– ప్రభుత్వానికి సెక్యూరిటీ గార్డ్స్ యూనియన్ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రయివేట్ సెక్యూరిటీ గార్డుల కనీస వేతనం రూ. 28,000లుగా నిర్ణయించా లని సెక్యూరిటీ గార్డ్స్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం కార్మిక శాఖ డైరెక్టర్‌ను కలిసి యూనియన్ నాయకులు వినతి పత్రం అందించారు. తక్షణం జీఓ నెం.21ను గెజిట్ చేసి అమలు చేయాలని ప్రభుత్వా నికి విజ్ఞప్తి చేశారు. సాధ్యం కాని పక్షంలో జీఓ ఆర్‌టి నెం.81కి సవరణలు చేసి సెక్యూరిటీ గార్డ్‌ల కనీస వేతనం రూ. 27,781లు నిర్ణయించడంతో పాటు, డీఏ రూ.16.28 పెంచాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ జీ.వోలో సవరణలు చేసి కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.ఈశ్వర్ రావు, కార్యదర్శి బి.మధు, తెలంగాణ ప్రయివేట్ సెక్యూరిటీ గార్డ్స్ అండ్ అలైడ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కన్వీనర్ యాటల సోమన్న, సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు జె.కుమార స్వామి, నాయకులు సి.మల్లేష్ తదితరలు పాల్గొన్నారు.