భారత రాజ్యాంగం ప్రజాస్వామ్య పరిరక్షణ కాంగ్రెస్‌ ధ్యేయం

Constitution of India The mission of Congress is to protect democracy– బిజెపి హయాంలో అసమానతలు పెరిగాయి
– ‘ఇండియా ‘తో బిజెపి ఆగడాలకు చెక్‌ :అఖిల భారత కాంగ్రెస్‌ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే
నవతెలంగాణ – హైదరాబాద్‌ బ్యూరో
భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందని అఖిల భారత కాంగ్రెస్‌ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అన్నారు. దేశంలో ఎస్సి,ఎస్టి, బిసి, అణగారిన వర్గాల హక్కులకు నష్టం కలిగించే విధానాలను కాంగ్రెస్‌ తీవ్రంగా ఖండిస్తుందని చెప్పారు. శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైన సిడబ్ల్యుసి సమావేశంలో ఖర్గే అధ్యక్షోపన్యాసం చేశారు. గత తొమ్మిదనరేళ్లుగా కేంద్రంలో బిజెపి అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేకవిధానాలను ఆయన ఎండగట్టారు. కాంగ్రెస్‌ పార్టీ ఉద్దేశ్యాలను, లక్ష్యాలను వివరించారు. దేశంలో అంతర్గత సమస్యలు పెరుగుతున్నాయని చెప్పారు.ద్రవ్యోల్బణం పెరిగి నిత్యవసర ధరలు ఆకాశానంటుతున్నాయని, పేదలకు బతుకు భారంగా మారుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. రైతులు, కార్మికులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. మణిపూర్‌ మారణకాండ భారతదేశ లౌకిక, అభ్యుదయ విధానాలను ప్రశ్నిస్తోందని అసహనం వ్యక్తంచేశారు. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశంలో అసమానతలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తంచేశారు. దేశ ఆర్ధిక వ్యవస్థ ప్రమాదకర స్థితిలో ఉందని, జాతీయ సంపదను తన కార్పొరేట్‌ మిత్రులకు ప్రధాని మోడీ దోచిపెడుతున్నారని చెప్పారు. వరదలు, కరువు, ప్రకృతి వైపరిత్యాలతో నష్ట పోయన ప్రజలను ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫమైందన్నారు. చైనా ఆక్రమణలు దేశానికి ప్రమాదకరంగా ఉన్నా మోడీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని చెప్పారు. విపక్షాలపై బిజెపి కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్నారు. 27 పార్టీలతో ఏర్పడిన ఇండియా కూటమి బిజెపి నిరంకుశవిధానాలను అడ్డుకుంటుందని స్పష్టంచేశారు.
తెలంగాణలో భారీ కుంభకోణాలు – పవన్‌ ఖేరా
తెలంగాణలో అన్నీ పెద్ద కుంభకోణాలే వినిపిస్తున్నాయని ఎఐసిసి అధికార ప్రతినిధి పవన్‌ ఖేరా అన్నారు. శనివారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. బిఆర్‌ఎస్‌ విమర్శలపై స్పందించారు. సీఎం కేసీఆర్‌ కుమార్తె కవితను ఇడి విచారణకు ఎందుకు పిలిచింది? ధైర్యంగా ముందుకు వస్తే అన్ని కుంభకోణాల గురించి మాట్లాడదామని సూచించారు. కేంద్రంతో ఎలా పోరాడుతున్నామో కవితకు తెలియదా? అదానీ గురించి కవిత ఎందుకు మాట్లాడరు? అని ప్రశ్నించారు.

Spread the love