– తెలంగాణలో పండే ప్రతి పంటను చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని డిమాండ్
– రైతుల హక్కుల కోసం చివరి వరకు పోరాటం కొనసాగిస్తాం
– బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే అన్నపూర్ణగా నిలిపిన రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా నిరాశపరుస్తోందని బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. ఆదివారం వేల్పూర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ డిసిసిబి డైరెక్టర్, మెండోరా మండల అధ్యక్షులు శేఖర్ రెడ్డి, కమ్మర్ పల్లి మండల అధ్యక్షులు రేగుంట దేవేందర్ మాట్లాడారు. కేంద్రం నిర్దేశించిన కోటా మేరకే పంటలు కొనుగోలు చేస్తామని, అదనంగా ఒక్క గింజ కూడా కొనబోమని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం 70 లక్షల మంది రైతుల భవిష్యత్తుపై మరణశాసనం రాసినట్టేనని పేర్కొంది.
కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం రైతును కేంద్రబిందువుగా చేసుకుని మిషన్ కాకతీయ, కాళేశ్వరం, రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్ వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి తెలంగాణలో వ్యవసాయ విప్లవానికి నాంది పలికిందని గుర్తు చేసింది. రైతుల ఖాతాల్లో నేరుగా లక్ష కోట్లకు పైగా జమ చేసి దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుబంధు పెంపు హామీని విస్మరించిందని, రైతు బీమా ప్రీమియం చెల్లింపుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించిందని, యూరియా కొరత సృష్టించి రైతులను ఇబ్బందులకు గురి చేసిందని ఆరోపించారు. పంటల కొనుగోళ్లలో జాప్యం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు.ఎన్నికల సమయంలో అన్ని పంటలను చివరి గింజ వరకు కొనుగోలు చేసి బోనస్ కూడా చెల్లిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ నాయకత్వం, ఇప్పుడు కేంద్రం కోటాకు మించి పంటలు కొనబోమని చెప్పడం రైతులను మోసం చేయడమేనని విమర్శించారు.
గతంలో రైతుల కోసం పోరాడతామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు చేతులెత్తేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.తెలంగాణలో పండే ప్రతి పంటను చివరి గింజ వరకు కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని, లేనిపక్షంలో రైతులతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. రైతుల ప్రయోజనాల కోసం చివరి వరకు పోరాడుతామని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో జైడి నాగధర్ రెడ్డి, కల్లెడ ఏలీయా బద్దం నర్సారెడ్డి, రాజ పూర్ణనందం, బద్దం చిన్నారెడ్డి, రేగుల్లా రాములు, సర్పంచ్ మొండి అశోక్, ప్రతాప్ రెడ్డి, డోళ్ళ రాజేశ్వర్, మాజీ ఎంపిటిసి రాములు, అశోక్, తదితరులు పాల్గొన్నారు.



