నైపుణ్యం, జిజ్ఞాస మేరకు కోర్సు ఎంచుకోవాలి

– ఆలోచనా శైలి, పోటీ సామర్థ్యం ముఖ్యమే…
– కాలేజీ ఎంపికలో తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలి
– కెరీర్‌ కౌన్సెలర్‌, సైకాలజిస్ట్‌ మహీపతి శ్రీనివాసరావు
నవతెలంగాణ ఆధ్వర్యంలో కెరీర్‌ గైడెన్స్‌ సదస్సు
బీ కేటగిరీ సీట్లను ప్రభుత్వమే భర్తీ చేయాలి
      ఇంజినీరింగ్‌లో బీ కేటగిరీలో సీట్లను ప్రభుత్వమే భర్తీ చేయాలని శ్రీనివాసరావు కోరారు. లేకపోతే కేవలం ధనవంతుల పిల్లలకే సీట్లు దక్కి… పేద ప్రతిభావంతులైన విద్యార్థులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నవతెలంగాణ జనరల్‌ మేనేజర్‌ (హెచ్‌ఆర్‌) నరేందర్‌ రెడ్డి, నవీన్‌, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
విద్యార్థులు తమకున్న నైపుణ్యం, జిజ్ఞాస, ఆలో చనా శైలి, పోటీ సామర్థ్యం మేరకు కోర్సును ఎంపిక చేసుకుంటే దాన్ని ప్రేమి స్తారనీ, ఇష్టంగా పూర్తి చేస్తా రని ప్రముఖ కెరీర్‌ కౌన్సెలర్‌, సైకాలజిస్ట్‌ మహీపతి శ్రీనివాస రావు తెలిపారు. నవతెలంగాణ దినపత్రిక ఆధ్వర్యంలో ఎంసెట్‌-2023 విద్యార్థుల కోసం ఉత్తమ బ్రాంచ్‌ను, ఉత్తమ కాలేజీని ఎంపిక చేసుకోవడమెలా? అనే అంశంపై ఆదివారం సాయంత్రం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. విద్యార్థులు, తల్లిదండ్రులకు పలు ప్రశ్నలను వేసి వారి నుంచి సమాధానాలు చెప్పించి కెరీర్‌ ఎంపికలో ఏ విధంగా ఆలోచించాలనేది తెలిపారు. ఎక్కువ మంది ట్రెండింగ్‌, డిమాండ్‌, తమకు సరిపడే కోర్సు అంటూ ఎంపికకు వెళ్తున్నారని చెప్పారు. కోర్సులు తీసుకున్న వారిలో చాలా మంది, తల్లిదండ్రులు చెప్పారనీ, స్నేహితులు తీసుకున్నారని అనే కారణంతో ఆయా కోర్సుల్లో చేరుతున్నట్టు తనతో చెప్పారని అను భవాలను వివరించారు.
ప్రస్తుత విద్యార్థుల్లో ఎక్కువ మంది కంప్యూటర్‌ సైన్స్‌ను తీసుకుంటు న్నారనీ, ఇందులో రాణించా లంటే మ్యాథమ్యాటిక్స్‌ ఫౌండే షన్‌తో పాటు లాజికల్‌ థింకింగ్‌ ఉండాలని సూచించారు. కోవిడ్‌-19 తర్వాత భారీ ప్యాకేజీలతో ఆఫర్లు వచ్చాయనీ, అయితే ప్రస్తుతం లే ఆఫ్‌లు ఇస్తున్నారని తెలిపారు. కంప్యూటర్‌ సైన్స్‌ అయితే, సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగాలకు అర్హత పొందుతారనీ, కోర్‌ ఇంజినీరింగ్‌ కోర్సులైతే రెండింటిలోనూ అర్హత పొందే విషయాన్ని గమనంలో ఉంచుకోవాలని కోరారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఆయా కాలేజీల్లో చేర్చే ముందు వాటిని సందర్శించడం, చదవాలనుకున్న కోర్సుకు సంబంధించిన ల్యాబ్‌ సౌకర్యాలను పరిశీలించడం, ప్లేస్‌మెంట్‌ శాతం తెలుసుకోవడం, కాలేజీలకిచ్చే ఎన్‌ఆర్‌ఎఫ్‌, కోర్సులకిచ్చే ఎన్‌బీఏ ర్యాంకింగ్‌లను తెలుసుకోవా లన్నారు. ఈ ర్యాంకింగ్‌ లేనంత మాత్రాన మంచి కాలేజీలు కావు…అనుకోవడానికి వీల్లేదనీ, వీటికి దరఖాస్తు చేసుకునేందుకు ఆయా కాలేజీలు ప్రారంభమై ఆరేండ్లు పూర్తి కావడంతో పాటు దరఖాస్తు చేసుకుని ఉండాలని చెప్పారు. అందువల్ల ర్యాంకింగ్‌ను ఒక అంశంగా మాత్రమే తీసుకోవాలే గానీ, అదే పూర్తి స్థాయి నిర్ణయం తీసుకునేందుకు ప్రాతిపదిక కాదని స్పష్టం చేశారు.
ఆయా కాలేజీల్లో ఫిజికల్‌ యాక్టివిటీస్‌, ఆట స్థలం, అందుబాటులో ప్రాథమిక ఆస్పత్రి, రవాణా సౌకర్యం తదితర అంశాలతో పాటు కోర్సు పూర్తయ్యే సరికి ఎంత ఖర్చవుతుందో చూసుకోవాలని సూచించారు. ఎట్టి పరిస్థితిలో కన్సల్టెంట్ల ద్వారా కాలేజీలు, కోర్సులను ఎంపిక చేసుకోవద్దని హెచ్చరించారు. వీరిలో అత్యధిక మంది కేవలం విద్యార్థులు, కాలేజీలు ఇచ్చే డబ్బుల ఆధారంగానే మంచి కాలేజీ, మంచి కోర్సు అంటూ చెబుతుంటారని తెలిపారు.

Spread the love