పెద్దల జోక్యం తగ్గాల్సిందే..

పెద్దల జోక్యం తగ్గాల్సిందే..ఎంత ఎదిగినా తల్లిదండ్రులకు తమ పిల్లలు చిన్నవారిగానే కనిపిస్తారు. అయితే పెండ్లి చేసిన తర్వాత కూడా వాళ్ళకేం తెలియదు అనుకుంటారు చాలా మంది. అన్ని విషయాల్లో తామే కల్పించుకుని సరిదిద్దాలనుకుంటారు. దాంతో ఆ జంటల మధ్య అనేక సమస్యలు వస్తున్నాయి. పెద్దల జోక్యానికి తోడు నేటి జంటల్లో ‘నేను గొప్పంటే నేను గొప్పా’ అనే భావన కూడా బాగా పెరిగిపోయింది. కుటుంబం అంటే సర్దుకుపోవడం అనే విషయమే మర్చిపోయారు. వీటన్నింటి ఫలితంగా యువ జంటలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాయి. అలాంటి ఓ సమస్యే ఈ వారం ఐద్వా అదాలత్‌లో…
ముజఫర్‌ తన ముఫ్పై ఏండ్ల కూతురు రిజ్వానాని వెంటబెట్టుకుని ఐద్వా ఆఫీస్‌కు వచ్చి ‘మేడమ్‌ తను నా కూతురు. కరోనా కంటే ముందు పెండ్లి చేశాము. అబ్బాయి పేరు షరీఫ్‌. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి, మంచి జీతం. తెలిసిన వారు మంచి అబ్బాయి అంటే మంచి ఉద్యోగం ఉంది కదా అని పెండ్లి చేశాము. మా అమ్మాయి గవర్నమెంట్‌ ఆఫీసులో కాంట్రాక్ట్‌ ఉద్యోగం చేస్తుంది. పెండ్లికి ముందే తను ఉద్యోగం చేస్తున్న విషయం అతనికి తెలుసు. ‘పెండ్లి తర్వాత చేసినా మాకెలాంటి అభ్యంతరం లేదూ’ అన్నారు. కానీ ఇప్పుడు ఉద్యోగం మానేయమంటున్నాడు. ఇల్లు పట్టించుకోడు. తనకు వచ్చిన జీతం ఏం చేస్తున్నాడో తెలియదు. పెండ్లి అయినప్పటి నుండి వాళ్ళ ఖర్చులన్నీ నేనే చూసుకుంటున్నాను. బాగా పిసినారి. తన కొడుకు గురించి కూడా పట్టించుకోడు. ఏం చేయాలో అర్థం కాక మీ దగ్గరకు వచ్చాం’ అంటూ బాధపడ్డాడు.
అంతా విని తండ్రిని బయటకు పంపించి రిజ్వానాతో మాట్లాడితే ‘మేడమ్‌ అతను ఇంట్లో అస్సలు పట్టించుకోడు. బాబుకు నాలుగేండ్లు, స్కూల్లో చేర్పించాలంటే పట్టించుకోలేదు. మా నాన్ననే తీసుకెళ్ళి చేర్పించాడు. వాళ్ళ బంధువుల ఇంటికి నన్ను తీసుకెళ్ళడు. వాళ్ళ గురించి నాకు సరిగ్గా తెలియదు. వాళ్ళు ఉండే ఇల్లు మా ఆఫీసుకు చాలా దూరం. అందుకే నేను ఎక్కువగా మా అమ్మ వాళ్ళ దగ్గరే ఉండేదాన్ని. పెండ్లి తర్వాత వెంటనే ప్రెగెన్సీ వచ్చింది. ఇక జర్నీలు చేయడం ఎందుకనీ ఆయనే నన్ను ఇక్కడ ఉండమన్నారు. వారానికి ఒకసారి వస్తుండేవాడు. బాబు పుట్టాడు.
