– అభ్యర్థుల సిలుం వదిలిస్తున్న ఫెస్టివల్స్
– వినాయక, బతుకమ్మ, దేవి నవరాత్రుల ఖర్చులు భరింపు
– ఒక్కో పండుగ రెండు, మూడురోజుల నిర్వహణతో భారం
– అభ్యర్థుల క్యాంపు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు
– ఓట్ల కోసం పోటాపోటీగా చందాలు.. పంపకాలు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి:
తెలుగు క్యాలెండర్ ప్రకారం ప్రతియేటా భాద్రపద మాసం నుంచి పండుగల సీజన్ మొదలవుతుంది. ముందుగా వినాయక నవరాత్రి ఉత్సవాలతో పర్వదినాలు మొదలవుతాయి. ఈ ఏడాది అధిక శ్రావణ మాసంతో ఆ తర్వాత మాసాలన్నీ ఆలస్యంగా ప్రారంభమవుతున్నాయి. 2019లో జరగాల్సిన ఎన్నికలు 2018లో ముందస్తుగా రావడంతో ఐదేండ్ల పాలనకాలం పూర్తవడంతో 2023లోనూ సరిగ్గా అదే సమయంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. సెప్టెంబర్ నుంచే ఎన్నికల కోలాహలం మొదలైంది. అదే నెల 18వ తేదీ నుంచి గణేశ్ నవరాత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 9న ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 13వ తేదీ నుంచి బతుకమ్మ సంబురాలు, 14 నుంచి దేవీ శరన్నవరాత్రోత్సవాలు షురూ అయ్యాయి. నవంబర్ 12న దీపావళి పర్వదినం కూడా ఉంది. అసెంబ్లీ ఎన్నికల వేళ ఇలా వరుసగా వస్తున్న పండుగలు ప్రధాన పార్టీల అభ్యర్థులకు భారంగా మారాయి. ఓట్ల కోసం ఈ ఉత్సవాలన్నింటి ఖర్చుల్లో కొంతభాగం భరించాల్సి వస్తోంది. చందాల కోసం ఆయా ఉత్సవ కమిటీలు క్యాంప్ కార్యాలయాలను ఆశ్రయిస్తుండటంతో ఓట్ల కోసం కాదనలేని పరిస్థితి ఉంది.
రూ.కోట్లల్లో చందాలు..
వినాయక ఉత్సవాల నిర్వహణ ఖర్చుల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది గణేశ్ ఉత్సవ కమిటీలకు రూ.వందల కోట్లల్లో ఆశావహులు, అభ్యర్థులు చందాలు ఇవ్వాల్సి వచ్చింది. ఒక ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 1200 వరకు విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ బీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఉన్న కందాల ఉపేందర్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా భావిస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక్కో గణేష్ ఉత్సవ కమిటీకి రూ.10వేలు, రూ.5వేల చొప్పున చందాలు ఇచ్చారు. ఇంతలోనే బతుకమ్మ సంబురాలు, దేవీ శరన్నవరాత్రులు షురూ అయ్యాయి. అంతే మళ్లీ అదే గోల.. క్యాంపు కార్యాలయాల చుట్టూ ఉత్సవ నిర్వహణ కమిటీలు తిరగడం ప్రారంభించాయి. వచ్చిన వారిపేర్లు నమోదు చేసుకోవడం.. బతుకమ్మల వేడుక దగ్గరకు వెళ్లడం రూ.3వేల నుంచి రూ.10వేల వరకు ఇవ్వడం.. పరిపాటిగా మారింది. భారీగా ఓటర్లున్న చోట రూ.20వేల వరకు కూడా సమర్పించుకుంటున్నారు. అదే సమయంలో ముఖ్యంగా మహిళలు, యువత నిర్వహించే దేవీ శరన్నవరాత్రి ఉత్సవ కమిటీలకూ కానుకలు ఇవ్వక తప్పని స్థితి. రాష్ట్రంలోనే హాట్ సీటుగా మారిన పాలేరు నియోజకవర్గంలో అమ్మవారి విగ్రహాలు సుమారు నాలుగు వందల వరకు ప్రతిష్ఠించారు. కానుకలు, చందాలు ఇవ్వడంలో ఖ్యాతి గడించిన ఈ నియోజకవర్గ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థులు ఇరువురూ మళ్లీ సమర్పించుకుంటున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక్కో అమ్మవారి విగ్రహానికి రూ.10వేల వరకు ఇచ్చారని, కందాల కూడా కొన్ని విగ్రహాలకు చందాలు సమర్పించుకున్నట్టు ప్రచారం సాగుతోంది.
