నవతెలంగాణ-తుంగతుర్తి
మృగశిర కార్తె, వర్షాకాలానికి నాంది పలికే విశిష్టమైన కాలం. రైతులకు ఏరువాకకు శ్రీకారం చుట్టే ఈ సమయం తెలుగు సంస్కృతిలో ప్రత్యేక ప్రాధాన్యం కలిగి ఉంది. మృగశిర కార్తె రోజున చేపలు తినే సంప్రదాయం వెనుక ఉన్న రహస్యమేంటి.. రోహిణి కార్తెలో భానుడి ప్రతాపానికి భూమి అగ్నిగుండంలా మారుతుంది. రోళ్లు సైతం పగిలిపోయేంత ఎండలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. అలాంటి మండుటెండలకు ముగింపు పలుకుతూ.. ప్రకృతికి కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చేది మృగశిర కార్తె. ఈ కార్తె ప్రారంభమవుతుందంటే చాలు.. ఆకాశంలో మేఘాలు కమ్ముకుంటాయి. తొలకరి చినుకులు నేలను తడుపుతాయి. రైతుల కళ్లలో ఆశలు చిగురిస్తాయి. తెలుగు సంప్రదాయంలో మృగశిర కార్తెకు ప్రత్యేకమైన స్థానం ఉంది. వర్షాకాలానికి స్వాగతం పలికే ఈ కాలం వ్యవసాయంతో పాటు ఆరోగ్య పరంగానూ ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది.
మృగశిర కార్తె అంటే ఏమిటి.?
తెలుగు పంచాంగం ప్రకారం సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించినప్పటి నుంచి మృగశిర కార్తె ప్రారంభమవుతుంది. ఇది ప్రకృతిలో ఒక ముఖ్యమైన మార్పుకు సంకేతంగా భావిస్తారు. రుతుపవనాలు క్రమంగా దేశంలోకి ప్రవేశిస్తూ వర్షాకాలానికి నాంది పలికే సమయం ఇదే. ఎండలు తగ్గి చల్లని గాలులు వీచడం, అక్కడక్కడా వర్షాలు కురవడం ప్రారంభమవుతుంది.
రైతులకు ఎందుకు ప్రత్యేకం.?
మృగశిర కార్తె అంటే రైతులకు పండుగతో సమానం. వర్షాలు పడతాయనే ఆశతో పొలాలను సిద్ధం చేసుకోవడం, దుక్కి దున్నడం, విత్తనాలు చల్లడం, నారుమడులు సిద్ధం చేసుకోవడం వంటి వ్యవసాయ పనులు ఈ కాలంలోనే మొదలవుతాయి. అందుకే దీనిని “ఏరువాక కాలం” అని పిలుస్తారు. రైతు జీవితంలో కొత్త పంట సీజన్‌కు ఇదే శ్రీకారం.
మృగశిర రోజున చేపలు తినే సంప్రదాయం ఎందుకు?
తెలుగు రాష్ట్రాల్లో మృగశిర కార్తె ప్రారంభమైన రోజున చేపలు తినడం ఒక ఆనవాయితీ. వేసవి కాలం తర్వాత వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా రోగ నిరోధక శక్తి తగ్గే అవకాశం ఉందని పెద్దలు భావించేవారు. ఈ నేపథ్యంలో శరీరానికి అవసరమైన పోషకాలు అందించేందుకు చేపలు తినాలని సూచించేవారు. ముఖ్యంగా ఆస్తమా, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారికి ఇది మేలు చేస్తుందనే విశ్వాసం. తెలుగు రాష్ట్రాల్లో చేప మందు పంపిణీ అనేది ఒక ప్రత్యేక కార్యక్రమంగా ప్రతి ఏడాది జరుగుతూనే ఉంది. పెద్ద ఎత్తున ప్రజలు, అస్తమా బాధితులు ఈ రోజున చేపమందును ప్రసాదంగా స్వీకరిస్తారు. మృగశిర కార్తె రోజున చేపలు తినడం వల్ల శరీరంలో వేడి తగ్గి, వాత, పిత్త, కఫాలు సమతుల్యతలో ఉంటాయని ప్రజలు బలంగా నమ్ముతారు. హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో బత్తిని కుటుంబం ఆధ్వర్యంలో ఉచిత ఆస్తమా చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం ఎంతో ప్రసిద్ధి చెందింది.
శాఖాహారులు ఏమి చేస్తారు?
చేపలు తినని వారు బెల్లంలో ఇంగువ కలిపి తీసుకోవడం సంప్రదాయంగా కొనసాగుతోంది. వర్షాకాలంలో వచ్చే కొన్ని సాధారణ ఆరోగ్య సమస్యలను తగ్గించేందుకు ఇది ఉపయోగపడుతుందని పెద్దలు చెబుతారు.
ప్రకృతిలో కొత్త అధ్యాయం
మృగశిర కార్తెతో కేవలం వర్షాలు మాత్రమే రావు. ఎండలతో నిర్జీవంగా కనిపించిన ప్రకృతి మళ్లీ సజీవంగా మారుతుంది. పచ్చని మొక్కలు చిగురిస్తాయి. చెరువులు, కుంటలు నీటితో నిండడం ప్రారంభమవుతుంది. రైతుల ముఖాల్లో ఆనందం కనిపిస్తుంది. అందుకే తెలుగు ప్రజల జీవితంలో మృగశిర కార్తె అనేది కేవలం ఒక కార్తె కాదు.. ప్రకృతి, వ్యవసాయం, సంప్రదాయం, ఆశలు అన్నింటినీ కలిపిన ఒక ప్రత్యేకమైన కాలం. తొలకరి చినుకులతో భూమాత పరవశించి, పాడిపంటలు సమృద్ధిగా పండాలని, రైతన్నల కష్టానికి తగిన ఫలితం దక్కాలని మనస్ఫూర్తిగా పలువురు శుభాకాంక్షలు తెలిపారు.



