మల్లు స్వరాజ్యం జీవితం స్ఫూర్తిదాయకం

The life of Mallu Swaraj is inspiring– నాటి పోరాటానికి మతం రంగు పూస్తున్న బీజేపీ : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
– ఉమ్మడి నల్లగొండ జిల్లాలో స్వరాజ్యం ద్వితీయ వర్ధంతి కార్యక్రమాలు
నవతెలంగాణ- విలేకరులు
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, వీరనారి మల్లు స్వరాజ్యం జీవితం స్ఫూర్తిదాయకమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. మంగళవారం ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా స్వరాజ్యం ద్వితీయ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు రాయునిగూడెంలో మల్లు స్వరాజ్యం జ్ఞాపకార్థం ఆమె కుటుంబ సభ్యులు నిర్మించిన మల్లు స్వరాజ్యం స్మారక కళావేదికను జూలకంటి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. ఈ తరానికి ఆమె ఒక స్ఫూర్తి అని, ఆమె పోరాటం అందరికీ ఆదర్శమని అన్నారు. తుపాకీ పట్టి నిజాంను గడగడలాడించిన వీరవనిత మల్లు స్వరాజ్యం అని కొనియాడారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ దుర్మార్గంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి మతం రంగు పూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఆనాటి అమరవీరుల త్యాగానికి ద్రోహం చేసినట్టు అవుతుందన్నారు. వీర తెలంగాణ సాయుధ పోరాట వారసత్వమైన లౌకికత్వాన్ని రక్షించుకోవాల్సిన అవసరం మనందరిపైనా ఉందన్నారు. దేశంలో మతసామరస్యాన్ని చెడగొట్టి మతోన్మాదాన్ని పెంచి పోషించాలన్న బీజేపీ కుట్రలను అడ్డుకోవడానికి లౌకికవాద శక్తులు, రాజకీయ పార్టీలు భాగస్వామ్యం కావాలని కోరారు. నమ్మిన ఆశయం కోసం కొట్లాడిన వీరవనిత స్వరాజ్యమని, ఆమె ఆశయ సాధనకు మనమంతా కృషి చేయాలని అన్నారు. మహిళ ఉద్యమానికి స్వరాజ్యం దిక్సూచి అన్నారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో ప్రముఖ రాజకీయ నాయకులు పాదూరి కరుణ, సీపీఐ(ఎం) నాయకులు తదితరులు పాల్గొన్నారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో మల్లు స్వరాజ్యం చిత్రపటానికి సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పూలమాలలేసి నివాళి అర్పించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని దొడ్డి కొమురయ్య భవనంలో నిర్వహించిన మల్లుస్వరాజ్యం వర్ధంతి కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి పాల్గొని నివాళి అర్పించారు. ఆమె ఆశయాలకు పునరంకితమవుదామని పిలుపునిచ్చారు. జీకే అన్నారంలో ఐద్వా ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు.
భువనగిరి పట్టణంలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మల్లు స్వరాజ్యం స్ఫూర్తితో మతోన్మాదంపై పోరాటాలకు సిద్ధం కావాలని, రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్‌ అన్నారు. ప్రభుత్వాల మహిళా వ్యతిరేక విధానాలపై వీరనారి మల్లు స్వరాజ్యం స్ఫూర్తితో ఉద్యమించాలని ఐద్వా యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి బట్టుపల్లి అనురాధ అన్నారు. ఐద్వా ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలో స్వరాజ్యం వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఆలేరు మండల కేంద్రంలో మల్లు స్వరాజ్యం చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. చౌటుప్పల్‌ మండల కేంద్రంలోని కందాల రంగారెడ్డి స్మారక విజ్ఞాన కేంద్రంలో మల్లు స్వరాజ్యం చిత్రపటానికి పూలమాలలేసి నివాళి అర్పించారు.

Spread the love