టీచర్లలో టెట్‌ టెన్షన్‌!

Tet tension among teachers!– ఉత్తీర్ణత అవుతామా? లేదా?
– ఏండ్ల తరబడి బోధిస్తున్నా పాసయ్యేది కష్టమే
– ఉపాధ్యాయులను వేధిస్తున్న ఎన్‌సీటీఈ నిబంధన
– ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్ష లేదంటున్న విద్యాశాఖ
– డీఎడ్‌, బీఎడ్‌ అభ్యర్థులతోపాటే రాయాలంటున్న అధికారులు
– ఏప్రిల్‌లో టెట్‌ నిర్వహణకు ఏర్పాట్లు
– మేలో ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు
– విద్యాశాఖ కసరత్తు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో పదోన్నతుల కోసం ఎదురుచూసే టీచర్లను ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) టెన్షన్‌ వేధిస్తున్నది. ఎందుకంటే ఉపాధ్యాయులకు పదోన్నతులు కావాలంటే టెట్‌ ఉత్తీర్ణత తప్పనిసరి. ఇదే విషయాన్ని జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (ఎన్‌సీఈటీ) స్పష్టం చేసింది. ఉపాధ్యాయులుగా నియామకం కావాలన్నా, పదోన్నతి పొందాలన్నా టెట్‌లో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి అంటూ ఎన్‌సీఈటీ 2010లో నిబంధనలను విడుదల చేసింది. అయితే 2015లో చివరిసారిగా రాష్ట్రంలో ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించినా ఆ నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ వర్తింపచేయలేదు. ఎనిమిదేండ్లుగా పదోన్నతుల కోసం ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు పదోన్నతులు కావాలంటే ఎన్‌సీఈటీ నిబంధనల ప్రకారం హైకోర్టు ఆదేశాలతో టెట్‌ ఉత్తీర్ణత తప్పనిసరి అని విద్యాశాఖ ప్రకటించింది. సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (ఎస్జీటీ), స్కూల్‌ అసిస్టెంట్లు (ఎస్‌ఏ) తప్పనిసరిగా టెట్‌ ఉత్తీర్ణులు కావాలని స్పష్టం చేసింది. అయితే ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్‌ నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. కానీ ప్రత్యేక టెట్‌ నిర్వహించేది లేదనీ, అందరికీ ఒకే టెట్‌ ఉంటుందనీ, డీఎడ్‌, బీఎడ్‌ అభ్యర్థులతోపాటే ప్రస్తుత ఉపాధ్యాయులు రాయాలని విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు. ఇది ఉపాధ్యాయుల్లో ఆందోళన రేకెత్తిస్తున్నది. టెట్‌లో ఉత్తీర్ణత అవుతామా? లేదా? అన్న ఆందోళన వారిని వేధిస్తున్నది.
