పోటీ కోసం దరఖాస్తు ప్రక్రియ షురూ…

– ఎస్సీ, ఎస్టీలకు దరఖాస్తు రుసుం రూ. 25వేలు
– ఇతర అభ్యర్థులకు రూ.50వేలు
– ఏఐసీసీ ఎలక్షన్‌ కమిటీ నిర్ణయం తర్వాతే బీ ఫామ్‌
– మీడియాలో వస్తున్న అభ్యర్థుల జాబితా ఊహాగానాలే : టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహుల కోసం కాంగ్రెస్‌ పార్టీ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించింది. ఈనెల 18 నుంచి 25వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. ఎస్సీ, ఎస్టీలకు రూ. 25వేలు,సాధారణ అభ్యర్థులు రూ. 50వేలు పార్టీ పేరిట డీడీ రూపంలో చెల్లించాలి.దరఖాస్తుల ప్రక్రియ కోసం నియమించిన సబ్‌ కమిటీ ఈమేరకు నిర్ణయించినట్టు వెల్లడించారు. దరఖాస్తు రుసుము తిరిగి చెల్లించబడదనీ, దరఖాస్తు రుసుం పార్టీ కార్యక్రమాలకు ఉపయోగిస్తామనిదని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుములు రేవంత్‌రెడ్డి వెల్లడించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, పార్టీ నేతలు మధుయాష్కీగౌడ్‌, అంజన్‌కుమార్‌ యాదవ్‌, సంపత్‌కుమార్‌, చల్లా వంశీచంద్‌రెడ్డి, బెల్లయ్యనాయక్‌, మానవతారారు, మెట్టు సాయికుమార్‌తో కలిసి రేవంత్‌ దరఖాస్తు ఫారాన్ని విడుదల చేశారు. దరఖాస్తుల కార్యక్రమం శుక్రవారం మొదలైందని వెల్లడించారు. అన్ని దరఖాస్తులను ఎలక్షన్‌ కమిటీ, స్క్రీనింగ్‌ కమిటీ పరిశీలిస్తుందని వివరించారు. పార్టీకి చేసిన సేవలు, సర్వేలు, గెలుపు ప్రాతిపదికన అభ్యర్థుల నివేదిక తయారు చేస్తామని తెలిపారు. ఏఐసీసీ సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీ నిర్దారించాకే అభ్యర్థులను ఫైనల్‌ చేస్తారని వెల్లడించారు. అప్పటివరకు తామే అభ్యర్థులమంటూ ఎవరైనా చర్చించుకున్నా…అవి ఊహాగానాలే అవుతాయని చెప్పారు. అభ్యర్థుల జాబితా ఫైనల్‌ అయినట్టు మీడియాలో వచ్చే కథనాలు నమ్మొద్దని కోరారు. గతంలో టికెట్‌ హామీ ఇచ్చారంటూ జరిగే ఊహాగానాలకు ఫుల్‌స్టాఫ్‌ పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే పార్టీ నేతలెవరైనా దరఖాస్తు చేసుకోవాల్సిందేనన్నారు.
కోర్టు చెప్పినా ప్రభుత్వం నాకు భద్రత కల్పించడం లేదు : ఇష్టాగోష్టిలో రేవంత్‌ ఆవేదన
హైకోర్టు కోర్టు చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం తనకు భద్రత కల్పించడం లేదని రేవంత్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీగా, జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న తనకు సెక్యూరిటీని తొలగిస్తారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్‌కు కావాల్సినంత భద్రతను కల్పించామని గుర్తు చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన ఇష్టాగోష్టిగా విలేకర్లతో మాట్లాడారు. ‘నేను ప్రజల మనిషిని. నాకు సెక్యూరిటీతో పనిలేదు.అది లేకుండా ఎక్కడికైనా వస్తాను. సెక్యూరిటీ లేకుండా ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలకు కేసీఆర్‌ రాగలరా? నన్ను ఓడించేందుకు పోలీసులను కేసీఆర్‌ వాడుకున్నారు. సెక్యూరిటీ విషయంలో నన్ను భయపెట్టాలని చూస్తే భయపడేవాడ్ని కాదు. లక్షలాది మంది కాంగ్రెస్‌ కార్యకర్తలు నా సైన్యం. నా సెక్యూరిటీ వాళ్ళే. కాంగ్రెస్‌ పార్టీకి మెజార్టీ, మైనార్టీ అనే తేడా ఉండ దు. కాంగ్రెస్‌లో మైనార్టీలు చాలా పెద్ద స్థాయిలో ఉన్నారు’ అని పేర్కొన్నారు. అధికార బీఆర్‌ఎస్‌ మైనార్టీల కోసం ఏం చేయలేదని విమర్శించారు. డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లలో ఒక్క పర్సెంట్‌ కూడా మైనార్టీలకు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌కు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టేనన్నారు. సీఎం కేసీఆర్‌ మైనార్టీ ఓట్లను బీజేపీకి అమ్ముకుంటు న్నారని ఆరోపించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ వేరువేరు కాదన్నారు. బీజేపీ వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీ పోరాడుతున్నదని చెప్పారు. బీజేపీపై బీఆర్‌ఎస్‌ పోరాడుతున్నట్టు ఆ పార్టీ నాయకులు చెప్పగలరా? అని సవాల్‌ విసిరారు. ప్రభుత్వానికి తొత్తులుగా పని చేసే అధికారుల పేర్లను తప్పకుండా రెడ్‌బుక్‌లో రాస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్‌ నాయకులపై తప్పుడు కేసులు పెట్టే వాళ్ళను వదిలి పెట్టబోమని హెచ్చరించారు. ప్రభాకర్‌రావు, రాధ కిషన్‌రావు, భుజంగరావు, నర్సింగ్‌రావు లాంటి అధికారుల నుద్దేశించి తాను వ్యాఖ్యలు చేసినట్టు తెలిపారు. ప్రజల కోసం పనిచేసే అధికారులపై నాకెప్పుడూ గౌరవం ఉంటుందని రేవంత్‌ పునరుద్ఘాటించారు.

Spread the love