బీజేపీ ఓటమే లక్ష్యం…

BJP's goal is to win... కేరళ స్ఫూర్తితో దేశవ్యాప్త ఐక్య ఉద్యమాలు
– పేదలకు సంక్షేమ పథకాలు వద్దన్న మోడీని గద్దె దింపాల్సిందే
– ఢిల్లీ కేంద్ర కార్యాలయ నిర్మాణానికి
– కేరళ ప్రజల విశేష ఆదరణ : బి వెంకట్‌
కొచ్చి : ఓ పక్క బడా కార్పొరేట్లకు వేల కోట్ల రూపాయలు రాయితీలిస్తూ.. మరోపక్క పేదల సంక్షేమ పథకాలే దేశాభివృద్ధికి ఆటంకమని ప్రచారం చేస్తున్న ప్రధానిని ఇంటికి సాగనంపే ఐక్య ఉద్యమాలను దేశవ్యాప్తంగా చేపడతామని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి వెంకట్‌ అన్నారు. శ్రామిక ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రత్యామ్నాయ విధానాలను అమలు చేస్తున్న కేరళ వామపక్ష ప్రభుత్వం దేశానికి ఆదర్శమని చెప్పారు. ఢిల్లీలో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం కేంద్ర కార్యాలయ నిర్మాణానికి కొచ్చిన్‌లో ప్రజల నుంచి విరాళాలు సేకరించే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై నిధి వసూళ్లలో ఆయన భాగస్వామి అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 25 వేల ప్రాథమిక యూనిట్లు కలిగిన కేరళ రాష్ట్రంలో 26 లక్షల సభ్యత్వం ఉన్నది. ప్రతి ప్రాథమిక యూనిట్‌ నుంచి రూ. 2000 వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ప్రతి సభ్యుడు నుంచి రూ.20కు తక్కువ కాకుండా ఆర్థిక సహాయాన్ని కోరుతున్నారు. ఆర్థిక వనరులతో పాటు వ్యవసాయ కార్మికుల ఇండ్లలో ఉన్న పాత వస్తువులను సేకరించాలని కేరళ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుకు అనూహ్యమైన స్పందన వచ్చింది. ప్రతి వ్యవసాయ కార్మికుల ఇండ్లలో ఉన్న పాత న్యూస్‌ పేపర్లు, మోటార్‌ సైకిళ్ళు, ఇనుప బీరువా లతోపాటు ఇతర వస్తువులను అందిస్తున్నారు. ఇవి అమ్మటం ద్వారా వచ్చిన నిధిని నుండి రూ. కోటికి ఢిల్లీ కేంద్ర కార్యాలయ నిర్మాణానికి అందిస్తామని కేరళ రాష్ట్ర కమిటీ ప్రకటించటం హర్షించదగిన విషయం అన్నారు. ఏ ఒక్క కుటుంబానికి ఆర్థిక భారం కాకుండా సభ్యులందరినీ భాగస్వామిని చేస్తూ ప్రజా ఉద్యమంగా నిధి సేకరణ చేస్తున్నారు.
జీ20 సమావేశాల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అభివృద్ధికి ఆటంకమని చెప్పడం పేదలపై దాడి చేయడమేనని విమర్శించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం, ఎస్సీ ఎస్టీ సబ్‌ ప్లాన్‌ చట్టం , అటవీ హక్కుల చట్టం లను అమలు చేయకుండా నీరు గారిచే కుట్ర చేస్తున్నది అన్నారు. అట్టడుగు వర్గాల హక్కుల కోసం దేశవ్యాప్త ఐక్య ఉద్యమాలను నిర్వహించడానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

Spread the love