ప్రగతిపథంలో పదేండ్ల తెలంగాణ

వనరులను వినియోగించుకుంటున్నారు ప్రజలను కలిస్తే సమస్యలు తెలుస్తాయి
విధానాలను సమిక్షించుకుంటే మెరుగైన ఫలితాలు టీఎస్‌పీఎస్సీ మాజీ చైర్మెన్‌ ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణి
”రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతున్నది… సహజ వనరులను వినియోగించుకుంటున్నారు.. ప్రజలతో మమేకమైతే సమస్యలు తెలుస్తాయి.. కొత్త జిల్లాలతో పరిపాలన క్షేత్రస్థాయికి వెళ్తుంది. ఏ ప్రభుత్వమైనా విధానాలను పరిస్థితులకు అనుగుణంగా సమీక్షించుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి.. టీఎస్‌పీఎస్సీ ద్వారా నిరుద్యోగులకు కొంత ఆలస్యమైనా న్యాయం జరుగుతుందని” తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ)మాజీ చైర్మెన్‌ ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణి అన్నారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులు, పరిశ్రమలతో ఉపాధి అవకాశాలు సైతం పెరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి బి.బసవపున్నయ్యతో రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన ఫలితాలపై ఇంటర్వ్యూ .
జర్నలిస్టులను సచివాలయంతోపాటు ప్రభుత్వ కార్యాలయంలోకి అనుమతించడం లేదు కదా ?
జర్నలిస్టులను సమాచారం కోసం ప్రభుత్వ కార్యాలయాల్లోకి అనుమతించాల్సిందే. అదే సందర్భంలో అందుకోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుచేయాలి. తద్వారా సంబంధిత అధికారుల అనుమతితో సచివాలయం లోకి వెళ్లొచ్చు. నిర్ణీత సమయంలో ప్రత్యేక వ్యవస్థ ద్వారా జర్నలిస్టులకు సమాచారం అందించాలి. సచివాలయంలోకి వేలాది మంది జర్నలిస్టులు వెళ్లి ఏంచేస్తారు? అధికారులు కూడా తమ పనులు చేసుకోవాలి. టీఎస్‌పీఎస్సీలో నేను కూడా అనుమితి ఇవ్వలేదు. అవసరమైనప్పుడు కలిశాను.
బీఆర్‌ఎస్‌ సర్కారు తొమ్మిదేండ్ల పరిపాలనలో ప్రజల ఆకాంక్షలు నెరవేరాయంటారా?
అవును. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పరిపాల నలో రాష్ట్రం అభివృద్ధివైపు పయనిస్తున్నది. ఆయా రంగాల పునరావిష్కరణ చోటుచేసుకుంటున్నది. సహజ వన రులను వినియోగిస్తూ ముందుకు పోతున్నారు. భారీ సాగు నీటి ప్రాజెక్టులతో సాగునీరు పెరిగింది. మూడు రెట్లు అద నంగా పంటల ఉత్పత్తి జరుగుతున్నది. రైతుబంధు, రైతుబీమా తదితర పథకాలు బాగా ఉపయోగప డుతున్నాయి.
కౌలురైతులకు సాయం అందడం లేదు కదా?
రైతు బంధు విషయంలో కొంత సమీక్ష చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కువ భూమి ఉన్న రైతులకు రైతుబంధు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆరుగాలం కష్టపడే రైతులతోపాటు కౌలురైతులకూ ఇవ్వొచ్చన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. పెట్టుబడి వారికి అందితే నిజంగానే భూమి బంగార మవుతుంది.
సర్కారు ఏఏ రంగాల్లో విజయం సాధించిందని చెప్పొచ్చు?
సాగునీరు, వ్యవసాయం, తాగునీరు, విద్యుత్‌, సంక్షేమం తదితర రంగాల్లో మంచి అభివృద్ధి ఉంది. విద్యావ్యవస్థపైనే మరింత దృష్టి అవసరం. కేజీ నుంచి పీజీ విధానం మరింత పటిష్టంగా అమలు చేయాలి. ప్రాథమిక పాఠశాలల నుంచి విశ్వ విద్యాలయాల వరకు నాణ్యమైన విద్యను అందించేలా నిధులు పెంచాలి. పాఠశాలలు, కాలేజీలు, డిగ్రీ కాలేజీలపై శ్రద్ద అవసరం. ఆస్పత్రులు సైతం పెరిగాయి. కానీ నియామకాలు చేయాలి. జిల్లాకో మెడికల్‌ కాలేజీ, అనుబంధంగా 500 పడకల ఆస్పత్రిని సీఎం మంజూరు చేశారు. అవి ఆచరణలోకి రావాలి. పట్టణీకరణ పెరుగుతున్నది.
పట్టణీకరణతో ఎలాంటి లాభాలు ఉన్నాయంటారు..?
పట్టణీకరణతో ప్రాథమికంగా ప్రజలకు మౌళిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. పరిపాలన మెరుగుపడుతుంది. ప్రధానంగా సామాజిక రుగ్మత కులం ప్రాధాన్యత తగ్గిపోతుంది. సమానత్వ భావన వస్తుంది.
కేసీఆర్‌ సర్కారు తన విధానాలను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందంటారా ?
కేసీఆర్‌ సర్కారేకాదు, ఏ ప్రభుత్వమైన పరిస్థితులకు అనుగుణంగా విధానాలు సమీక్షించుకుంటే మరిన్ని మంచి ఫలితాలు వస్తాయి. ఎప్పటికప్పుడు ఆ పనిచేస్తే కొత్త కొత్త ఆలోచనల ఆవిష్కరణ జరుగుతుంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ ప్రజలకు మరింత సేవ చేయడానికి అవకాశం కలుగుతుంది.
రాష్ట్రంలోని నిరుద్యోగుల ఆశలు నేరవేరాయని అనుకోవచ్చా ?
ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేయాలి. ఇందుకు ప్రభుత్వ రంగం లోని సంస్థలను పురికొల్పాలి. ఉపాధి అవకాశాల మెరుగుకు చర్యలు తీసుకోవాలి. యువతకు నైపుణ్యాలను నేర్పించాలి. ఇది రాష్ట్రంలో మరింత పెరగాలి. ప్రయివేటు రంగాన్ని వాడుకోవాలి. రిజర్వేషన్లు తీసుకొస్తే మరింత మంచింది.
సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలను కలిసే అవకాశం ప్రజలకు కలగడం లేదనే విమర్శలు ఉన్నాయి ?
మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలను కలవడం లేదంటే నేను అంగీకరించను. ఇది గతంలో ఉండకపోయేది. ఇప్పుడా అవకాశముంది. వారంతా ఎప్పటికప్పుడు ప్రజలతో మమేకం అవుతూనే ఉంటారు. సీఎంను సాధారణ ప్రజలు కలవాల్సిన అవసరం ఏముంటుంది? వారికి చేరాల్సిన సంక్షేమ పథకాలు అన్నీ పోతూనే ఉన్నాయి. అయితే ప్రజాదర్భార్‌లాంటివి పెట్టి ప్రజలను కలిస్తే సమస్యలు తెలుస్తాయి.

Spread the love