పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

– ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట జీపీ కార్మికుల ధర్నా
– ఆయా గ్రామాల నుంచి వేల సంఖ్యలో తరలి వచ్చిన కార్మికులు
నవతెలంగాణ-ఆమనగల్‌
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికులు చేపడుతున్న నిరవధిక సమ్మె 13వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా మంగళవారం సీఐటీయూ జిల్లా నాయకులు గుమ్మడి కురుమయ్య ఆధ్వర్యంలో ఆమనగల్‌, కడ్తాల్‌, మండలాలకు చెందిన జీపీ కార్మికులు వివిధ వాహనాల్లో కల్వకుర్తిలో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా కల్వకుర్తి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సీఐటీయూ నాయకులతో కలిసి జీపీ కార్మికులు స్థానిక మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ ద్వారా ఎమ్మెల్యేకు అందజేశారు. అంతకు ముందు ధర్నాను ఉద్దేశించి గుమ్మడి కురుమయ్య మాట్లాడారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచే కార్మికులు గత 13 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టం అన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ స్పందించి జీపీ కార్మికుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. అలాకాని పక్షంలో సమ్మెను మరింత ఉదృతం చేస్తామని, గ్రామాలలో ప్రజా ప్రతినిధులను తిరుగనివ్వమని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల కో కన్వీనర్‌ ఆశిర్వాదం, సభ్యులు దశరథం, నరేష్‌, మహేష్‌, కుమార్‌, రవి, లక్ష్మయ్య, సుగుణమ్మ, చెన్నయ్య, సరస్వతి, చంద్రకళ, కృష్ణయ్య అంజమ్మ కాశయ్య, చిట్టెమ్మ, బాబయ్య తదితరులు పాల్గొన్నారు.

Spread the love