దేశాన్ని కాపాడుకోవడమే కార్మిక, కర్షకుల ప్రధాన కర్తవ్యము

– కార్మిక సంఘాల పిలుపు
నవతెలంగాణ – కంటేశ్వర్
దేశాన్ని కాపాడుకోవడమే కార్మిక కర్షకుల ప్రధాన కర్తవ్యం అని కార్మిక సంఘాల నాయకులు పిలుపును ఇచ్చారు. ఈ మేరకు శుక్రవారం కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్పొరేట్ – మతతత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త కార్మికుల సమ్మెలో భాగంగా కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ (సీఐటీచయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్టియు, వివిధ  కార్మిక సంఘాల నాయకులకు) ఆధ్వర్యంలో  రాజీవ్ గాంధీ ఆడిటోరియం వద్ద బహిరంగ సభ జరిపి, అనంతరం ధర్నా చౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సభకు సీఐటీచయూ, ఏఐటీయూసీ, ఐ ఎఫ్ టి య, సంఘాల బాధ్యులు నూర్జహాన్ ఎం.సుధాకర్, వై.ఓమయ్య, సుధాకర్  శివకుమార్ లు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తలుగా వచ్చిన , సీఐటీచయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్వీ రమ, ఏఐటీయూసీ  జాతీయ నాయకులు ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ, ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు జి.భూమయ్య లు మాట్లాడుతూ…దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మె, గ్రామీణ భారత్ బంద్ జయప్రదమైందన్నారు. మోడీ ప్రభుత్వం కార్పొరేటు అనుకూల విధానాలు పాటిస్తూ, కార్మిక వర్గానికి తీవ్ర అన్యాయం చేస్తుందన్నారు. కార్మిక వ్యతిరేక నాలుగు కోడ్ లను వెంటనే రద్దు చేయాలన్నారు. రైతులకు ఇచ్చిన కనీస మద్దతు ధర, రైతు వ్యతరేక చట్టాలను శాశ్వతంగా రద్దు చేయడం వంటి హామీలను నెరవేర్చాలన్నారు. గత పది ఏళ్లుగా దేశంలో నిరుద్యోగిత రేటు పెరిగిందన్నారు.  సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాల హామీ హామీగానే మిగిలిపోయిందన్నారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలన్నారు. మోడీ ప్రభుత్వ విధానాల వల్ల కార్పొరేట్ సంస్థల లాభాలు గరిష్ట స్థాయికి చేరాయన్నారు. తద్వారా కార్పొరేట్ల ఆదాయం 30% వృద్ధి చెందగా, పేద మధ్యతరగతి ప్రజల ఆదాయం 11% పడిపోయిందన్నారు. బిజెపి ప్రభుత్వ హయాంలోనే ధరలు 30% నుండి 56% శాతం వరకు పెరిగాయన్నారు.  పెట్రోలు ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం పన్నుల వాటాను 243 శాతానికి పెంచిందన్నారు.  2023లో కార్పొరేట్లకు 2.14 లక్షల కోట్లు బ్యాంకు రుణాలను మాఫీ చేశారని ఆరోపించారు. ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించే వైఖరిని విడనాడాలన్నారు. మోడీ విధానాల వల్ల మధ్యతరగతి ప్రజల జీవితాలు అతుకుల బతుకులుగా మారాయన్నారు. ప్రస్తుతం దేశం మతతత్వ విద్వేష రాజకీయాలతో అట్టుడుకుతుందన్నారు. దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత కార్మికులు, రైతులపైనే ఉందన్నారు. కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, సిపిఐ రాష్ట్ర నాయకులు కే.భూమయ్య, సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి.ప్రభాకర్, న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు వేల్పూర్ భూమయ్య, న్యూడెమోక్రసీ జిల్లా జిల్లా కార్యదర్శి బి.భాస్కర్ మాట్లాడారు. ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.నరేందర్, ఏఐపి కేఎంఎస్ జిల్లా అధ్యక్షులు సాయగౌడ్, ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు గంగారెడ్డి,  వివిధ కార్మిక సంఘాలు, రైతు సంఘాల నాయకులు డి.రాజేశ్వర్, రాములు, నర్సింగరావు, భూపతి, సూరి రఘురాం, గణేష్, అశూర్, కిరణ్, విటల్, రవి, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love