ఎకో టూరిజం దిశగా తెలంగాణ

Telangana towards eco tourism– ఇప్పటికే వందల కోట్ల రూపాయలతో పార్కుల అభివృద్ధి : టీఎస్‌ఎఫ్‌డీసీ చైర్మెన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి
– ఏకో టూరిజంలో దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలుపుతాం : సీఎస్‌ శాంతికుమారి
– జిల్లాకో ఎకో టూరిజం పార్కు : చంద్రశేఖర్‌రెడ్డి
– చిలుకూరు మృగవాని రిసార్ట్స్‌లో ఏకోటూరిజం అభివృద్ధిపై సదస్సు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఎకో టూరిజం(ప్రకృతి పర్యాటకం) దిశగా తెలంగాణ వేగంగా అడుగులు వేస్తున్నదనీ, ఇప్పటికే రాష్ట్రంలో రూ.100 కోట్లతో పార్కులను అభివృద్ధి చేశామని తెలంగాణ స్టేట్‌ ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(టీఎస్‌ఎఫ్‌డీసీ) చైర్మెన్‌ వంటేరు ప్రతాపరెడ్డి వెల్లడించారు. హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాల ప్రజలకు స్వచ్ఛమైన వాతావరణంలో కూడిన పార్కులు, వాకింగ్‌ ట్రాక్‌లు అందుబాటు లోకి తీసుకొస్తున్నామన్నారు. మంగళవారం హైదరాబాద్‌ శివారులోని చిలుకూరులో గల మృగవాని రిసార్ట్స్‌లో ఏకో టూరిజంపై టీఎస్‌ఎఫ్‌డీసీ ఆధ్వర్యంలో రెండు రోజుల సదస్సును రాష్ట్ర్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, అటవీశాఖ ప్రధాన అధికారి ఆర్‌ఎం డోబ్రియల్‌, టీఎస్‌ఎఫ్‌డీసీ వైస్‌ చైర్మెన్‌, ఎమ్‌డీ డాక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డి, పీసీసీఎఫ్‌ పర్గిస్‌, పీసీసీఎఫ్‌ (విజిలెన్స్‌) ఎలుసింగ్‌ మేరు, టీఎస్‌ఎఫ్‌డీసీ ఎకో టూరిజం ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎల్‌.రంజిత్‌ నాయక్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా దక్కన్‌ ఉడ్‌ అండ్‌ ట్రయల్స్‌ లోగోను ఆవిష్కరించారు. అనంతరం ప్రతాపరెడ్డి మాట్లా డుతూ తెలంగాణను ప్రకృతి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాడానికి సంస్థ ఎమ్‌డీ చంద్రశేఖర్‌రెడ్డి చేస్తున్న కృషిని ప్రశంసించారు. ఇప్పటికే నీటివనరులు, వాటర్‌ ఫాల్స్‌ సహజ సిద్ధంగా ఉన్న ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పర్యాటకులను ఆకర్షిస్తోందన్నారు. ఈ కోవలో వరంగల్‌, ఆదిలాబాద్‌, హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల పరిధితోపాటు సత్తుపల్లిలోనూ ప్రకృతి పర్యాటక కేంద్రాలను సిద్ధం చేశామన్నారు. కేరళ, కర్నాటక మాదిరిగా తెలంగాణలోనూ ప్రకృతి పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.సీఎస్‌ శాంతి కుమారి మాట్లాడుతూ..రానున్న రెండు, మూడేండ్లలో ఎకో టూరిజంలో తెలంగాణను దేశంలోనే  మొదటి స్థానంలో నిలుపుతామని నొక్కి చెప్పారు. తెలంగాణకు హరితహారం ఓ అద్భుతమనీ, దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నదని గుర్తుచేశారు. ఎకో టూరిజం వల్ల స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతా యన్నారు. ప్రకృతి పర్యాటకంపై ఆయా ప్రాంతాల్లో ప్రజల్లో అవగాహన కల్పించాలనీ, వారిని చైతన్య పరిచేలా టీఎస్‌ఎఫ్‌డీసీ చర్యలు తీసుకోవాలని సూచించారు. టీఎస్‌ఎఫ్‌డీసీ వైస్‌ చైర్మెన్‌ డాక్టర్‌ జి.చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఏకో టూరిజం నిర్వహణలో ఎదురయ్యే ఒడిదుడుకులు, తీసుకోవా ల్సిన చర్యలపై వివిధ రాష్ట్రాల అటవీశాఖ ఉన్నతాధి కారులతో మేధోమదనం చేస్తున్నామన్నారు. సదస్సులో పీసీసీఎఫ్‌(హరితహారం) సువర్ణ, అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వు ఫీల్డ్‌ డైరెక్టర్‌ క్షితిజ, సీసీఎస్‌ ప్రొడక్షన్‌ రామలింగం, జూపార్కు డైరెక్టర్‌ ప్రసాద్‌, క్యూరేటర్‌ సునీల్‌ ఎస్‌ హిరెమంత్‌, పీసీసీఎఫ్‌ ఓఎస్డీ శంకరన్‌, ఎకో టూరిజం అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కైలాస్‌, ఎకో టూరిజం ఓఎస్‌డీ తిమ్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Spread the love