దేనికైనా ఖర్చు పెట్టాలంటే వంద సార్లు ఆలోచిస్తాడు. బాబు కోసం ఖర్చు పెట్టినప్పుడు కూడా ఇదే ధోరణి. ఎప్పుడూ ఏదో ఒక గొడవ పెట్టుకుంటూ ఉంటాడు. మా నాన్న వాళ్ళకు ఇంకో ఇల్లు ఉంటే మేము కొన్ని రోజులు అందులో అద్దెకు ఉన్నాము. అక్కడకు వచ్చిన దగ్గర నుండి రోజూ ఇంటికి లేటుగా వచ్చేవాడు. బాబును మా అమ్మ దగ్గర వదిలిపెట్టి నేను ఆఫీస్‌కి వెళ్ళేదాన్ని. మళ్ళీ ఆయన వచ్చిన తర్వాత తీసుకెళ్ళేవాడు. ఒకరోజు మా ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగింది. ఆ రోజు అర్ధరాత్రి మా నాన్నను రమ్మంటూ ఫోన్లు చేశాడు. ఆయనకు గుండె ఆపరేషన్‌ జరిగి మందులు వేసుకొని పడుకుంటాడు. ఇప్పుడు ఆయన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని వద్దని గట్టిగా వాదించాను. నన్నూ బాబును కొట్టి వెళ్ళిపోయాడు. ఇప్పటికి ఆరు నెలలు అవుతుంది. మీరే ఆయన్ని పిలిచి మాట్లాడండి’ అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది.
మేము షరీఫ్‌ను పిలిపించి మాట్లాడితే ‘మేడమ్‌ మా మధ్య సమస్యలకు కారణం వాళ్ళ నాన్న. ప్రతి విషయంలో కల్పించుకుంటాడు. రిజ్వానా వాళ్ళ నాన్న ఏం చెప్తే అదే వింటుంది. ఏదైనా గట్టిగా అంటే చచ్చిపోతానని తల గోడకేసి కొట్టుకుంటది, చాకుతో కోసుకోబోతది. అందుకే నేను వెంటనే వాళ్ళ నాన్నకు ఫోన్‌ చేస్తాను. ఒక రోజు నేను తిన్న ప్లేటు కడగలేదు. మేము వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో అద్దెకు ఉన్నప్పుడు 40 కిలో మీటర్లు జర్నీ చేయాల్సి వచ్చేది. బాగా అలసిపోయేవాడిని. దాంతో తర్వాత రోజు కడుగుతా అంటే నా మాట వినకుండా ఇప్పుడు కడగాల్సిందే అని షింక్‌ వైపు నన్ను తోసింది. నాకు కోపం వచ్చి ఒక దెబ్బ వేశాను. ఇలా ఎప్పుడూ ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. ఇక మా వాళ్ళ ఇంటికి అంటారా పెండ్లి తర్వాత కరోనా వచ్చింది. బాబు చిన్నవాడు, ఆ సమయంలో బయట తిరిగితే ఎలా అందుకే తీసుకెళ్ళలేదు. ఇప్పుడు తీసుకెళ్ళడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు.
తను కూడా ఆఫీస్‌కి వెళ్ళి అలసిపోయి వస్తుంది. నేను ఇంట్లో పనులు చేయాలేనంటుంది. కనీసం మా ఇద్దరి మధ్య రిలేషన్‌ కూడా సరిగా లేదు. పైగా చిన్న పిల్లవాడు ఉన్నాడు చూసుకోవాలి కదా. అందుకే తనని జాబ్‌ మానేయమంటున్నాను. ఆమేమో ‘నువ్వే మానేసెరు, నిన్ను నేను పోషిస్తాను’ అంటుంది. ఇది ఎంత వరకు సరైనది. వాళ్ళ నాన్న కూడా ‘మా అమ్మాయి జాబ్‌ మానేయదు. నా కూతురు ఉద్యోగం చేయాల్సిందే’ అంటాడు. కూతురికి సర్ధి చెప్పాల్సింది పోయి ఆయనే రెచ్చిగొట్టినట్టు మాట్లాడుతున్నాడు’ నాకు నా భార్యను, కొడుకుని తీసుకెళ్ళడానికి ఎలాంటి అభ్యంతరం లేదు కానీ తను జాబ్‌ మానేసి ఇంట్లో బాబును మంచిగా చూసుకుంటే చాలు’ అన్నాడు.
