– కేంద్రం చేతిలో క్లబ్బు అజమాయిషీ
– బీజేపీ నేతలు ఆడింది ఆట… పాడింది పాట
– లా ట్రిబ్యునల్ ఆదేశాలను సాకుగా చూపి కబళించే యత్నం
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో బ్రిటీష్ పాలనలో ఏర్పడిన ప్రతిష్టాత్మక జింఖానా క్లబ్బు ఇప్పుడు కేంద్రంలోని అధికార బీజేపీ ఆజమాయిషీలో నడుస్తోంది. ఆ పార్టీ నేతలు ఆడింది ఆట… పాడింది పాటగా వ్యవహారాలు సాగుతున్నాయి. క్లబ్బు నిర్వహణలో అక్రమాలు జరిగాయని, నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆరోపిస్తూ మోడీ ప్రభుత్వం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో ఫిర్యాదు చేయడం, విచారణ అనంతరం క్లబ్బు బాధ్యతలను ప్రభుత్వానికి ట్రిబ్యునల్ అప్పగించడంతో ఆ సంస్థ పూర్వ వైభవాన్ని కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. దీనిపై పలువురు సభ్యులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
గత నాలుగు సంవత్సరాలుగా ఢిల్లీ జింఖానా క్లబ్ న్యాయ వివాదాలలో కూరుకుపోయింది. నిధుల దుర్విని యోగం, నిబంధనల ఉల్లంఘన, చట్టవిరుద్ధమైన సభ్యత్వా లు వంటి ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఒకప్పుడు రికార్డు స్థాయిలో రూ.62 కోట్ల ఆదాయం పొందిన ఈ క్లబ్బు నెలకు కోటి రూపాయల నష్టాన్ని మూటకట్టుకుంటూ ఆర్థిక ఇబ్బం దులతో సతమతమయ్యే స్థితికి చేరుకుంది. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకున్న కేంద్ర ప్రభుత్వం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)కు ఫిర్యాదు చేసింది. దీనిపై విచా రణ జరిపిన ట్రిబ్యునల్ అక్రమాలు జరిగిన మాట వాస్తవ మేనని తేల్చింది. క్లబ్బు నిర్వహణ బాధ్యతలు చేపట్టేందుకు గత సంవత్సరం కేంద్ర ప్రభు త్వాన్ని అనుమతించింది. 2022 ఏప్రిల్ 3వ తేదీ నుండి కేంద్రం నియమిం చిన కమిటీ ఆధ్వర్యంలోనే క్లబ్బు వ్యవహారాలు నడు స్తున్నాయి. ఈ కమిటీలో సుప్రీంకోర్టు న్యాయవాది, బీజేపీ ప్రతినిధి నళిన్ కోహ్లీ కూడా సభ్యుడే.
మసకబారిన ప్రతిష్ట
క్లబ్బు సభ్యులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రోడ్డెక్కడంతో దాని ప్రతిష్ట మసకబారింది. కోట్లాది రూపాయల సొమ్ము క్లబ్బు నుండి తరలిపోయిందని సభ్యుడైన ఓ మాజీ ఎంపీ ఆరోపించారని ఫైనాన్షియల్ టైమ్స్ ఆరోపించింది. అయితే అలాంటిదేమీ లేదని క్లబ్బు వాదిస్తోంది. 2021 ప్రారంభం నుండి ఈ క్లబ్బు ను వివాదాలు చుట్టుముట్టా యి. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఓ అధికారి పోలీసులు, సీనియ ర్ అధికారులు, మీడియా ప్రతి నిధుల ముందు ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఈ సంస్థ నిర్వహణను చేపట్టిందని ప్రకటించారు. ఏదేమైనా జింఖానాను తిరిగి తమ చేతుల్లోకి తీసుకోవాలని కొందరు సభ్యులు న్యాయ పోరాటం సాగిస్తున్నారు.
విచారణల పేరుతో…
కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత జింఖానాపై దృష్టి సారించారు. క్లబ్బులో అవకత వకలు జరుగుతున్నాయంటూ విచారణ జరిపించారు. 2000వ సంవత్సరంలో అధికారులు రెండు వేల పేజీల నివేదికను రూపొందించారు. మరో నివేదిక కూడా క్లబ్బుకు అవినీతి మరక అంటించింది. ఒకవేళ తప్పు జరిగి ఉంటే దానిని నిరూపించి, తగిన చర్యలు తీసుకోవచ్చునని, అయితే జింఖానాను ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఇవేమీ చేయలేదని అతుల్ దేవ్ విమర్శించారు.