2010 తర్వాత టెట్‌ నిర్వహించని విద్యాశాఖ
రాష్ట్రంలో 26 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 1,22,386 ఉపాధ్యాయ పోస్టులున్నాయి. అందులో ప్రస్తుతం 1,03,343 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. 19,043 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 2010కి ముందు ఉపాధ్యాయులుగా నియామకమై బోధనలో ఉన్నారు. స్కూల్‌ అసిస్టెంట్లు అయితే ఎవరి సబ్జెక్టును వారే బోధిస్తారు. ఇప్పుడు పదోన్నతులు పొందాలంటే టెట్‌ ఉత్తీర్ణత కావాలన్న నిబంధన వారిని వేదనకు గురిచేస్తున్నది. 2010 తర్వాత ఉపాధ్యాయులకు టెట్‌ నిర్వహించలేదు. వారు రాయాలని విద్యాశాఖ ప్రకటించలేదు. ఇప్పుడు టెట్‌ ఉత్తీర్ణత కావాలని చెప్పడంతో ఉపాధ్యాయులు ఆందోళనలో ఉనానరు. టెట్‌ పేపర్‌-1 ఉత్తీర్ణత కావాలంటే చైల్డ్‌ డెవలప్‌మెంట్‌, పెడగాజీ, తెలుగు, ఇంగ్లీష్‌, మ్యాథ్స్‌, ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌ చదవాలి. పేపర్‌-2 పాసవ్వాలంటే చైల్డ్‌ డెవలప్‌మెంట్‌, పెడగాజీ, తెలుగు, ఇంగ్లీష్‌, మ్యాథ్స్‌, సైన్స్‌ (మ్యాథ్స్‌, సైన్స్‌ అభ్యర్థులకు) లేదా సోషల్‌ స్టడీస్‌ (సోషల్‌ అభ్యర్థులకు) 150 మార్కుల చొప్పున పరీక్ష ఉంటుంది. అందులోనూ 150 మార్కుల్లో ఓసీలు 90 మార్కులు (60 శాతం), బీసీలు 75 మార్కులు (50 శాతం), ఎస్సీ,ఎస్టీలు 60 మార్కులు (40 శాతం) సాధిస్తేనే ఉత్తీర్ణులవుతారు. ఇందులో ఓసీలు ఉత్తీర్ణులు కావడం కొంత కష్టంగానే ఉన్నది. డీఎడ్‌, బీఎడ్‌ అభ్యర్థులు కోచింగ్‌లకు వెళ్లి సన్నద్ధమైతేనే గతేడాది సెప్టెంబర్‌ 15న నిర్వహించిన టెట్‌లో 3.5 శాతం మాత్రమే పాసయ్యారు. ప్రస్తుతం ఉపాధ్యాయులుగా ఉన్న వారు టెట్‌ ఉత్తీర్ణత పొందడం కష్టంగానే ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
టెట్‌ నిర్వహణకు విద్యాశాఖ ఏర్పాట్లు
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తున్నది. ఏప్రిల్‌లో టెట్‌ నిర్వహించాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. మేలో ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని భావిస్తున్నారు. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభమయ్యేలోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆలోచిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికను రూపొందించి రాష్ట్ర ప్రభుత్వ ఆమోదానికి పంపించాలని అధికారులు భావిస్తున్నారు. ఇంకోవైపు డీఎస్సీ నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రంలో 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి జిల్లాస్థాయి నియామక కమిటీ (డీఎస్సీ) నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ సెప్టెంబర్‌ ఆరో తేదీన విడుదల చేసిన విషయం తెలిసిందే. 1,77,502 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. తాజాగా ఉపాధ్యాయ ఖాళీల వివరాలను పంపాలంటూ డీఈవోలను విద్యాశాఖ ఆదేశించింది. మెగా డీఎస్సీ ప్రకటిస్తామని కాంగ్రెస్‌ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అందుకనుగుణంగా 11 వేల ఉపాధ్యాయ పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది.
టెట్‌ నుంచి మినహాయింపునివ్వాలి : చావ రవి, ప్రధాన కార్యదర్శి, టీఎస్‌యూటీఎఫ్‌
ఉపాధ్యాయుల పదోన్నతుల్లో సంక్షోభాన్ని రాష్ట్ర ప్రభుత్వం నివారించాలి. గత ఎనిమిదేండ్లలో పదోన్నతుల్లేక టీచర్లు ఇబ్బందులు పడుతున్నారు. పదోన్నతులు పొందాలంటే ఎన్‌సీటీఈ నిబంధనల ప్రకారం టెట్‌ ఉత్తీర్ణులు కావాలనడం ఉపాధ్యయులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నది. పదోన్నతులకు టెట్‌ నుంచి మినహాయింపునివ్వాలి. లేదా ఇన్‌సర్వీస్‌ టీచర్ల కోసం ప్రత్యేకంగా టెట్‌ను నిర్వహించాలి. అదీ వీలుకాకుంటే కనీసం ఐదేండ్ల వరకు ఉపాధ్యాయులు టెట్‌ ఉత్తీర్ణులు కావాలనే నిబంధనను విధించాలి.

Spread the love