అత్యవసర చర్యలు తీసుకోకుంటే అంతే

– సహాయక శిబిరాల్లో అంటువ్యాధుల విజృంభిస్తాయి
– వైద్యుల హెచ్చరిక
న్యూఢిల్లీ : మణిపూర్‌లోని శిబిరాల్లో నివసిస్తున్న ప్రజలకు అంటువ్యాధుల విజృంభణపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటు వ్యాధులపై వెంటనే నివారణ చర్యలు చేపట్టకపోతే డెంగ్యూ, ఇతర అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నదని హెచ్చరించారు. ప్రజలు నివసించే ఇరుకైన ప్రదేశాలు, మంచి నీరు, పారిశుధ్య సౌకర్యాల లేమి ఈ వ్యాప్తికి సహాయపడతాయని వారు చెప్పారు. రాష్ట్ర మాజీ ఆరోగ్య మంత్రి కూడా అయిన డాక్టర్‌ ఎం. నారా సింగ్‌ మాట్లాడుతూ.. ”నేను ఆందోళన చెందుతున్నాను.
అంటువ్యాధులు విజృంభించవచ్చు. ముఖ్యంగా, డెంగ్యూ, జపనీస్‌ ఎన్సెఫాలిటిస్‌ వంటివి ఉన్నాయి. ఎటువంటి నివారణ చర్యలూ చేపట్టడం లేదు” అని ఆయన అన్నారు. డాక్టర్‌ నారా సింగ్‌ కూడా ఇండియన్‌ డాక్టర్స్‌ ఫర్‌ పీస్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఐడీపీడీ) అనే అసోసియేషన్‌లో సభ్యుడు. మణిపూర్‌ వెలుపలి నుంచి ఐడీపీడీ సభ్యులు కూడా సెప్టెంబర్‌ 1 మరియు 2 తేదీలలో రాష్ట్రాన్ని సందర్శించారు.”శిబిరాల్లో సరైన ఏర్పాట్లు లేకుండా 60,000 మందికి పైగా ఉన్నారు. అందువల్ల వారు ఈ ఇన్ఫెక్షన్లన్నింటికీ గురవుతారు. ఇప్పటికే కొన్ని మలేరియా కేసుల నివేదికలు వస్తున్నాయి” అని డాక్టర్‌ నారా సింగ్‌ చెప్పారు.
రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలు ప్రారంభమై సెప్టెంబర్‌లో ఐదో నెలలోకి చేరుకున్నాయి.ఇంఫాల్‌లో ఉన్న మరో ఐడీపీడీ సభ్యుడు డాక్టర్‌ మంగ్లేమ్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ”కొన్ని శిబిరాలకు మాత్రమే పైపుల ద్వారా నీటి సరఫరా ఉన్నది. మిగిలిన వారు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసే తాగునీటిపైనే ఆధారపడాల్సి వస్తున్నది. అడ్డుకట్టల కారణంగా సరఫరా అస్తవ్యస్తంగా ఉండటమే కాకుండా.. ఇలా సరఫరా అవుతున్న తాగునీటి నాణ్యతను నిర్ధారించడం కష్టం” అని అన్నారు.

Spread the love