పట్టించుకునే దిక్కేది?
తాజా పరిణామాలపై 84 సంవత్సరాల రిటైర్డ్ ఆర్మీ మేజర్ అతుల్ దేవ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్లబ్బుతో ఆయనకు యాభై సంవత్సరాల అనుబంధం ఉంది. ‘ఈ రోజు మా క్లబ్బుకు జరిగింది.
రేపు ఏ క్లబ్బుకైనా ఇలాంటిదే జరగవచ్చు’ అని ఆయన చెప్పారు. క్లబ్బు ఆజమాయిషీ బీజేపీ చేతుల్లోకి వెళ్లడాన్ని వ్యతిరేకిస్తూ మరో తొమ్మిది మంది సభ్యులతో కలిసి ఆయన న్యాయస్థానాన్ని ఆశ్ర యించారు. ‘మీరు కమిటీ సభ్యులుగా ఎన్నికైతే కమిటీ లోని మొత్తం పదిహేను వేల మందికీ మీరెవరో తెలు స్తుంది. మీకు అందరితో సంబంధాలు ఉంటాయి. ఫోన్ చేస్తే చాలు…పని జరిగి పోతుంది. మరి ఇప్పుడో? అంతా ప్రచ్ఛన్న యుద్ధమే. అనేక పనులు పెండింగ్‌లో పడిపోయాయి. పట్టించుకునే వారే లేరు’ అని వాపోయారు.
పౌర సమాజంపై పెత్తనం కోసమే…
మోడీ ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు, మేధా వులు సహా తనను విమర్శించే వారిపై ఉక్కు పాదం మోపుతున్న విషయం తెలిసిందే. జింఖానాలో జరుగు తున్న పరిణామాలను గమనిస్తే ఇది కేవలం ఓ రిక్రియేషన్ క్లబ్బుపై ఆధిపత్యం చెలాయించడం మాత్రమే కాదని, పౌర సమాజాన్ని పూర్తిగా తన చెప్పుచేతల్లో ఉంచుకునే ందుకు చేసిన ప్రయత్నమేనని విమర్శకులు అభిప్రా యపడ్డారు. మరోవైపు ఏదో ఒకటి చేయకపోతే క్లబ్బు పరిస్థితి చేయి దాటిపోతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అస్మదీయుల హవా
జింఖానా క్లబ్బులో చేరేందుకు ఓం పాఠక్ అనే వ్యక్తి 1982లో దరఖాస్తు చేశారు. అయితే దానిని క్లబ్బు కమిటీ ఆమోదించలేదు. మాజీ సైనికుడైన పాఠక్ బీజేపీ నాయకుడు కూడా. క్లబ్బు నిర్వహణ బీజేపీ చేతిలోకి రాగానే ఆయన్ని నూతన అడ్మినిస్ట్రేటర్‌గా నియమించారు. అయితే తనను ఎందుకు ఆ పదవిలో నియమించారో తెలియదని, ఎవరో ఫోన్ చేసి చెబితే అంగీకరించానని ఆయన చెప్పుకొచ్చారు. కానీ పదవిలో రాగానే ఆయన తనదైన ముద్ర వేయడం ప్రారంభించారు. అతుల్ దేవ్‌ను, మరికొందరు సభ్యులను ఇబ్బంది పెట్టే చర్యలు చేపట్టారు. క్లబ్బు లౌకిక స్వభావాన్ని దెబ్బతీసేలా లైబ్రరీలో భగవద్గీత ప్రతిని ఉంచారు. బకాయిలు చెల్లించని 400 మందిపై బహిష్కరణ వేటు వేశారు. వీరిలో శక్తివంతమైన కుటుం బాలకు చెందిన సభ్యులు కూడా ఉన్నారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి, బీజేపీ మంత్రి కుమారుడు కూడా పాఠక్ బాధితులే. ఇప్పుడు ఈ వ్యవహారం ఢిల్లీ హైకోర్టు విచారణలో ఉంది. తొమ్మిది నెలల పాటు నియంతలా వ్యవహరించిన పాఠక్ చివరికి గత సంవత్సరం ఏప్రిల్‌లో పదవి నుండి వైదొలిగారు. ఆ తర్వాత కమిటీలో మరికొందరు బీజేపీ విధేయులైన అధికారులను చేర్చారు.