కాకతీయ విశ్వవిద్యాలయంలో ఉద్రిక్తత

నవతెలంగాణ – వరంగల్: కాకతీయ విశ్వవిద్యాలయంలో బుధవారం తాత్కాలిక అధ్యాపకుల నిరసన ఉద్రిక్తతకు దారి తీసింది. సుమారు 70 మంది అధ్యాపకులు ఒక్కసారిగా రిజిస్ట్రార్‌ మల్లారెడ్డి కార్యాలయాన్ని ముట్టడించడంతోపాటు ఆయన్ను కాసేపు గదిలో బంధించారు. సాయంత్రం ఆరు నుంచి రాత్రి పది గంటల వరకు ఆందోళనతో కేయూ పరిపాలనా భవన ప్రాంగణం అట్టుడికింది. దీంతో హనుమకొండ ఏసీపీ దేవేందర్‌రెడ్డి నేతృత్వంలో పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని అధ్యాపకులను శాంతింపజేసేందుకు యత్నించినా వారు ఆందోళన విరమించలేదు. తమను ఎట్టి పరిస్థితుల్లో కాంట్రాక్టు అధ్యాపకులుగా గుర్తించనిదే ఆందోళన విరమించేది లేదని ఉపకులపతి తాటికొండ రమేశ్‌కు తాత్కాలిక అధ్యాపకులు తెగేసి చెప్పారు. తాము అప్‌గ్రేడ్‌ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, న్యాయపరమైన చిక్కులు వస్తే మీరే చూసుకోవాలని చెప్పి, అఫిడవిట్లతో రిజిస్ట్రార్‌ను కలవాలని సూచించి వీసీ భోజనానికి వెళ్లారు. అనంతరం అధ్యాపకులు ప్రమాణపత్రాలతో రిజిస్ట్రార్‌ మల్లారెడ్డిని కలవగా ఇది తన పరిధిలో లేదని చెప్పడంతో అధ్యాపకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయనపైకి దూసుకెళ్లారు. రిజిస్ట్రార్‌ లోపల ఉండగానే ఆయన గదిలో పెట్టడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు కలగజేసుకొని రిజిస్ట్రార్‌ను బయటకు తీసుకొచ్చారు. ప్రభుత్వానికి లేఖ రాస్తానని రిజిస్ట్రార్‌ హామీ ఇవ్వడంతో వెళ్లిపోయారు.

Spread the love