– ఎఫ్‌టీసీసీఐ, వీఎస్‌టీ సంయుక్త కార్యక్రమంలో – అధ్యక్షులు మీలా జయదేవ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
స్థానికంగా ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు సాధికారతే తమ లక్ష్యమని ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షులు మీలా జయదేవ్ అన్నారు. హైదరాబాద్‌లోని ఎఫ్‌టీసీసీఐ, వీఎస్‌టీ సంయుక్తంగా శుక్రవారం నిర్వహించిన సాధికారత కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల సీజన్‌లోనూ దఢ సంకల్పంతో 180 మంది మహిళలు హాజరయ్యారని తెలిపారు. ఇది సంకల్పం, సాధికారతకు సంబంధించిన స్ఫూర్తిదాయక కథగా మారిన విశేషమైన ఘటనగా అభివర్ణించారు. సీఎస్‌ఆర్‌లో భాగంగా వీఎస్‌టీ వ్యవస్థాపక ప్రయాణంలో మహిళలకు మద్దతు, సాధికారత కోసం ఎఫ్‌టీసీసీఐతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిందన్నారు. వీఎస్‌టీ పరిశ్రమల ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమం, అడ్డంకులను ఛేదించి, విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా మారడానికి అవసరమైన నైపుణ్యాలు, విజ్ఞానంతో మహిళలను సన్నద్ధం చేయడమే లక్ష్యంగా పెట్టుకుందన్నారు. మహిళలకు అవసరమైన నైపుణ్యాలు, జ్ఞానం, వనరులతో వారి వ్యవస్థాపక ప్రయాణంలో రాణించడానికి, వారి కమ్యూనిటీల ఆర్థికాభివృద్ధికి దోహదపడేలా రూపొందించామని తెలిపారు.