులు” అన్న విభజనకు తప్ప ”హిందువులు ముస్లింలు” అనే విభజనకు ఆస్కారముందా?
ఇక 1948 సెప్టెంబర్‌ 17న జరిగింది విమోచనే అయితే, 1950 జనవరి 26 దాకా హైదరాబాద్‌ రాజ్య పాలన నిజాం రాజు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ పేరు మీదనే ఎందుకు సాగినట్టు? ఆ తరువాత 1956 దాకా ఆయన రాజప్రముఖ్‌ (గవర్నర్‌)గా ఎలా కొనసాగినట్టు? దుర్మార్గమైన ఫ్యూడల్‌ నిరంకుశ పాలన సాగించి, ప్రజల రక్తమాంసాలు పిండి, పన్నులు వసూలు చేసి, ఆనాటికి ప్రపంచంలోనే అత్యంత ధనికులలో ఒకనిగా చలామణీ అయిన నిజాం ఆస్తులను ఎందుకు స్వాధీనం చేసుకోలేదు? పైగా రాజభరణాల పేరుతో ఇచ్చిన కోట్ల రూకల్ని నాడు ఇందిరా గాంధీ రద్దు చేస్తే దాన్ని పూర్తిగా వ్యతిరేకించింది జనసంఘం, నేటి బీజేపీ మాతృక. ఈ ప్రశ్నలకు సర్కారు వారు జవాబు చెప్పగలరా? అదే నిజమైతే ఆ తరువాత కూడా ప్రజలు సాయుధ పోరాటం ఎందుకు కొనసాగించినట్టూ? ఎందుకంటే ఆ రోజుతో ఏదో మార్పు వచ్చినట్టు ప్రజలు భావించలేదు గనుక. వీరు చెపుతున్నట్టు 1948 సెప్టెంబర్‌ 17న విమోచన పూర్తయితే 1951 దాకా పటేల్‌ పటాలాలు తెలంగాణను ఎందుకు వీడలేదు? ఎందుకంటే అవి వచ్చింది నిజాం రాజు కోసం కాదు గనుక. వాటి ”ఆపరేషన్‌ పోలో” అసలు లక్ష్యం కమ్యూనిస్టులే గనుక. తెలంగాణ ప్రజలపై, కమ్యూనిస్టులపై నిజాం పోలీసులు, రజాకారు మూకలకంటే యూనియన్‌ సైన్యాల హత్యలూ అకత్యాలే ఎక్కువ గనుక దీనిని బట్టి అర్థమవుతున్నదేమిటి? ఏలినవారు చెపుతున్నట్టు ఇది విమోచనే అయితే ఎవరి నుండి ఎవరికి విమోచన? ఈ చారిత్రక వాస్తవా లన్నీ విస్మరించి, వక్రీకరించి ”విమోచనగానా లాపన” చేయడంలో వీరికి కొన్ని నిర్ధిష్టమైన ప్రయోజనాలున్నాయన్న సంగతి తెలియనిది కాదు.
ఇక్కడ గమనించవలసిన అసలు విషయం ఏమిటంటే.. కమ్యూనిస్టుల సాయుధ పోరాటం ముందు నిజాం తలవంచక తప్పదని తేలిపోయాకే భారత యూనియన్‌ సైన్యాలు రంగప్రవేశం చేసాయి. ఎందుకంటే ఇక్కడ ప్రజలు గెలిస్తే తెలంగాణ కమ్యూనిస్టుల చేతిలోకి వెళుతుందనీ, అది రేపు తమ ఢిల్లీ కోటను కూడా ముట్టడిస్తుందనే భయం వారిది. నిజం చెప్పాలంటే ఇది యూనియన్‌ సైన్యాలు తెలంగాణ ప్రజల నుండి నిజాం రాజుకు కల్పించిన విమోచన. తద్వారా కమ్యూనిస్టు ఉద్యమ ప్రకంపనలు హస్తినదాకా చేరకుండా చూసుకోవడమే నాటి నెహ్రూ ప్రభుత్వ లక్ష్యం. ఈ చారిత్రక సత్యాన్ని విస్మరణకు గురిచేయడం, దానిని హిందూ ముస్లిం పోరాటంగా చిత్రించడం, తద్వారా తెలంగాణలో తన రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకోవడం నేటి మోడీ ప్రభుత్వ లక్ష్యం. అందులో భాగమే ఈ నోటిఫికేషన్‌. ఇది ముమ్మాటికీ చరిత్రకు ద్రోహం చేయడమే.

Spread the love