– సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
– ఢిల్లీ రైతు పోరాటం స్ఫూర్తితో విద్యార్థులు ఉద్యమించాలి : ఢిల్లీ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ మధు ప్రసాద్, అనిత రాంపాల్
– ‘భారత్ బచావో’ అఖిల భారత విద్యార్ధుల సదస్సు
నవతెలంగాణ – ముషీరాబాద్
రాజ్యాంగం మనకిచ్చిన హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందని, వాక్ స్వాతంత్య్రం, నిరసన తెలిపే హక్కులను ప్రభుత్వం హరిస్తున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ అన్నారు. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘భారత్ బచావో’ పేరుతో రెండు రోజుల పాటు నిర్వహించే అఖిల భారత విద్యార్ధుల సదస్సు ఆదివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత ప్రజలు స్వేచ్చ, స్వాతంత్య్రం, నిరసన తెలిపే హక్కులు కోల్పోయే ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నారని తెలిపారు. పాలస్తీనాపై ఇజ్రాయిల్ దాడులను వ్యతిరేకిస్తూ శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు చేస్తున్న వారిపై పోలీసులు లాఠీలు ఝళిపించారని, వారిని అరెస్టు చేసి జైళ్ళలో నిర్బంధించారన్నారు. ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాయడమే అన్నారు. సామ్రాజ్య వాదం, ఫాసిజం ఎదుర్కొనేందుకు అందరూ సమిష్టిగా పోరాటం నిర్వహించాలని నొక్కి చెప్పారు.
ఢిల్లీ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ మధు ప్రసాద్ మాట్లాడుతూ. దేశానికి పతకాలు సాధించిన రెజ్లర్లు వారిపై లైంగిక దాడులు జరుగుతున్నాయని నిరసన తెలిపితే పాలకులు నిందితుడిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా అతని పక్షం వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బహిరంగ ప్రదేశాలే కాక యూనివర్సిటీలు, ప్రభుత్వ కార్యాలయాల్లో సమావేశాలు ఏర్పాటు చేసుకున్నా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని జైలుకు పంపుతున్నారన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ అనిత రాంపాల్ మాట్లాడుతూ.. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా గళమెత్తిన వారిపై నిర్భందం ప్రయోగించినట్టుగానే విశ్వవిద్యా లయాల్లో హక్కుల కోసం ఉద్యమిస్తున్న అధ్యాపకులు, విద్యార్థులపైనా తీవ్రమైన అణచివేత ప్రయోగిస్తున్నారన్నారు. భారత విద్యా వ్యవస్థ ప్రమాదంలో ఉందన్నారు.
బీజీపీ ప్రభుత్వం అమలుచేయాలని చూస్తున్న నూతన విద్యా విధానం 2020 ద్వారా విద్యలో మత, మూఢ విశ్వాసాలను చొప్పించే ప్రమాదముందన్నారు. విద్యలో మత విశ్వాసాల చొరబాటు ప్రజాస్వామిక, లౌకిక సమాజ మనుగడకు విఘాతమని తెలిపారు. దేశంలో విద్యా పరిరక్షణ కోసం బలమైన ఉద్యమాలు జరగాలని, ఆ పోరాటాలకు ఢిల్లీలో రైతులు చేపట్టిన ఉద్యమమే స్ఫూర్తి కావాలని ఆకాక్షించారు. అన్నదాతల పోరాటం స్ఫూర్తితో నేటి విద్యార్థులకు తక్షణమే ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ నేతలు కె గోవర్ధన్, జీ ఝాన్సీ, ప్రొఫెసర్ అన్వర్ ఖాన్, జస్టిస్ కొల్సీ పాటిల్, భారత్ బచావో నేతలు గాదె ఇన్నయ్య, డాక్టర్ ఎమ్. ఎఫ్. గోపీనాథ్, జంజర్ల రమేశ్ బాబు, వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థి నేతలు తదితరులు పాల్గొన్నారు.