టెక్స్‌టైల్‌ అస్తవ్యస్తం

Textile chaos– సబ్సిడీ అందక.. ట్రయల్‌ రన్‌ కాక.
–  మడికొండలో సూరత్‌ నేతన్నల దుస్థితి
– రూ.10.40 కోట్ల సబ్సిడీ కోసం ఎదురుచూపులు
నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్ర ప్రభుత్వం పిలుపునందుకొని సూరత్‌కు వలసెళ్లిన చేనేత కార్మికులు ఎంతో ఆశతో తిరిగి వచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల హామీతో వారంతా హన్మకొండ జిల్లా కేంద్రంలోని మడికొండ కాకతీయ టెక్స్‌టైల్స్‌ పార్క్‌లో యూనిట్లు ఏర్పాటు చేసుకున్నారు. ఈ యూనిట్లకు నేటికీ సబ్సిడీ విడుదల కాకపోవడంతో కేవలం 26 పవర్‌ల్యూమ్‌ యూనిట్లు మినహా ఉత్పత్తికి సిద్ధమైన మరో 140 యూనిట్లు ట్రయల్‌ రన్‌ చేయక నిలిచి ఉన్నాయి. సబ్సిడీ ఇవ్వకపోవడంతో యంత్రాలను అమర్చినా ట్రయల్‌ రన్‌ చేయకపోవడంతో సేల్‌డీడ్‌లు రూపొందించలేదు. దీంతో పార్క్‌ అస్తవ్యస్తంగా మారింది. 364 యూనిట్లకుగాను కేవలం 26 యూనిట్లు మాత్రమే ఉత్పత్తిని ప్రారంభించాయి. సబ్సిడీ ఇస్తేనే ట్రయల్‌ రన్‌ చేస్తామని సూరత్‌ నుండి వచ్చిన నేత కార్మికులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో యూనిట్‌కు 25 శాతం సబ్సిడీ, బ్యాంక్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌ 7.5 శాతం ఇవ్వాల్సి వుంది. వీటి కోసం చేనేత కార్మికులు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఉన్నతాధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా ఫలితం లేదు. ఒక్కో యూనిట్‌కు సుమారు రూ.2 కోట్ల మేరకు పెట్టుబడి పెట్టగా ఇందులో 25 శాతం లెక్కన రూ.25 లక్షలు సబ్సిడీగా, బ్యాంక్‌ ఇంట్రెస్ట్‌ రూపంలో మరో రూ.15 లక్షలు మొత్తంగా ఒక్కో యూనిట్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూ.40 లక్షలు చెల్లించాల్సి వుంది. ఈ మొత్తం విడుదల చేయకపోవడంతో మిగతా యూనిట్‌ల యజమానులు ముందుకు పోలేకపోతున్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా కేసీఆర్‌ ఆనాడు అనేకమార్లు ఇక్కడ పనులు లేక మన నేతన్నలు కడుపు పట్టుకొని సూరత్‌, బీవండి, సోలాపూర్‌లకు తరలి వెళ్లారని, రాష్ట్రం ఏర్పడగానే వాళ్లందరినీ తిరిగి తీసుకొచ్చి ఉపాధి కల్పిస్తామని ప్రకటించారు. ఈ మేరకు సూరత్‌ నుండి 364 మంది చేనేత కార్మికులు తిరిగి వరంగల్‌కు రావడానికి సిద్ధపడ్డారు. దీంతో కార్మికులంతా కాకతీయ టెక్స్‌టైల్స్‌ మరియు వీవర్స్‌ వెల్ఫేర్‌ మ్యాక్‌ సొసైటీగా ఏర్పడ్డారు. 2019లో సీడీటీఎంఎస్‌ పథకం కింద టెక్స్‌టైల్స్‌ పరిశ్రమలకు అనుమతి తెచ్చుకున్నారు. ఈ పథకం కింద ఒక్కో యూనిట్‌కు రూ.1 కోటి ఇచ్చారు. మిగతా పెట్టుబడిని బ్యాంకుల ద్వారా రుణంగా తీసుకున్నారు. సగటున ఒక్కో యూనిట్‌కు రూ.2 కోట్ల పెట్టుబడి పెట్టారు. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌళిక వసతుల కల్పన కార్పొరేషన్‌ మడికొండ ప్రాంతంలో 364 ప్లాట్లు చేసి నేత కార్మికులకు పంపిణీ చేశారు. ఇందులో షెడ్‌ల నిర్మాణం పూర్తి చేసి యంత్రాలను అమర్చారు. ఇందులో ఇప్పటికే 26 యూనిట్‌లు ఉత్పత్తిని ప్రారంభించాయి. నియమ, నిబంధనల మేరకు ఒక్కో యూనిట్‌కు 25 శాతం సబ్సిడీతోపాటు బ్యాంక్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌ 7.5 శాతం యూనిట్‌ యాజమాన్యానికి చెల్లించాల్సి వుంది. ఇప్పటి వరకు సబ్సిడీ చెల్లించకపోవడంతో కార్మికులు తీవ్ర అసంతృప్తితో వున్నారు.
రూ.10.40 కోట్ల సబ్సిడీ కోసం ఎదురుచూపులు
సూరత్‌ నుండి ఎంతో ఆశతో వచ్చిన నేత కార్మికులు మడికొండ పార్క్‌లో యూనిట్‌లను ఏర్పాటు చేసినా, సకా లంలో సబ్సిడీ ఇవ్వకపోవ డంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ మ్యాక్‌ సొసైటీ కార్మికులు మొత్తం 166 యూనిట్లకు సబ్సిడీ రావాలంటున్నారు. అధికారులు మాత్రం 26 యూనిట్లకే సబ్సిడీ రావాలంటున్నారు. ఈ మేరకు ఆ యూనిట్‌లకు సంబంధించిన దస్త్రాలను ప్రభుత్వానికి పంపినట్టు చెబుతున్నారు.
సమన్వయలోపం కార్మికులకు శాపం..
ఒకవైపు బ్యాంకు అధికారులు, ఇచ్చిన రుణానికి ఇఎంఐ చెల్లించాలని పట్టుపడుతున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తాం, మీరు ఇక్కడే పనిచేసుకోండని ప్రకటిస్తుందే తప్పా నిధులను విడుదల చేయదు. దీంతో పవర్‌ల్యూం కార్మికులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. యంత్రాలను ట్రయల్‌ రన్‌ చేయకపోతే సేల్‌ డీడ్‌ చేయమని టీఎస్‌ఐఐసీ అధికారులు చెబుతుండగా, సేల్‌ డీడ్‌ చేయకుండా జాప్యం చేస్తే సిక్‌ ఇండిస్టీల కింద ప్రకటించి వేలం వేసే పరిస్థితి ఉత్పన్నమవుతుందని బ్యాంకు అధికారులు హెచ్చరిస్తున్నారు. యంత్రాలను నడిపి ఉత్పత్తి ప్రారంభించి మార్కెటింగ్‌ చేసి సేల్స్‌ ట్యాక్స్‌ కడితేనే యూనిట్‌లు పద్ధతి ప్రకారం పనిచేస్తున్నట్టు అని అని బ్యాంకర్లు చెబుతున్నారు.

