చేతలు అధ్వాన్నం

Sampadakiyam ‘దేశంలో ప్రతి రంగంలోనూ నారీశక్తి కొత్త శిఖరా లకు చేరుతోంది’ అంటూ ప్రధాని మోడీ మొన్నటి తన మన్‌కీబాత్‌ 110వ ఎపిసోడ్లో ఎంతో గొప్పగా చెప్పాడు. మహిళలకు సమాన అవకాశాలు కల్పించినప్పుడే ప్రపం చం సుసంపన్నం అవుతుందని ప్రఖ్యాత కవి భారతీ యార్‌ చెప్పిన మాటలను కూడా ఆయన ఈ సందర్భం గా గుర్తు చేశారు. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో నివసించే మహిళలు సైతం డ్రోన్లు ఉపయోగిస్తున్నా రని, ఇది ఎవ్వరూ ఊహించని మార్పు అంటూ ఆయన తన రేడియో ఉపన్యాసంలో తనదైన శైలిలో ఆవేశంగా మాట్లాడాడు. కానీ వాస్తవంగా జరుగుతున్న దీనికి భిన్నంగా ఉన్నది.
కోస్ట్‌ గార్డ్‌ (భారతీయ తీర రక్షణ దళం)లో మహిళల శాశ్విత కమిషన్‌ ఏర్పాటుకు కేంద్రం అంగీకరించలేదు. రక్షణ రంగంలోని మహిళా అధికారుల పట్ల కేంద్రం చూపు తున్న వివక్షకు ఇదొక మచ్చుతునక. కోస్ట్‌గార్డ్‌లో అర్హులైన షార్ట్‌ సర్వీస్‌ కమిషన్డ్‌ (ఎస్‌ఎస్సీ) మహిళా అధికారులతో పర్మినెంట్‌ కమిషన్‌ ఏర్పాటు చేయడానికి కేంద్రం అనుమతి ఇవ్వడం లేదని ప్రియాంక త్యాగి అనే అధికారి ఇటీవలె న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ‘మాట్లాడితే నారీశక్తి అంటారు. ఇప్పుడు ఇక్కడ ఎందుకు చూపించడం లేదు. ఈ విషయంలో మీరు చాలా అగా థంలో ఉన్నారు. మహి ళలను సముచితంగా పరిగణించే విధానాన్ని మీరు రూపొందించాల్సిందే’ అంటూ సుప్రీం ఈ కేసు విషయంలో కేంద్రానికి అక్షింతలు వేసింది.
వాస్తవానికి మోడీ ప్రభుత్వం ఈ ఒక్క విషయంలోనే కాదు మహిళల పట్ల అడుగడుగునా అగాథంలో ఉండే ఆలోచిస్తోంది. పదేండ్ల తన పాలనలో మహిళలకు రక్షణ కల్పించడంలో మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమయిం దనేది ఎవ్వరూ కాదనలేని సత్యం. ఉపన్యాసాల్లో మాత్రం నారీ శక్తి అంటూ ఓట్ల ప్రేమ ఒలకపోతుస్తున్నాడు. బిల్కిస్‌బానో సంఘటన, రెజ్లర్లు చేసిన పోరాటం దేశంలో మహిళల దుస్థితికి మచ్చుతునకలు. ఇక ఉజ్జయినిలో గత ఏడాది 12 ఏండ్ల బాలిక లైంగిక దాడికి గురై వణికి పోతూ అర్ధ నగంగా కిలోమీటర్ల దూరం సాయం కోసం పరిగెత్తిన విషయం గుర్తుకొస్తే ఎవరికైనా హృదయం ద్రవించక మానదు. మణిపూర్‌లో ఇద్దరు మహిళ లపై లైంగికదాడి చేసి నగంగా ఊరేగించిన ఘటన దేశాన్ని అల్లకల్లోలం చేసింది. అయినా మన ప్రధాని చలించలేదు. ఇలా చెప్పుకుంటూపోతే మోడీ పాలనలో మహిళలపై జరుగుతున్న దాడులు కోకొల్లలు. ఈ ఘటనలు చాలవా? మహిళల రక్షణ పట్ల బీజేపీ వైఖరి ఏంటో చెప్పడానికి.
ఇక దేశవ్యాప్తంగా మహిళలపై హింస రోజురోజుకు పెరిగిపోతోందని గతేడాది కేంద్ర నేర గణాంక సంస్థ విడుదల చేసిన నివేదిక చెబుతోంది. అలాగే గతంతో పోలిస్తే మహిళలపై హింస 30శాతం పెరిగిందని గత ఏడాది స్వయానా జాతీయ మహిళా కమిషన్‌ (ఎన్‌సీ డబ్ల్యూ) నివేదికే తేల్చి చెప్పింది. ఆ ఏడాది వచ్చిన ఫిర్యా దులను పరిశీలిస్తే బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌ నుంచే సగానికి పైగా ఉన్నాయని ఆ లెక్కల్లో తేలింది. అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో, మహిళ పట్ల బీజేపీ ప్రభుత్వానికి ఎంతటి ప్రేమ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు.
అవకాశాల్లో సగభాగం ఇవ్వకుండా ఆకాశంలో సగం అంటే ఎవరు నమ్ముతారు? రక్షణ కల్పించకుండా సాధి కారత కల్పిస్తానంటే ఎలా విశ్వసిస్తారు? తమ ఆత్మ గౌరవానికి విలువివ్వవని పాలనలో ఎంతకాలమని మగ్గు తారు? అలాంటి పాలకుడు నారీశక్తి అంటూ ఉపన్యా సాలు చెబుతుంటే నమ్మడానికి మహిళలు ఇక సిద్ధంగా లేరు. అతని మన్‌కీబాత్‌ వెనకున్న అసలు సంగతేంటో అర్థం చేసుకుంటున్నారు.
బీజేపీ పాలనలో మహిళల పరిస్థితి రోజురోజు కు దిగజారి పోతుందని ఒకపక్క మహిళా సంఘా లు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే తమ మనుగడే కష్టమని ఆందోళన చెందుతున్నారు. అందుకే మహిళా లోకమంతా ఏక మై బీజేపీని తరిమి కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ఒట్టి మాటలు కట్టిపెట్టా ల్సిన సమయం మోడీకి ఆసన్నమైనట్టే. తన మన్‌కీ బాత్‌ 111వ ఎపిసోడ్‌కు ముచ్చటగా మూడు నెలలు విరామం ఇస్తున్నట్టు ప్రధాని ప్రక టించాడు. లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే ఈ నిర్ణయం తీసుకున్నాడనేది అందరికీ తెలిసిన విషయమే. తామంటే విలువలేని మోడీకి ఈ తాత్కాలిక విరామం శాశ్వతం కావాలని మహిళలు ముక్త కంఠంతో కోరుకుంటున్నారు. ఈ హింసా పాలకుల నుండి తమని తాము కాపాడుకునేందుకు నడుం బిగిస్తున్నారు.

Spread the love