కౌలు రైతులను గుర్తించాల్సిందే…

Tenant farmers Need to recognize...– పంట పండించడం కంటే అమ్ముకోవడమే కష్టమైపోతోంది
– ‘దున్నేవాడిదే భూమి’ అంటూ కమ్యూనిస్టులు నినదించారు
– రైతు స్వరాజ్యవేదిక నిర్వహించిన బహిరంగ విచారణలో వక్తలు…
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
పంటను పండించడం కంటే దాన్ని అమ్ముకోవడమే కౌలురైతులకు కష్టమైపోతోందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. వ్యవసాయంపై మమకారంతో కష్టపడి పంట పండిస్తున్న కౌలు రైతులను ప్రభుత్వ గుర్తించడం లేదని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో కౌలు రైతు చట్టం (2011)లో తెచ్చినప్పటికీ దాన్ని అమలు చేయడం లేదన్నారు. కౌలు రైతులకు ఉన్న గుర్తింపు కార్డులకు విలువలేకుండా పోయిందన్నారు. పంటనష్టపోయినా, కౌలు రైతు మరణించినా ఎలాంటి సాయం అందడం లేదని తెలిపారు. కౌలురైతులపై పెట్టుబడి భారంతోపాటు కౌలు భారం అదనంగా పడుతోందని తెలిపారు. బ్యాంకు రుణాలు అందక ప్రయివేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో ‘ రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో కౌలు రైతు సమస్యలపై బహిరంగ విచారణ’ చేపట్టారు. దీనికి జ్యూరీ సభ్యులుగా రైతు ఉద్యమ నేత యోగేంద్రయాదవ్‌, కవిత కురుగంటి, సజయ, టి గోపాల్‌రావు వ్యవహరించారు. కౌలు రైతులు సలాం సోమ్‌జీ (ఆదిలాబాద్‌), కరువ మంజుల (వికారాబాద్‌), కొప్పుల అలివేలు (నల్లగొండ), సిలివేరి సదానందం( కరీంనగర్‌), నకిరేకంటి సైదులు (యోగి) (సూర్యాపేట), మోతె మమత (యాదాద్రి భువనగిరి), ముండాల రాజేందర్‌ (ఆదిలాబాద్‌).వెన్న రాధ (సిద్దిపేట), యాస నర్సయ్య ( జయశంకర్‌ భూపాలపల్లి), మెస్రం మారుతి (మంచిర్యాల) తదితరులు తమతమ అనుభవాలను, ఆవేదనలు వినిపించారు. కౌలు రైతులు పండించిన పంటను అమ్ముకోవడానికి ఆసామీ బ్యాంకు ఖాతాపై ఆధారపడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డీజీ నరసింహారావు మాట్లాడుతూ కౌలు రైతు సమస్యలు
న్యాయసమ్మతమైనవి అన్నారు. వారి పోరాటానికి సీపీఐ(ఎం) మద్దతు ఇస్తోందన్నారు. కౌలు రైతుల సమస్యలను సర్కారు విస్మరిస్తున్నదని చెప్పారు. కౌలు రైతు చట్టాన్ని అమలు చేయడంతోపాటు వారిని గుర్తించాలని కోరారు. ఆనాడుచంద్రబాబు కూడా పేదల భూములను కార్పొరేట్‌కు అప్పగించేందుకు ప్రయత్నించారని గుర్తుచేశారు. రాష్ట్రంలో కౌలు రైతులు లేరంటూ సీఎం కేసీఆర్‌ చెబుతున్నారనీ, ఇంకా కనువిప్పు కలగలేదన్నారు. సీపీఐ(ఎం) అధికారంలో ఉన్న సమయంలో కౌలు రైతుల కోసం ‘ఆపరేషన్‌ బర్గా’ పేరుతో హక్కులు కల్పించామన్నారు. ప్రస్తుతం కేరళలోని ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వం కూడా ‘కుటుంబ శ్రీ’ పేరుతో కౌలు రైతులకు అండగా ఉంటున్నదని గుర్తుచేశారు. తెలంగాణ సాయుధ పోరాటం ఫలితంగానే కౌలుదార్లకు చట్టాలు వచ్చాయని గుర్తు చేశారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పశ్యపద్మ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం కౌలు రైతుల సమస్యలకు పరిష్కారం చూపడం లేదన్నారు. అనేక పోరాటాల ఫలితంగానే కౌలు రైతు చట్టాన్ని సాధించామని తెలిపారు. ఆ చట్టంతో కౌలు రైతుకు బ్యాంక్‌ రుణాలు, పంట అమ్ముకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. వారిని గుర్తించాలంటూ లోకాయుక్తలో కేసు వేశామనీ, అనుకూలంగా తీర్పు వచ్చిందన్నారు. ఆ తీర్పును అమలు చేయాలని ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. దున్నేవాడిదే భూమి అనే నినాదంతో కమ్యూనిస్టులు పోరాటం చేశారని తెలిపారు. ఈ అంశాన్ని తమ పార్టీ మ్యానిఫెస్టోలో చేర్చుతామన్నారు. సీపీఐ (ఎం-ఎల్‌) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రాయల చంద్రశేఖర్‌ మాట్లాడుతూ కౌలు రైతుల కౌలు తగ్గించేందుకు కృషి చేయాల్సిన అవసరముందని చెప్పారు. వారిని ఉద్యమంలో భాగస్వాములను చేయాలన్నారు. సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన సీఎం కేసీఆర్‌ కౌలు రైతుల లెక్కలు ఎందుకు తీయడం లేదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌.ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ప్రశ్నించారు.
రైతు బంధు పేరుతో భూస్వాములకు వేల కోట్లు కట్టబెట్టిన సీఎం కౌలు రైతులకు మాత్రం అన్యాయం చేశారని తెలిపారు. కౌలు రైతులు మరణిస్తే ప్రభుత్వం పరిహారం కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో రైతు స్వరాజ్యవేదిక నాయకులు కన్నెగంటి రవి, విస్కా కిరణ్‌, కొండల్‌ సమన్వయపరిచారు. ఎస్‌డీఎఫ్‌ నేత వెంకట్‌రెడ్డి, టీజేఎస్‌ నేత లక్ష్మి, అంబటి నారాయణ, సత్యవతి, జక్కుల వెంకటయ్య, సోమిడి శ్రీనివాస్‌, కోండల్‌రెడ్డి తదితరులు మాట్లాడారు.

Spread the love