సర్వాయి పాపన్నది ఆత్మగౌరవ పోరాటం

– పాపన్న ఏ మతానికో.. కులానికో చెందిన వ్యక్తి కాదు : మంత్రి కేటీఆర్‌
నవతెలంగాణ – సిరిసిల్ల రూరల్‌
సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ ఆత్మగౌరవ పోరాటం చేశారని, ఆయనలాగే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పోరాటం చేసి గోల్కొండ కోటపై జాతీయ జెండా ఎగరవేశారని ఐటీ పురపాలకశాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని నర్సింగ్‌ కళాశాల కూడలిలో ఏర్పాటు చేసిన సర్దార్‌ సర్వాయి పాపన్న విగ్రహాన్ని శుక్రవారం ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి కేటీఆర్‌ ఆవిష్కరించారు. మధ్య మానేరులో బోటింగ్‌ ప్రారంభించారు. అనంతరం పద్మనాయక కల్యాణ మండపంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ ఆత్మగౌరవ పోరాటం చేశారన్నారు. వచ్చే నెలలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మల్కాపేట రిజర్వాయర్‌ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రారంభించనున్నారని తెలిపారు. గౌడ కుల సంఘ భవన నిర్మాణానికి రెండెకరాల స్థలంతోపాటు రెండు కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ ఒక కులానికో, మతానికి సంబంధించిన వ్యక్తి కాదని మన రాష్ట్రానికి పోరాటం చేసిన శక్తి అన్నారు. గ్రామాల్లో గిరక తాళ్లతోపాటు ఈత తాటి వనాలను పెంచేందుకు ప్రభుత్వ ఖాళీ స్థలాలను కేటాయించనున్నట్టు వెల్లడించారు. సిరిసిల్ల గౌడన్నలకు తెలంగాణలోనే అందరికంటే ముందు సేఫ్టీ మోకులు అందజేస్తామని చెప్పారు. సిరిసిల్ల జిల్లాలో త్వరలోనే నీరా కేఫ్‌ ఏర్పాటు చేస్తామని, మల్కాపేట జలాశయం నుంచి సింగసముద్రం బట్టల చెరువు మీదుగా నర్మాల జలాశయాన్ని నింపుతామని చెప్పారు. ఇప్పటికే నర్మాలను మల్లన్న సాగర్‌ ప్రాజెక్టు ద్వారా నింపుతున్నామన్నారు.ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ నేతన్నకు.. గీతన్నకు సిరిసిల్లలో అవినాభావ సంబంధం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నేతన్న.. గీతన్నలకు సంక్షేమ ఫలాలు అందిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 70వేల మంది గీత కార్మికులకు పెన్షన్‌ ఇస్తోందని, మద్యం దుకాణాలలో 15శాతం రిజర్వేషన్లను కేటాయించిందని వివరించారు. హైదరాబాదులోని ట్యాంక్‌ బాండ్‌పై రూ.3కోట్లతో సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి గౌడన్నలు అండగా ఉండాలని కోరారు.

Spread the love