అధికారులు, కార్మికుల మధ్య నలుగుతున్న పార్క్‌
అధికారుల వాదన, కార్మికుల వాదనలు పరస్పరం భిన్నంగా వున్నాయి. సబ్సిడీ ఇచ్చే విషయంలోనూ భిన్నాభిప్రాయా లున్నాయి. హన్మకొండ జిల్లా చేనేత, జౌళి శాఖ అధికారులు నడుస్తున్న యూనిట్‌లకు సంబంధించి దస్త్రాలు ప్రభుత్వానికి పంపామని, సబ్సిడీ విడుదల చేయాల్సి వుందని చెబుతున్నారు.
సర్కార్‌ సహకరించాలి : దర్గా స్వామి, ఛైర్మన్‌
మడికొండ టెక్స్‌టైల్స్‌ పార్క్‌లో ఏర్పాటు చేసిన పవర్‌ ల్యూమ్‌ యూనిట్‌లకు సబ్సిడీని విడుదల చేసి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కాకతీయ టెక్స్‌టైల్స్‌ మరియు వీవర్స్‌ వెల్ఫేర్‌ మ్యాక్‌ సొసైటీ చైర్మెన్‌ దర్గా స్వామి కోరారు. 166 యూనిట్లకు సబ్సిడీ విడుదల చేయకుండానే ఇఎంఐ చెల్లించమంటున్నారన్నారు. సబ్సిడీ విడుదల చేస్తే యంత్రాలు అమర్చిన యూనిట్స్‌ను కూడా రన్‌ చేస్తామన్నారు. కరోనాతో తీవ్రంగా నష్టపోయామని రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు.

Spread the love