నీట్‌ పేపర్‌ లీకేజీ ఘటనలో నిందితులను శిక్షించాలి

నీట్‌ పేపర్‌ లీకేజీ ఘటనలో నిందితులను శిక్షించాలి– డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేష్‌
నవతెలంగాణ-భూపాలపల్లి
దేశంలో జరిగిన నీట్‌ పరీక్ష పేపర్‌ లీకేజీ ఘటనపై విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేష్‌ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని శ్రామిక భవనంలో నిర్వహించిన డీవైఎఫ్‌ఐ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. నీట్‌ పరీక్ష లీకేజీపై కేంద్రం స్పందించ కుండా, ఎవరైతే గ్రేస్‌ మార్కులు పొందారో వారి స్కోర్‌ కార్డులు రద్దు చేసి, వారికి మళ్ళీ రీ ఎగ్జామ్‌ నిర్వహిస్తామనడం అంటే నీట్‌ అవకతవకలను పక్కదారి పట్టించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీట్‌ పరీక్షపై ప్రజలకు అనేక అనుమానాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేయకుండా ఎన్‌టీఏ ఏకపక్షంగా వ్యవహరిస్తోందన్నారు. పరీక్ష కంటే ముందు రోజు బీహార్‌లోని పాట్నాలో 13మందిని పేపర్‌ లీకేజీ విషయంలో అరెస్టు చేశారని గుర్తు చేశారు. హర్యానాలో ఒకే సీరియల్‌ నెంబర్‌ కలిగిన ఎనిమిది మంది విద్యార్థులకు టాప్‌ ర్యాంకులు వచ్చాయన్నారు. రాజస్థాన్‌, గుజరాత్‌ల్ల్లో కూడా ఇలాంటి లీకేజీ అంశాలు ముందుకొచ్చాయని, వాటిపై విచారణ ఎందుకు జరపట్లేదని ప్రశ్నించారు. పరీక్షకు హాజరైన 24 లక్షల మంది విద్యార్థులకు రీ-ఎగ్జామ్‌ నిర్వహించి, ఎన్‌టీఏను రద్దు చేయాలన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుని విద్యార్ధులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు భుక్య నవీన్‌, ఎ శ్రీకాంత్‌, జిల్లా నాయకులు కవిత, అప్సర్‌, సరిత, దేవెందర్‌, సుజాత, స్వాతి, రాకేష్‌, జ్ఞానేశ్వర్‌, వసుంధర తదితరులు పాల్గొన్నారు.

Spread the love