యాటల ఖర్చులూ తప్పవు..
దసరా అంటేనే ముక్క, చుక్క.. ఈ పండుగ వేళ యాటలు విచ్చలవిడిగా తెగాల్సిందే. ఊళ్లల్లో పార్టీలు, గ్రామపంచాయతీలు, కమ్యూనిటీల వారీగా జట్లు ఏర్పడతాయి. పంచాయతీల్లో వార్డుమెంబర్లంతా కలిసి యాటలు కొస్తారు. కమ్యూనిటీల వారీగా కూడా యాటలు తెగుతుంటాయి. పార్టీల వారీగానూ మేక, గొర్రెపోతులను కట్ చేసి ఇంటింటికి తిరిగి మాంసాన్ని పంచుతారు. ఎన్నికల నేపథ్యంలో దీనికయ్యే ఖర్చులను ఈసారి ఆశావహులు, అభ్యర్థులు భరించాల్సిందే. దీనిలో భాగంగా పలుచోట్ల యాట పోతుల కోసం రూ.20వేల నుంచి రూ.లక్షల వరకు భరిస్తున్నట్టు తెలుస్తోంది. పనిలో పనిగా ముఖ్యనాయకులు, కుల, వ్యాపార, ఉద్యోగ సంఘాల నేతలు.. ఇలా ప్రతి ఒక్కర్నీ సంతృప్తి పరచాల్సి ఉంటుంది. ఈ ఖర్చులు కూడా రూ.లక్షల్లోనే ఉన్నట్టు సమాచారం. పట్టణ, పల్లె ప్రాంత నియోజకవర్గాలని తేడా లేకుండా దాదాపు అన్నిచోట్ల ఈ ఖర్చులు తప్పేలా లేవు. ఈ ఖర్చు నుంచి తేరుకునే లోగానే దీపావళి రూపంలో మరో బాంబు పేలనుంది. నవంబర్‌లో దీపావళి నాటికి అన్ని పార్టీల అభ్యర్థులు ఖరారవుతారు. ప్రచారం కూడా మరింతగా ఊపందుకుంటుంది. నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. సభలు, సమావేశాల నిర్వహణ వంటివి ఉంటాయి. కాబట్టి అభ్యర్థులకు ఖర్చు తడిసిమోపడయ్యేలా ఉంది. అప్పనంగా వచ్చిన సొమ్ములు ఐదేండ్లకు ఓసారి వచ్చే ఎన్నికలప్పుడు తప్ప తీసే పరిస్థితి లేదు కాబట్టి ఆ మేరకు వెచ్చించాల్సిందేననే అభిప్రాయం ప్రజల్లో ఉంది.
ఒక్కో పండుగ రెండు, మూడు రోజులు..
అధిక మాసాలకు తోడు, తిథులు కూడా పండుగలు ఏరోజు జరుపుకోవాలనే విషయంలో సందిగ్ధతకు తావిస్తున్నాయి. తిథుల ప్రకారం పండుగలు నిర్వహించే ఆనవాయితీ హిందూ సంప్రదాయంలో ఉంది కాబట్టి ఈసారి సోమవారమా? లేక మంగళవారం నిర్వహించాలో సందిగ్ధం నెలకొంది. ప్రభుత్వం కూడా ఈనెల 23, 24 తేదీలను సెలవు దినంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో రెండు, మూడురోజులు పండుగ చేసుకుంటారు కాబట్టి.. ఎన్నికల వేళ ఆ మూడు రోజుల భారం పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులు మోయాల్సిందే. పర్వదినాల సమయంలో ఎన్నికలు రావడాన్ని ఓటర్లు ఆస్వాదిస్తుండగా.. అభ్యర్థులు మాత్రం తలలు పట్టుకుంటున్నారు.