– సమ్మెలో ఉన్న గార్మెంట్ ఫ్యాక్టరీలను తెరిచిన పోలీసులు
– కార్మికులపై రబ్బరు బుల్లెట్లు, టియర్ గ్యాస్ ప్రయోగం
ఢాకా : బంగ్లాదేశ్‌లో కార్మికుల సమ్మె కారణంగా మూత పడిన గార్మెంట్ ఫ్యాక్టరీలను పోలీసులు తెరవడంతో ఉద్రికత్త పరిస్థితులు నెలకున్నాయి. గార్మెంట్ ఫ్యాక్టరీలను తెరవకుండా పోలీసుల చర్యలను కార్మికులు తీవ్రంగా వ్యతిరేకించారు. విధుల్లోకి వెళ్లకుండా తోటి కార్మికులను కార్మికులు అడ్డుకోవడంతో పాటు ఆందోళనలకు దిగారు. దీంతో కార్మికులను చెదరగొట్టడానికి వారిపై పోలీసులు రబ్బరు బుల్లెట్లు, టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఢాకాకు 60 కిలీమీటర్ల దూరంలో ఉన్న శ్రీపూర్ వద్ద 35 ఏళ్ల మహిళ తీవ్రంగా గాయపడింది. కాగా, కొన్ని ప్రాంతాల్లో కార్మికులు ఫ్యాక్టరీలకు నిప్పు అంటించారని, లూటీలకు పాల్పడ్డారని పోలీసులు ఆరోపిస్తున్నారు.
వేతనాలను కనీసం మూడు రెట్లు పెంచాలని డిమాండ్‌తో కొన్ని రోజుల నుంచి బంగ్లాదేశ్‌లోని గార్మెంట్ కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. దీంతో వారం రోజుల నుంచి గార్మెంట్ ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో పోలీసులు వాటిని తెరిచారు. కార్మికులు దీనిని తీవ్రంగా ప్రతిఘటించారు. ‘బ్రాండ్లు, రిటైలర్ల లాభం గురించి మాత్రమే ప్రభుత్వం శ్రద్ద పెడుతుంది. కార్మికుల శ్రేయస్సు లేదా కార్మికులు అర్ధాకలితో ఉన్నారనే వాస్తవాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు’ అని బంగ్లాదేశ్ గార్మెంట్ అండ్ ఇండిస్టియల్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ కల్పోనా అక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజుల నుంచి సాగుతున్న సమ్మెతో కొన్ని ప్రపంచ అగ్రశ్రేణి ఫ్యాషన్ బ్రాండ్‌ల ఉత్పత్తికి అంతరాయం కలిగిందని, దీంతో పోలీసులు రంగంలోకి దిగారని ఆరోపించారు.
జీవన వ్యయాలు విపరీతంగా పెరిగిపోవడంతో కుటుంబాన్ని పోషించ లేక ఇబ్బందులు పడుతున్నామని గార్మెంట్ కార్మికులు చెబుతున్నారు.
సమ్మెతో ఫ్యాక్టరీ యజమానులకు ప్రాతినిధ్యం వహిస్తున్న బంగ్లాదేశ్ గార్మెంట్ తయారీదారులు, ఎగుమతిదారుల సంఘం (బిజిఎంఇఎ) కార్మికులకు 25 శాతం వేతన పెంపును అందించింది. అయితే ఇది కార్మికులు డిమాండ్ చేస్తున్న కోరిన 23,000 టాకాల (209 అమెరికా డాలర్లు) నెలవారీ వేతనం కంటే ఇది చాలా తక్కువగా ఉంది.
బంగ్లాదేశ్‌లో సుమారు 3,500 గార్మెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. దక్షిణాసియా నుంచి ఎగుమతయ్యే మొత్తం ఎగుమతుల్లో 85 శాతం వాటాను ఈ ఫ్యాక్టరీలు కలిగి ఉన్నాయి. గ్యాప్, వాల్‌మార్ట్, హెచ్‌అండ్ ఎం, జారా, ఇండిటెక్స్, బెస్ట్ సెల్లర్, లెవీస్, మార్క్స్ అండ్ స్పెన్సర్, ప్రిమార్క్ ఆల్డి వంటి ప్రపంచ ప్రముఖ బ్రాండ్ల యూనిట్లు బంగ్లాదేశ్‌లో ఉన్నాయి. అయితే కార్మికుల పని పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. ఇక్కడ కనీస నెలసరి వేతనాలు 8,300 టాకా (75 డాలర్లు ) నుండి ప్రారంభమవుతాయి.