
రాబోయే ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షల నిర్వహణ ప్రశాంత వాతావరణంలో పకండ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టరు హనుమంతు కే జెండగే అధికారులను ఆదేశించారు. మంగళవారం నాడు కాన్ఫరెన్స్ హాలులో ఆయన ఇంటర్మీడియట్, విద్యాశాఖ, సంబంధిత శాఖల అధికారులతో రాబోయే ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షలకు తీసుకోవాల్సిన చర్యలను, బాధ్యతలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈనెల 28 నుండి వచ్చే మార్చి 16 వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించబడుతున్నందున జిల్లాలో 30 పరీక్షా కేంద్రాల ద్వారా మెదటి, రెండవ సంవత్సరం కలిపి మొత్తం 12,559 మంది విద్యార్ధినీ విద్యార్ధులు పరీక్షలకు హాజరవుతున్నారని, ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు పరీక్ష నిర్వహించబడుతుందని, ఉదయం 9.00 గంటల తరువాత విద్యార్ధులను పరీక్షా కేంద్రాల లోపలికి అనుమతించబడరని తెలిపారు. సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్ టీములు క్షేత్రస్థాయిలో పనిచేస్తాయని తెలిపారు. వచ్చే మార్చి 18 నుండి ఏప్రిల్ 2 వ తేదీ వరకు పదవ తరగతి పరీక్షలు నిర్వహించబడతున్నాయని, మొత్తం 51 పరీక్షా కేంద్రాల ద్వారా 9402 మంది విద్యార్దినీ విద్యార్థులు పరీక్షలు వ్రాస్తున్నారని తెలిపారు. ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేసి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పరీక్షల నిర్వహణకు సంబంధిత అధికారులు సమన్వయంతో దిగ్విజయంగా పరీక్షల నిర్వహణను పూర్తి చేయాలని, పరీక్షా సమయంలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండరాదని, త్రాగునీరు, టాయ్లెట్స్, ఫ్యాన్స్, వెలుతురు, తగిన వసతులు ఉండాలని, ప్రాథమిక చికిత్సతో పాటు వైద్య బృందాలు అందుబాటులో ఉండాలని, పరీక్షా కేంద్రాలలో తగినంత ఫర్నీచర్, సిసి కెమెరాల పర్యవేక్షణ ఉండాలని తెలిపారు. విద్యార్ధులు ఎలాంటి అసౌకర్యాలకు గురికాకుండా ఆర్.టి.సి. బస్సులు పరీక్షా కేంద్రాలకు విద్యార్థులను పరీక్షా సమయం కంటే ముందుగానే తీసుకువచ్చేలా ప్లాన్ చేసుకోవాలని, బస్సుల ఫిట్నెస్ చెక్ చేసుకోవలని, రవాణా సదుపాయం లేని ప్ర్రాంతాలలో విద్యార్ధులను తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. స్మార్ట్ ఫోన్లు, మొబైల్స్, స్మార్ట్ వాచీలను పరీక్షా కేంద్రాలలో అనుమతించబడవని తెలిపారు. పరీక్షల అనంతరం జవాబు పత్రాలను క్లోజ్డ్ వెహికిల్లో తరలించే విధంగా విద్యాశాఖ, తపాల శాఖ తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
డిప్యూటీ పోలీసు కమీషనర్ రాజేశ్ చంద్ర మాట్లాడుతూ అన్ని పరీక్షా కేంద్రాల వద్ద తగినంత బందోబస్తు ఏర్పాటు చేస్తామని, పరీక్షా కేంద్రాల సమీపంలో 144 సెక్షన్ అమలులో వుంటుందని, పరీక్షా సమయంలో జీరాక్సు కేంద్రాలు మూసివేసేలా చర్యలు తీసుకుంటామని, నిబంధలన అతిక్రమిస్తే తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టరు ఎ భాస్కరరావు, భువనగరి రెవిన్యూ డివిజనల్ అధికారి అమరేందర్, జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణ రెడ్డి, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రమణి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.