ఇదే విషయం రిజ్వానాకు చెబితే ‘జాబ్‌ మానేయడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. కానీ ఆయన నెల నెలా నా ఖర్చుల కోసం కొంత డబ్బు ఇవ్వాలి. అలాగే మేము ఉండబోయే ఇల్లు కూడా ఆయన ఆఫీస్‌కి దగ్గరలో తీసుకోవాలి. మా అమ్మ వాళ్ళకు కానీ, వాళ్ళ వాళ్ళకు కానీ దగ్గర్లో వద్దు’ అంది.
‘నీ భర్త నీ చేతికి డబ్బు ఇస్తాడు. ఇంట్లో కావల్సిన వన్నీ నువ్వు చూసుకోవాలి’ అని చెప్పాము. దానికి ఆమె తండ్రి ‘ఇప్పటి వరకు మా అమ్మాయి ఇంటి బాధ్యతలు ఏమీ చూడలేదు. తను చేయగలుగుతుందో లేదో’ అన్నాడు. దానికి మేము ‘పిల్లల్ని ఎప్పుడూ తక్కువ అంచనా వేయొద్దు. అందరూ అన్నీ పుట్టుకతో నేర్చుకోరు. అవసరాలే అన్నీ నేర్పిస్తాయి. అమెకు ఇప్పుడు 30 ఏండ్లు. ఇంకా చిన్న పిల్ల కాదు. తన కుటుంబాన్ని తాను చూసుకోగలదు. అవసరమైతే మేం తనకు సహకరిస్తాం. మీకు ఆరోగ్యం బాగోలేదు. అనవసరంగా ఆమె జీవితంలో కల్పించుకుని సమస్యలు తెచ్చుకోకండి. ఇప్పటి వరకు వాళ్ళ భారాలన్నీ మీరే మోశారు. ఇక వాళ్ళ బతుకు వాళ్ళను బతకనివ్వండి. మెల్లగా తనే అన్నీ చూసుకుంటుంది’ అని చెప్పాము.
‘అంతా మీ ఇష్టం మేడమ్‌. మీరు ఎలా చెప్తే అలా చేస్తాం. తను సంతోషంగా ఉంటే మాకు చాలు’ అన్నాడు. షరీఫ్‌ మాట్లాడుతూ ‘తనకు నచ్చినట్టే మా ఆఫీస్‌కు దగ్గరలో, బాబు స్కూల్‌కి ఇబ్బంది లేకుండా ఇల్లు చూసుకుంటాం. రిజ్వానాకు నచ్చితేనే అడ్వాన్స్‌ ఇచ్చి అందులోకి మారతాం. తను అడిగినట్టు ప్రతి నెలా ఖర్చుల కోసం డబ్బు ఇస్తాను. ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాను. కానీ వాళ్ళ నాన్నను మాత్రం మా విషయాల్లో కల్పించుకోవద్దని చెప్పండి’ అన్నాడు.
‘ఇకపై మీ విషయాల్లో ఆయన కల్పించుకోడు. కానీ రిజ్వానాకు ఏమైనా ఇబ్బంది వస్తే మాత్రం మేం ఊరుకోం. ఇప్పటి నుండి మీకు ఎలాంటి సమస్య వచ్చినా మాతో చెప్పుకోండి. కూర్చొని పరిష్కరించుకుదాం. ఇద్దరూ బాబును తీసుకొని వారం వారం సరదాగా బయటకు వెళ్ళి రండి, జీవితాన్ని సంతోషంగా గడపండి’ అని చెప్పి పంపించాము.

Spread the love