రాజకీయ ఎజెండాగా రవాణా రంగం కార్మికుల సమస్య

The issue of transport sector workers as a political agenda–  అన్ని సంఘాలతోనూ ఒకే వేదిక ఏర్పాటు: ఆల్‌ ఇండియా కార్యదర్శి ఆర్‌.లక్ష్మయ్య
నవతెలంగాణ -యాదగిరి గుట్ట
రవాణా రంగంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై దేశవ్యాప్త ఉద్యమం చేపట్టి రాజకీయ ఎజెండాగా మారుస్తామని ఆల్‌ ఇండియా రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (సీఐటీయు) జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్‌.లక్ష్మయ్య అన్నారు. అన్ని సంఘాలతోనూ ఒకే వేదిక ఏర్పాటు చేస్తామని చెప్పారు. యాదాద్రిభువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో జరిగిన తెలంగాణ పబ్లిక్‌ Ê ప్రయివేట్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర కమిటీ సమావేశం గురువారం ముగిసింది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మోటార్‌ వాహన చట్టం-2019 కార్మికులకు తీవ్ర నష్టం చేసేవిధంగా ఉందని చెప్పారు. ఈ చట్టాన్ని ఉపసంహరించే వరకు పెద్దఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని కార్మికులకు పిలుపునిచ్చారు. అధిక పెనాల్టీలు వేస్తూ రవాణా రంగం నుంచి ఒక్కొకరిని తప్పుకునే విధంగా ప్రభుత్వం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నూతన మోటారు వాహన చట్టాన్ని రద్దు చేయాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని అక్టోబర్‌ 6న దేశ వ్యాప్తంగా పెద్దఎత్తున పోరాట కార్యక్రమం చేపట్టనున్నట్టు వివరించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లూరి మల్లేశం మాట్లాడుతూ.. ఈ నెల 8న ట్రాన్స్‌పోర్ట్‌ ఐక్య కార్యాచరణగా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. యాదగిరిగుట్టపైకి ఆటోలకు అనుమతి ఇవ్వాలని 486 రోజులుగా పోరాటం చేస్తున్నా స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని విమర్శించారు. 300 కుటుంబాలకు ప్రత్యామ్నాయం చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు యండి పాషా, రాష్ట్ర ఉపాధ్యక్షులు రుద్ర కుమార్‌, కోటయ్య, రాంబాబు, రాష్ట్ర కార్యదర్శులు సాయిలు, పున్నం రవి, రవికుమార్‌, విజేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love