కాళోజీ నారాయణరావు తెలంగాణ భాషకు పట్టం కట్టడం ద్వారా తెలంగాణ సంస్కృతిని పరిరక్షించాడని సారంగపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు లలిత అన్నారు. ఈ మేరకు సోమవారం నాడు పాఠశాలలో జరిగిన కాళోజీ జయంతి సందర్భంగా నిర్వహించిన తెలంగాణ భాష దినోత్సవం కాళోజీ కవిత్వ మధురిమలు కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ప్రజల నాలుకపై సొగసైన పదాలతో, ప్రజల నిత్యజీవితంలో ప్రతిబింబించే పలుకుబడులతో కాళోజీ రచనలు సాగాయని, ఆయన రచించిన నా గొడవ అందుకు ఎదురులేని నిదర్శనం అని ఆమె అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు సంధ్య, రూప, శ్రావణి, లక్ష్మి, అదిబా కాళోజి కవితలను చదివి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు ఉపాధ్యాయులు గణపురం దేవేందర్, ఎస్. గంగాధర్, డాక్టర్ సల్లా సత్యనారాయణ కాళోజి జీవిత విశేషాలను, తెలంగాణ ఉద్యమ జ్ఞాపకాలను, వివరించారు. అనంతరం కాళోజీ కవితలను పఠించిన విద్యార్థులకు బహుమతులు అందించారు.