దిగ్విజయంగా కాశ్మీర్‌ యాపిల్‌ రైతుల తొలి రాష్ట్ర మహాసభ

– షోపియాన్‌లో రెండు రోజుల పాటు నిర్వహణ
శ్రీనగర్‌ : యాపిల్‌ రైతుల సమస్యలపై జాతీయస్థాయి ఉద్యమాలను నిర్మించడంలో కీలక పాత్ర పోషిస్తున్న యాపిల్‌ ఫార్మర్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన జమ్ముకాశ్మీర్‌ విభాగం (జెఅండ్‌కె ఎఎఫ్‌ఎఫ్‌ఐ) మొట్టమొదటి రాష్ట్ర మహాసభ దిగ్విజయంగా జరిగింది. షోపియాన్‌లో శని, ఆదివారాల్లో నిర్వహించిన ఈ మహాసభకు జమ్ము ప్రాంతం నుంచి, కాశ్మీర్‌ లోయ నుంచి పెద్ద సంఖ్యలో యాపిల్‌ రైతులు హాజరయ్యారు. ఈ సమావేశానికి రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. ఇందులో మొదటిది జమ్ముకాశ్మీర్‌ ప్రాంతానికి చెందిన యాపిల్‌ రైతులు ఈ విధంగా సమావేశమవ్వడం ఇదే మొదటిసారి. అలాగే కల్లోల ప్రాంతంగా గుర్తింపు పొందిన షోపియాన్‌ జిల్లాలో మహాసభ జరగడం రెండో ప్రత్యేకత. మహాసభకు 165 మంది ప్రతినిధులు హాజరయ్యారు.
అఖిల భారత కిసాన్‌ సభ (ఎఐకెఎస్‌) ఆర్థిక కార్యదర్శి పి కృష్ణప్రసాద్‌, గుప్కార్‌ కూటమి అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే మహ్మద్‌ యూసఫ్‌ తరిగామి మహాసభకు హాజరై సంఘీభావం తెలిపారు. తగ్గుతున్న ధరలు, ప్రభుత్వ మద్దతు లేకపోవడం వంటివి యాపిల్‌ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే అంశాలపై నివేదికను జహూర్‌ అహ్మద్‌ రాథర్‌ సమర్పించారు. అలాగే 14 డిమాండ్లను కూడా ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదించారు.
అధ్యక్షకార్యదర్శులుగా జహూర్‌, రషీద్‌
మహాసభ 11 సభ్యులతో రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. జహూర్‌ అహ్మద్‌ను అధ్యక్షులుగానూ, అబ్దుల్‌ రషీద్‌ను కార్యదర్శిగానూ ఎన్నుకున్నారు. ఎఐకెఎస్‌ అధ్యక్షులు అశోక్‌ ధవే ప్రసంగంతో తొలి రోజు సమావేశం ముగిసింది. రెండో రోజున ఈ నెల 16న షోపియాన్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఆకస్మిక భారీ వర్షాలను, భద్రతా సమస్యలను దాటుకుంటా భారీ సంఖ్యలో యాపిల్‌ రైతులు ఈ సమావేశానికి హాజరయ్యారు. అశోక్‌ ధవాలే, పి కృష్ణప్రసాద్‌, జహూర్‌ అహ్మద్‌, గులాం నబీ మాలిక్‌, అద్దుల్‌ రషీద్‌ పండిట్‌, ఓం ప్రకాశ్‌ ప్రసంగించారు. మహాసభ ముగింపు సందర్భంగా నిర్వహించిన సభలో తరిగామి ప్రసంగించారు. యాపిల్‌ రైతుల పోరాటాలకు గుప్కార్‌ కూటమి అండగా నిలుస్తుందని తెలిపారు.

Spread the love