అడ్డగోలు అదనపు చార్జీలు వద్దు : ఆర్‌బీఐ

అడ్డగోలు అదనపు చార్జీలు వద్దు : ఆర్‌బీఐ
న్యూఢిల్లీ : పలు కారణాలతో రుణాలు చెల్లించలేక, దివాలా తీసిన వారిపై బ్యాంక్‌లు భారీగా విధించే అదనపు ఛార్జీలపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఆందోళన వ్యక్తం చేసింది. బ్యాంక్‌లు, బ్యాంకింగేతర విత్త సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ)లు అడ్డగోలుగా ఛార్జీలు వసూలు చేయకుండా కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. విత్త సంస్థలు, రుణదాతలు, రెగ్యులేటేడ్‌ సంస్థలు (ఆర్‌ఈ) జరిమానా రూపంలో వసూలు చేసే వడ్డీ విషయంలో సహేతుకంగా, పారదర్శకంగా ఉండాలని సూచించింది. రుణగ్రహీతలు చెల్లించలేని సమయంలో చాలా సంస్థలు నిబంధనలు ఆసరాగా చేసుకొని జరిమానా వడ్డీ రేట్లను సాధారణంగా కంటే అధికంగా వసూలు చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చినట్టు ఆర్‌బీఐ తెలిపింది. జరిమానా రూపంలో ఆదాయం పెంచుకొనే సాధనాలను వాడకూడదని పేర్కొంది. రుణ చెల్లింపులు చేయలేకపోతే జరిమానాను ఛార్జీల రూపంలో మాత్రమే విధించాలని ఆదేశించింది. దీనిని ఆదాయ మార్గంగా మార్చుకోకూడదని సూచించింది. వడ్డీకి మరే ఇతర అదనపు భారాలను జోడించకూడదని స్పష్టం చేసింది. జరిమానా వడ్డీ, ఇతర ఛార్జీల విధానాలను తయారు చేసేందుకు ఓ బోర్డును ఏర్పాటు చేయనున్నట్టు ఆర్‌బీఐ తెలిపింది.
ఫిక్స్‌డ్‌ వడ్డీ రేట్లకు మారొచ్చు..
రుణ గ్రహీతలు ఫిక్స్‌డ్‌ వడ్డీ రేట్లకు మారేలా బ్యాంక్‌లు, విత్త సంస్థలు అవకాశం కల్పించాలని ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా ఈఎంఐ, కాల వ్యవధి రెండూ పెంచుకునే అవకాశం సైతం కల్పించాలని సూచించింది. దీనిపై ఆర్‌బీఐ తాజాగా నోటిఫికేషన్‌ జారీ చేసింది. అలాగే.. రుణ కాలవ్యవధిలో ఎన్నిసార్లు వడ్డీ రేట్లకు మారేందుకు అవకాశం ఉంటుందో కూడా రుణగ్రహీతలకు ముందే స్పష్టం చేయాలని తెలిపింది.

Spread the love